– స్విస్ అంబాసిడర్ మృదుల్ కుమార్ తో సీఎంతో కలిసి మంత్రి లోకేష్ బృందం భేటీ
జ్యురిచ్/దావోస్: స్విట్జర్లాండ్ లో ఫార్మా పరిశ్రమ వంద బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగి ఉంది, నోవార్టిస్, రోచె, లోన్జా, ఆల్కాన్ వంటి ఔషధ దిగ్గజ కంపెనీల యూనిట్లను ఏపీలో ఏర్పాటుచేసేందుకు మీవంతు సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. జ్యురిచ్ లోని హిల్టన్ హోటల్ లో స్విట్జర్లాండ్ లోని భారత రాయబారి మృదుల్ కుమార్ తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ… స్విట్జర్లాండ్‌లోని ఇంజినీరింగ్, ఐటీ, ఫార్మాస్యూటికల్స్, పారామెడికల్ రంగాల్లో 27,300 మంది భారతీయులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విదేశీ పెట్టుబడులకు పూర్తి అనుకూలంగా ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో నూతన పారిశ్రామిక పాలసీలను ప్రకటించారు. మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్ టైల్స్, మిషనరీ, హార్డ్ వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్, రైల్ కాంపొనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా స్యూటికల్స్, వైద్య పరికరాల తయారీ పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడులకు పలు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నాం.
ఏపీలో స్కిల్ యూనవర్సిటీ, ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. ఇందుకు ఏపీ- స్విట్జర్లాండ్ వర్సిటీల నడుమ పరస్పర సహకారాన్ని కోరుకుంటున్నాం. స్విస్ లో యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్, యూనివర్సిటీ ఆఫ్ బాసెల్, యూనివర్సిటీ ఆఫ్ బెర్న్, యూనివర్సిటీ ఆఫ్ జెనీవా వంటి ప్రఖ్యాత వర్సిటీలు ఉన్నాయి. వివిధ రంగాల్లో నిపుణుల సేవల కోసం స్విట్జర్లాండ్ వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పిస్తోంది. కాస్ట్ ఎఫిషియన్సీ, టెక్నికల్ స్కిల్ గ్యాప్ ను తగ్గించేందుకు ఏపీలో ప్రత్యేకించి మహిళల ప్రతిభ, నైపుణ్యాలను వినియోగించునే అవకాశం ఉంది. ఇందుకు మీవంతు సహాయ, సహకారాలను అందించాలని మంత్రి లోకేష్ కోరారు.
స్విస్ రాయబారి మృదుల్ కుమార్ మాట్లాడుతూ… ప్రస్తుతం స్విట్జర్లాండ్ కు చెందిన 350కి పైగా కంపెనీలు భారత్ లో తమ యూనిట్లను ఏర్పాటు చేశాయని చెప్పారు. ఇందులో నెస్లే, ఏబీబీ, నోవార్టిస్, యూబీఎస్, క్రెడిట్ స్యూస్, వోసీ ఒర్లికాన్, ఎస్టీ మైక్రో ఎలక్ట్రానిక్స్, క్యూన్ ప్లస్ నగెల్, ఫెయిన్ టూల్ వంటి కంపెనీలు ఉన్నాయని తెలిపారు. భారత్ లోని స్విస్ కంపెనీల ద్వారా 1.3 లక్షల మంది ఉద్యోగావకాశాలు లభించినట్టు చెప్పారు. అలాగే భారత్ కు చెందిన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్, మహింద్రా వంటి కంపెనీలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సంస్థలు స్విట్జర్లాండ్ లో తమ యూనిట్లను ఏర్పాటు చేశాయని, స్విట్జర్లాండ్ ఎఫ్ డిఐలలో భారత్ కంపెనీల వాటా 4.36 శాతంగా ఉందని తెలిపారు.
భారత్ లో 2020-21లో 7.3 శాతంగా ఉన్న స్విస్ ఎఫ్ డిఐలు… కరోనా, ఇతర కారణాల వల్ల 2023-24 సంవత్సరానికి 1.14శాతానికి తగ్గిపోయాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో స్విస్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి తమవంతు సహకారాన్ని అందిస్తానని మృదుల్ కుమార్ తెలిపారు. ఈ భేటీలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి టీజీ భరత్, ఏపీఈడీబీ సీఈవో సాయికాంత్ వర్మ పాల్గొన్నారు.