– మొరాయిస్తున్న సర్వర్లు
– జనం అసహనం
అమరావతి: గుంటూరు, విజయవాడ, విశాఖ, కర్నూలు, ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలాయాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. పాత ధరలతో రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ప్రజలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు భారీగా తరలివస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి నూతన రిజిస్ట్రేషన్ ధరలు అమల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిమేర రిజిస్ట్రేషన్ విలువలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో, గత కొన్ని రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు, ఇతర రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారితో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి.
ఒక్కసారిగా రద్దీ పెరగడంతో సర్వర్లు మొండికేస్తున్నాయి. దాంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిదానంగా సాగుతోంది. ఉదయం వచ్చిన వారు సాయంత్రం వరకు, ఒక్కోరోజు తర్వాత రోజు కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సర్వర్లు స్లో అవుతుండటంతో క్యూలో నిల్చున్న ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు ఇప్పుడే చేయించుకుంటే కొంత డబ్బులయినా మిగులుతాయన్న ఆశతో, జనం రిజిస్ట్రార్ ఆఫీసులకు క్యూలు పెడుతున్నారు.