కేంద్రం నిర్ణయాలు తీసుకున్న వెంటనే రాష్ట్రాలు తీసుకోలేవు

– ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌
న్యూ ఢిల్లీ : రాష్ట్రానికి ఎక్సైజ్‌ ద్వారానే ఆదాయం వస్తుందని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నంత సులభంగా రాష్ట్రం తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. పెట్రో ధరలపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రానికి ఉండే ఖర్చులు వేరు.. కేంద్రానికి ఉండేవి వేరని.. ఇప్పటికే పెంచిన పన్నును కొంతమేర తగ్గించినట్లు పేర్కొన్నారు. దిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా కొంత మంది సహాయ మంత్రులను కలిసిన అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించి పరిష్కారం కాకుండా ఉన్న అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌ అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు బుగ్గన పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రులు భగవత్‌ కరాడ్‌, పంకజ్‌ చౌదరిని కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించానన్నారు. అన్‌రాక్‌ ఆర్బిట్రేషన్‌ వ్యవహారంపై కేంద్ర మంత్రితో చర్చించినట్లు చెప్పారు. అన్‌రాక్‌ ఆర్బిట్రేషన్‌ లీగల్‌ అంశమని.. సుదీర్ఘ ప్రక్రియ ఉందన్నారు.