Suryaa.co.in

Editorial

ఏపీ, తెలంగాణ కమలదళపతులుగా సుజనా, రామచందర్‌రావు?

  • ఈ నెలాఖరున ప్రటన

  • పూర్తయిన జిల్లా అధ్యక్షుల ఎంపిక

  • ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సుజనా చౌదరి

  • మళ్లీ తనకే ఇవ్వాలంటున్న పురందేశ్వరి

  • ఎమ్మెల్యేలు, సీనియర్ల మద్దతు చౌదరికే

  • పార్ధసారథికి లక్ష్మణ్ ఒక్కరి మద్దతే

  • తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్‌రావు ఖరారు

  • సంఘ్, సీనియర్ల మద్దతు ఆయనకే

  • ఈటల పేరుపై సంఘ్ విముఖత

( మార్తి సుబ్రహ్మణ్యం)

రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది. జిల్లా అధ్యక్షుల ఎంపికను పూర్తి చేసిన బీజేపీ నాయకత్వం ఇక రాష్ట్ర అధ్యక్షుల ఎంపికపై దృష్టి సారించింది. పేరుకు జిల్లా అధ్యక్షుల అభిప్రాయ సమీకరణ అని చెబుతున్నప్పటికీ, జాతీయ నాయకత్వం సూచించిన వారికే అధ్యక్ష పదవి దక్కుతుందన్నది బహిరంగ రహస్యమే.

ఆ ప్రకారంగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమాజీ మంత్రి, విజయవాడ ఎమ్మెల్యే సుజనా చౌదరి, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎన్.రామచందర్‌రావు ఎంపిక దాదాపు ఖరారయిందని, ప్రకటన లాంఛనమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నెలాఖరుకు వీరి పేర్లు ప్రకటించనున్నారు. వీరిలో సుజనా చౌదరి గతంలో రెండుసార్లు రాజ్యసభ ఎంపీ, ఒకసారి మోదీ మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆయనకు వివాదరహితుడిగా, పెద్దమనిషిగా పేరుంది.

ఇక రామచందర్‌రావు పుట్టు బీజేపీ. ఏబీవీపీ నేతగా విద్యార్ధి రాజకీయాల నుంచి బీజేవైఎం, లీగల్ సెల్, బీజేపీలో వివిధ స్థాయిలో పనిచేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికల్లో గెలిచిన ఆయనకు, సంఘ్ నుంచి తిరుగులేని మద్దతుంది. ప్రధానంగా హైదరాబాద్‌లో పోలీసులపై ఆయన చేసిన పోరాటం ఇప్పటికీ అందరికీ గుర్తే. అరుణ్ జైట్లీ హయాంలో ఆయన చక్రం తిప్పారన్న పేరుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దాతో సన్నిహిత సంబంధాలున్నాయి. పైగా వివాదరహితుడు, గ్రూపులు కట్టరన్న పేరు ఆయనకు ప్లస్ పాయింట్‌గా మారింది.

ఏపీలో అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా ముగ్గురి మధ్య పోటీ నడిచినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన హయాంలో పార్టీకి 8 ఎమ్మెల్యే, మూడు ఎంపీ సీట్లు వచ్చినందున తిరిగి తననే కొనసాగించాలని, ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరి కోరుతున్నట్లు సమాచారం. అయితే వివిధ కారణాలతో ఆమెను కొనసాగించేందుకు, నాయకత్వం సుముఖంగా లేదన్నది పార్టీ వర్గాల్లో జరుగుతున్న సమాచారం.

ఇక ఎమ్మెల్యే పార్ధసారథి తనకు బీసీ కోటాలో అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఆయనకు ఓబీసీ జాతీయ కన్వీనర్, ఎంపి డాక్టర్ లక్ష్మణ్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు మినహా, ఎవరూ మద్దతునివ్వడం లేదంటున్నారు. పైగా ఆయన గత ఎన్నికల్లో పార్టీ సీటు ఇచ్చినా చివరి నిమిషంలో రాజీనామా చేసి, కర్నూలు టీడీపీ ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నించిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ కోణంలో చూస్తే ఆయనకు అధ్యక్ష పదవి కష్టమంటున్నారు.

