– వైసిపికి అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య ప్రశ్న
వైసీపీ ప్రభుత్వ పాలనలో నాలుగేళ్ళ నుంచి దళితుల సంహార యాత్ర జరుగుతూనే ఉందని, రాష్ట్రంలో ఏదో ఒక చోట దళితుల ఆర్త నాదాలు వినబడకుండా, రక్తపు మరకలు అంటకుండా వైసీపీ పాలన లేదని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
చరిత్రలో బకాసురుడు అనే రాక్షసుడు ఇంటికొకరి చొప్పున మాత్రమే భుజిస్తే, వైకాపా ప్రభుత్వం రోజుకు మూడు హత్యలు, ఆరు అత్యాచారాలతో పాలన చేస్తుందని ధ్వజమెత్తారు. పదిమందిని కాటేసిన పాము ఆఖరికి తన పిల్లలను కూడా కాటేసుకుంటుందన్నట్లు, హోం మంత్రి ఇలాకాలోనే వైసీపీ కార్యకర్త బొంతా మహేంద్ర ప్రాణాలను కూడా తీశారన్నారు. రక్షించాల్సిన పోలీసులు భక్షణ వ్యవస్థగా మారినట్లు చెప్పారు. దళితులు చనిపోతే, ప్రభుత్వం డబ్బులు ఇస్తే, సరిపోతుందిలే అనే దుర్మార్గమైన వైఖరిని ప్రవేశ పెట్టిందన్నారు. హత్యలకు , అత్యాచారాలకు, అవమానాలపై కఠిన చర్యలు తీసుకోకుండా, తులమో, ఫలమో ఇచ్చి చేతులు దులుపు కోవటం చేతకాని పాలనకు నిదర్శనం కాదా? అని దుయ్యబట్టారు.
నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్, నంద్యాలలో అబ్దుల్ సలాం, గోప్తాడులో బాల నరసింహులు, కోనసీమలో ప్రగడ శ్రీకృష్ణ భగవాన్, శ్రీకాకుళంలో కోన వెంకట రమణ, గుంతకల్లులో ఖాజావలి, కంచికచర్లలో ఎం. రాజశేఖర్ రెడ్డి, పరవాడలో ఆర్మీ ఉద్యోగి సయ్యద్ ఆలీ, విశాఖపట్నంలో ఎర్ని బాబు, కాకినాడలో డాక్టర్ ఆనంద కుమార్, చాగల్లులో వడ్డి వెంకట ప్రసాద్, సీతారాంపురంలో శిరోముండనం వర ప్రసాద్, కొవ్వూరులో బొంతా మహేంద్ర సంఘటనలు వైసీపీ పోలీసు వ్యవస్థకు సాక్షీ భూతాలుగా నిలిచాయన్నారు.
దళితుల ప్రాణాలను హరించే దోషుల ఆస్తులను జప్తు చేసే చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. నేరగాళ్ళ గుండెల్లో వణుకు పుట్టించనంత వరకు దళితులపై ఏ దాడులనూ అరికట్టలేరని తెలిపారు. ఏపీలో జరిగిన మొత్తం సంఘటనలపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి చేత విచారణ సంఘాన్ని నియమించాలని కోరారు. దొమ్మేరు సంఘటనకు నైతిక భాధ్యత వహించి హోం మంత్రి తానేటి వనిత పదవికి రాజీనామా చేసి విలువలకు పట్టం కట్టాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు.