Suryaa.co.in

Telangana

కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ గతంలో ఆరోపణలు చేసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.

కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై కేసు నమోదైంది. అయితే, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువడింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆత్రం సుగుణ సుప్రీంకోర్టు తలుపు తట్టారు.

సుగుణ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం, ఈ పిటిషన్‌పై ప్రతివాదిగా ఉన్న కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలని కేటీఆర్‌ను ఆదేశిస్తూ, తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

LEAVE A RESPONSE