(వెంకటాచారి)
ఢిల్లీ: పది మంది ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతవేటు విషయంలో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. అదేమిటంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.
ఎన్ని రోజుల్లో ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటారో చెప్పాలని సుప్రింకోర్టు నోటీసుల్లో స్పష్టంగా కోరింది. నోటీసులకు ఈ నెల 25వ తేదీ లోగా సమాధానం చెప్పాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజాగా సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులకు స్పీకర్ గడ్డం ఏమని సమాధానం చెబుతారనే విషయం ఇపుడు ఆసక్తిగా మారింది. 2023లో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ తరపున గెలిచిన పది మంది ఎంఎల్ఏలు అధికార పార్టీ లోకి ఫిరాయించిన విషయం తెలిసిందే.
నిజానికి ఫిరాయింపుల రాజకీయానికి తెరలేపిందే కేసీఆర్9. 2014లో అధికారం లోకి వచ్చిన కేసీఆర్ పదేళ్ళల్లో టీడీపీ, కాంగ్రెస్ కు చెందిన 23 మంది ఎంఎల్ఏలు, 18 మంది ఎంఎల్సీలు, నలుగురు ఎంపీలను బీఆర్ఎస్ లోకి లాగేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. తాను అధికారంలో ఉన్నపుడు యధేచ్చగా ఫిరాయింపులకు పాల్పడిన కేసీఆర్ ప్రతిపక్షం లోకి రాగానే అవే ఫిరాయింపు లకు రేవంత్ పాల్పడటాన్ని మాత్రం తట్టుకోలేక పోతున్నారు.
అందుకనే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏ లపై వెంటనే అనర్హత వేటు వేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టుల్లో కేసులు వేశారు. మొదట బీఆర్ఎస్ వేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. అసెంబ్లీ స్పీకర్ వ్యవస్ధ అధికారాల్లో జోక్యం చేసుకునేది లేదని హైకోర్టు స్పష్టంగా తేల్చేసింది. కాకపోతే అనర్హత వేటు విషయంలో ఏదో ఒక నిర్ణయం తొందరగా తీసుకోమని మాత్రం స్పీకర్ కార్యాలయానికి సూచించింది.
హైకోర్టులో తాము ఆశించినట్లుగా తీర్పు రాకపోవటంతో వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రింకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. స్పీకర్ అధికారాల్లో తాము జోక్యం చేసుకుని శాసన వ్యవస్ధ అధికారాల్లోకి జొర బడేందుకు హైకోర్టు నిరాకరించింది. అందుకనే కేటీఆర్ తాను సుప్రింకోర్టులో కేసు వేయటమే కాకుండా పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎంఎల్ఏలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ తో కూడా కేసులు దాఖలు చేయించారు. బీఆర్ఎస్ ఎంఎల్ఏలు దాఖలు చేసిన కేసుల పైన సుప్రింకోర్టు విచారణ చేస్తోంది. విచారణలో భాగంగానే బుధవారం స్పీకర్ కు సుప్రింకోర్టు నోటీసులు జారీ చేసింది. మరీ నోటీసులకు స్పీకర్ ఏమని సమాధానం ఇస్తారో చూడాలి.
సుప్రిం కోర్టు నోటీసుల జారీ నేపధ్యంలో స్పీకర్ ఏమిచేస్తారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ పెరిగిపోతోంది. అసెంబ్లీ సెక్రటేరియట్ వర్గాల సమాచారం ప్రకారం స్పీకర్ అధికారాల్లో న్యాయ వ్యవస్ధ జోక్యం చేసుకునేందుకు లేదు. ఎంఎల్ఏల అనర్హతపై పలానా సమయం లోగా లేదా ఇంత గడువు లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ రూల్ బుక్ లో ఎక్కడా లేదు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం పార్టీలకు, ఎంఎల్ఏలకే కాదు చివరకు కోర్టులకు కూడా లేవు.
అయితే ఏ విషయంలో అయినా స్పీకర్ నిర్ణయం తీసుకుంటే దాన్ని చాలెంజ్ చేస్తు ఎవరైనా కేసు వేస్తే దాన్ని సమీక్షించే అధికారాలు కోర్టులకు ఉన్నాయి. ఇదే విషయం లోక్ సభ స్పీకర్ గా పని చేసిన సోమ్ నాధ్ చటర్జీ హయంలో నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఫిరాయింపు ఎంపీల విషయంలో చటర్జీ తొందరగా నిర్ణయం తీసుకోవటం లేదని కొందరు ఎంపీలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటీషన్ ఆదారంగా లోక్ సభ స్పీకర్ ఆధ్వర్యంలో రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లతో సమావేశం నిర్వహించారు.
పార్లమెంట్, అసెంబ్లీల స్పీకర్ల నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకునేందుకు లేదని సమావేశంలో తీర్మానించారు. అదే తీర్మానాన్ని చటర్జీ రాష్ట్రపతి ద్వారా సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు పంపారు. ఆ తర్వాత ఏమైందో తెలీదు కానీ, ఫిరాయింపు ఎంపీల అనర్హత వేటు విషయంలో కోర్టులో విచారణ జరగలేదు. ఇక ఏపీ, తెలంగాణ విషయానికి వస్తే 2014-19 మధ్య నారా చంద్రబాబు నాయుడు, 2014-2023 మధ్య కేసీఆర్ యధేచ్చగా ఫిరాయింపులకు పాల్పడ్డారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీడీపీ, కాంగ్ కాంగ్రెస్ వేసిన కేసుల విషయంలో హైకోర్టు సీరియస్ గా స్పందించని విషయాన్ని సెక్రటేరియట్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
గతంలో స్పందించని కోర్టు ఇప్పుడు స్పందించ కూడదని ఏమీలేదు. కాకపోతే, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఇప్పుడు ప్రశ్న.. సుప్రింకోర్టు జారీ చేసిన నోటీసులపై స్పీకర్ స్పందించక పోయినా, లేదా శాసన వ్యవస్ధ అధికారాల్లోకి న్యాయ వ్యవస్ధ జొరబడ కూడదనే విషయాన్ని గుర్తు చేస్తు నోటీసులకు సమాధానం ఇచ్చినా సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇటు సుప్రీంకోర్టు అటు స్పీకర్ గనుక అధికారాల పరిధి విషయంలో గట్టిగా నిలబడితే రెండు వ్యవస్ధల మధ్య ఘర్షణ తప్పదనే అనిపిస్తోంది.
ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు. కేసీఆర్ హయాంలో జరిగిన ఫిరాయింపులపై తాము వేసిన పిటిషన్ విషయంలో కోర్టులో ఎందుకు ఇంత సీరియస్ గా స్పందించ లేదని రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ లపై ఎట్టి పరిస్ధితుల్లోను అనర్హత వేటు పడదని రేవంత్ గట్టిగా చెబుతున్నారు. ఈ నేపధ్యంలో నోటీసులకు స్పీకర్ స్పందన ఏమిటో చూడాల్సిందే.