పార్టీలో తొలినుంచీ పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌కు.. పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు, కాశివిశ్వనాధరాజు మద్దతులేదు. గతంలో ఆయనకు సంఘ్ మద్దతు ఉన్నప్పటికీ, ఇప్పుడు వారి మద్దతులేదన్న ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లా నుంచి సీనియర్ నేత సురేష్‌రెడ్డి కూడా అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. మరో సీనియర్ నేత విష్ణువర్దన్‌రెడ్డి కూడా అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లు చెబుతున్నారు.

సీనియర్ నేత పురిఘళ్ల రఘురామ్ కూడా, సంఘ్ ఆశీర్వాదంతోనే అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో అగ్రనేతలతో సత్సంబంధాలున్న రఘురామ్, బ్రాహ్మణ కోటాలో అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. వి.రామారావు తర్వాత బీజేపీలో బ్రాహ్మణులకు అధ్యక్ష పదవి ఇవ్వలేదన్నది ఆయన వాదన. అదే సమయంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన గుంటూరు నేత జయప్రకాష్ కూడా అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు.

అయితే వివిధ సమకరణల దృష్ట్యా.. కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరికే రాష్ట్ర అధ్యక్ష పదవి ఖరారు అయినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీతో సమన్వయం చేసుకోవడం, అదే సమయంలో పార్టీకి విధేయతగా ఉండటం అవసరం. ఒకవైపు టీడీపీ-జనసేనతో సమన్వయం నిర్వహిస్తూనే, మరోవైపు పార్టీని విస్తరించడం నాయకత్వ లక్ష్యం. ఈ అంశాల్లో ఏ వర్గానికీ చెందని వివాదరహితుడైన సుజనా చౌదరి అర్హులని జాతీయ నాయకత్వం భావిస్తోంది.

అటు మంత్రి, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా సుజనా వైపే మొగ్గు చూపిస్తున్న క్రమంలో ఆయన పేరు దాదాపు ఖరారయిందంటున్నారు. సంఘ్‌కు ఆయనపై పూర్తి అనుకూలత లేకపోయినా, వ్యతిరేకత మాత్రం లేకపోవడం సుజనాకు ప్లస్ పాయింటని పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. సుజనా అధ్యక్షుడయితే, తమపై ఆర్ధికభారం పడదన్నది మిగిలిన వారి భావనగా కనిపిస్తోంది. పైగా ఆయన తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదు. అవకాశం ఇస్తే చేద్దామన్న భావనతో ఉన్న సుజనా నైజం.. నాయకత్వానికి తెలిసిందుకే, ఆయన పేరు దాదాపు ఖరారు చేసిందంటున్నారు.

ఇక తెలంగాణలో మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ బీసీల్లో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారు కావడం, ఆయనకు కలసి వస్తుందన్నది ఆయన భావనగా కనిపిస్తోంది. తొలుత అధ్యక్ష పదవి కోసం కొంతమంది ఎంపీల పేర్లు వినిపించినప్పటికీ.. ఇప్పుడు కేవలం రాంచందర్‌రావు-ఈటల రాజేందర్ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి.

అయితే రాజేందర్‌కు సంఘ్ నుంచి మద్దతు లేదు. అటు మిగిలిన ఎంపీల మద్దతు కూడా లేదు. కనీసం పార్టీ సీనియర్ల నుంచి కూడా మద్దతు లేకపోవడం ఈటలకు మైనస్‌గా మారింది. ప్రధానంగా బండి సంజయ్ ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అదే సీనియర్ నేత రామచందర్‌రావు అయితే అందరికీ అనుకూలంగా ఉంటారని, ఆయనకు ప్రత్యేకంగా వర్గమంటూ లేనందున, ఆయనతో స్వేచ్ఛగా మాట్లాడటం సులభమన్నది సీనియర్ల భావన. ఆ కోణంలోనే రామచందర్‌రావును వారు బలపరుస్తున్నారు. ఈపాటికే వారంతా జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌జీకి తమ అభిప్రాయం వెల్లడించినట్లు సమాచారం. ఒక ప్రత్యేక కారణంతో తెలంగాణ బీజేపీ ప్రముఖులంతా ఈటలకు బదులు రామచందర్‌రావునే బలపరుస్తున్నారన్న చర్చ జరుగుతోంది.

LEAVE A RESPONSE