Suryaa.co.in

Andhra Pradesh

ఆర్థిక పరిస్థితి అంటూ సూపర్ సిక్స్ కు సున్నం

– పవన్ కళ్యాణ్ తో రెండు మూడు సినిమాలు తీస్తే వారికి వందల ఎకరాలు దోచి పెడుతున్నారు
– ఎన్నికల హామీల అమలుపై చేతులెత్తేశారు
– సచివాలయం సాక్షిగా సూపర్ సిక్స్ అమలు ఉండదంటూ స్పష్టం
– ఎన్నికల ముందు హామీలు… అధికారంలోకి వచ్చిన తరువాత ఎగవేతలు
– నెల్లూరు క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం

నెల్లూరు: ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి, హామీలతో కనికట్టు చేసిన దీ గ్రేట్ మోసగాడు నారా చంద్రబాబు ఎట్టకేలకు తన ముసుగు మొత్తం తీసేశారని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయం సాక్షిగా ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కుదరదు అంటూ చాలా స్పష్టంగా చంద్రబాబు తేల్చి చెప్పేశారని అన్నారు.

చంద్రబాబు అధికారంలోకి వస్తే చంద్రముఖిని మళ్లీ లేపినట్టేనని, పులినోట్లో తల పెట్టడమేనని మా నాయకుడు వైయస్ జగన్ ఎన్నికల సమయంలో చేసిన హెచ్చరికలు మరోసారి నిజం అని చంద్రబాబు నిరూపించుకున్నారు. . మాట ఇచ్చి తప్పిన చంద్రబాబును, మాట మీద నిలబడ్డ వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ఇవాళ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. జగన్ విశ్వసనీయతను, ఆయన చిత్తశుద్ధి, సంకల్పం ఎంత గొప్పవో మరోసారి ఈ సందర్భంగా అందరూ పోల్చి చూస్తున్నారు.

ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 9 నెలలు కావొస్తోంది. ఈ 9 నెలలకాలంలో దాదాపుగా రూ.1.19 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు. మరి అప్పులతో ఎక్కడ సంపద సృష్టించారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీకు ఆర్థికంగా ఎక్కడ కలిసి వస్తుందో అవి మాత్రమే చేస్తున్నారన్నది నిజం కాదా? సంపదలు ఏమైనా సృష్టిస్తున్నారంటే అది మీకోసం తప్ప, మీ నాయకులకుకోసం, చంద్రబాబునాయుడు మనుషులకోసం తప్ప మరెవ్వరికీ కాదు. మీ పార్ట్ నర్ పవన్ కళ్యాణ్ తో రెండు మూడు సినిమాలు తీస్తే.. వారికి వందల ఎకరాలు దోచి పెడుతున్నారు. సంపద సృష్టి అలాంటి వారికి జరుగుతుంది తప్ప, రాష్ట్రానికీ, ప్రజలకూ కాదు.

05.04.2022న రాష్ట్రం శ్రీలంక అవుతోందంటూ చంద్రబాబు ప్రకటన చేశారు. 17.05.2022న శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలో’.. అని చంద్రబాబు పార్ట్ నర్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. 07.04.2024న రాష్ట్ర అప్పులు ఏకంగా రూ.12.50 లక్షల కోట్లు అని చంద్రబాబు గారి వదినమ్మ పురంధీశ్వరి ప్రకటించారు. కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. 21.04.2024న ఎన్నికలకు కొన్నాళ్ల ముందు చంద్రబాబుకు వంతపాడే ఈనాడు దినపత్రిక ఒకాయనను పట్టుకొచ్చి, ఆయన ఆర్థిక నిపుణుడు అని ప్రకటించి ఆయనతో రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లు అని చెప్పించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలను మోసం చేయడానికి డబ్బుల్లేవు, కొండల్లా అప్పులున్నాయి, చూస్తే భయమేస్తోందని కథలు చెప్పడం ప్రారంభించారు. పోనీ చంద్రబాబు అప్పులు తీసుకు రావడంలేదా? అంటే ప్రతి మంగళవారం ఆర్బీఐ తలుపు కొడుతూనే ఉన్నాడు. ఈ తొమ్మిది నెలల కాలంలో అన్నిరకాల అప్పులు కలిపి సుమారు రూ.1.19 లక్షల కోట్లు తెచ్చా రు. .

వాస్తవం ఏంటంటే.. అప్పులు ఎంత కావాలంటే, అంత తీసుకోవడానికి అనుమతి ఉండదు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా అప్పులు తేవాలంటే ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందే. చట్టం అనుమతించిన ప్రకారం ఆ రాష్ట్ర జీఎస్డీపీలో 3 శాతం నుంచి 3.5 శాతం వరకూ మాత్రమే అప్పులు తేవడానికి ఆస్కారం ఉంటుంది.

LEAVE A RESPONSE