డ్రామాలు అపి రైతుల కన్నీళ్లు తుడవండి…

– పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు అపి కల్లాల్లో వున్న వడ్లను కొనుగోలు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడ్ల కల్లాలకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగాశుక్రవారం కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలనను సందర్శించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు.
జిల్లా కేంద్రంతో పాటు బస్వాపూర్, భిక్కనూరు, భవానిపేట్, పాల్వంచ, లింగంపేట, నల్లమడుగు, శెట్పల్లి సంగారెడ్డి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడారు.లింగంపేటలో ఇటీవల వరి కుప్ప వద్ద మృతి చెందిన రైతు బీరయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులనుద్దేశించి రేవంత్ మాట్లాడారు.పంటలపై ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకొని వెళ్ళాల్సిందని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతోనే రైతులు వరి కుప్పల వద్ద అకాల మరణాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రైతులు వడ్లు కొనుగోలు కేంద్రాలకు తరలించి 20 రోజులు గడిచిన కాంటా (తూకం) చేయడం లేదన్నారు. ఇందులోనే వర్షాలు రావడం, తెచ్చిన ధాన్యం కళ్ళముందే తడిసి ముద్దవుతుంటే ముఖ్య మంత్రి ధర్నా చౌక్ వద్ద ఏసి పెట్టుకొని ధర్నా చేస్తున్నారని రేవంత్ ఏద్దేవా చేశారు. వానాకాలంలో పండించిన చివరి గింజ వరకు కొంటానన్న కెసిఆర్ యాసంగి గురించి ధర్నా చేయడం రైతులను మోసం చేయడమేనన్నారు.
రైతులు కష్టంచి పండించిన ధాన్యమని, కాళేశ్వరం, మిషన్ కాకతీయ పనుల్లో వచ్చిన కమిషన్ కాదని టీఆర్ఎస్ నాయకులను ఎండగట్టారు. కల్లాల్లో కొనుగోలు చేసే వారు లేక రోడ్లపైనే వడ్లు ఆరబోసుకొని అక్కడే ప్రాణాలు వదులుతున్నారన్నారు. నిజామాబాదు, కామారెడ్డి జిల్లాల రైతులు పంజాబ్, హర్యానా రైతుల మాదిరిగా కొట్లాడాలని పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్, బీజేపీలు కలిసి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. డ్రామాలు ఆడే వారిని రాళ్లతో కొట్టాలన్నారు.రైతులు పడుతున్న కష్టాలను క్షేత్రస్థాయిలో చూస్తే పార్లమెంట్ లో కళ్ళకు కట్టినట్లు చెప్పడానికే ఈ కార్యక్రమం తీసుకున్నట్లు చెప్పారు.తెలంగాణలో రైతులకు జరుగుతున్న నష్టాలపై ఈ నెల


29 న ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్థావిస్తానని రేవంత్ అన్నారు. రైతు సమస్యలపై పార్లమెంట్ వేదికగా కొట్టాడుతామన్నారు.కల్లాల్లో రైతులు తడిసిన ధాన్యాన్ని రేవంత్ రెడ్డికి చూపించి తమగోడు వెళ్ళబోసుకున్నారు. కెసిఆర్ ధర్నాలు, డ్రామాలు ఆపి కల్లాల్లోకి రావాలని సవాల్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని, రైతులెవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు.ప్రభుత్వం మెడలు వంచి కొనుగోలు చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందన్నారు. రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ నాయకులు మదన్మోహన్ రావు, షబ్బీర్ అలీ, సురేష్ శెట్కార్, గంగారాం, కాసుల బాలరాజు, సుభాష్ రెడ్డి తదితరులు ఉన్నారు.