Advertisements

చర్చలకు పిలవకపోవడంపై బాలకృష్ణ చిర్రుబుర్రు
క్షమాపణ చెప్పాలన్న నాగబాబు
అవసరమైతే అందరినీ పిలుస్తానన్న తలసాని
‘తెర’పైకి చర్చల రచ్చ
(మార్తి సుబ్రహ్మణ్యం)

సినిమా రంగమంటే అదో ప్రపంచం. వందరోజులాడే సినిమా హీరోకు, వారం రోజులాడే సినిమా హీరోకు ఇగో సమానంగా ఉంటుంది. ఎవరికి వారు దైవాంశసంభూతులన్న భ్రమల్లో ఉంటారు. నాకో లెక్కుంది. దానికో తిక్కుంది అన్నట్లు.. సినిమా పరిశ్రమలో ఎవరి లెక్కలు వారికుంటే, ఎవరి తిక్క వారిది.  ఎవరికి వారే గొప్ప. ఇక బతకనేర్చిన ముదురుహీరోలయితే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి భజన చేసి, భూములు, స్టుడియోలు, కన్వెక్షన్లు కాపాడుకుంటారు. పాలకుల కుటుంబాలతో కలసి ఉంటారు. బోళాగా మాట్లాడేవారు కొందరయితే, ఎవరేమనుకున్నా లెక్కచేయకుండా కుండబద్దలు కొట్టేవారు మరికొందరు. ఇంతమంది చిత్ర-విచిత్ర కలయిక అయిన సినిమా పరిశ్రమలో క రోనా కలవరం సృష్టించింది. సినిమా షూటింగుల ప్రారంభం కోసం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చొరవ తీసుకుంటే, ముదురుహీరోలు దానిని రచ్చగా మార్చి మీడియాకెక్కి దానిని ‘ఎవరి గోలవారిది’ గా మార్చేశారు.

లాక్‌డౌన్ వల్ల సినిమా పరిశ్రమ దెబ్బతింది. దానిపై ఆధారపడే కళాకారులు, సాంకేతిక నిపుణులు రోడ్డున పడ్డారు.  షూటింగులు ఉంటే తప్ప పొట్టనిండని ఈ వర్గాల తరఫున చిరంజీవి, నాగార్జున వంటి నటులు, బడా నిర్మాతలంతా మంత్రి తలసానితో చర్చలు జరిపారు. చిరంజీవి ఆ భేటీకి చొరవ తీసుకుని, తన నివాసంలోనే చర్చలు జరిపారు. షూటింగులు ప్రారంభించేందుకు సహకరించాలని కోరారు. ఇదికూడా చదవండి.. పాపం.. సినిమా వాళ్లకు సొమ్ముల్లేవట! దానితో తలసాని చొర వ తీసుకుని.. సీఎం కేసీఆర్ వద్ద, వారితో భేటీ వేయించారు. ఇదీ.. ఇప్పటివరకూ విశ్రాంతికి ముందు జరిగిన సినిమా కథ.

బాలయ్యకు కోపం వచ్చింది..

తొలుత తలసాని, ఆ తర్వాత కేసీఆర్ వద్ద జరిగిన సమావేశానికి.. బాలకృష్ణ సహా చాలామంది అగ్రనాయకులు, ఎక్కువ సినిమాలు తీసే చిన్న నిర్మాతలను పిలవలేదు. మళ్లీ అందులో వచ్చిన వాళ్లంతా ఆంధ్రావాళ్లేనని, అందులో తెలంగాణ చిన్న నిర్మాతలు, నటులకు స్థానం లేదన్న ఫిలింనగర్ విమర్శ ఒకటి! ఈ వ్యవహారం  బాలకృష్ణకు ఆగ్రహం కలిగించింది. ‘ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయట. నాకు తెలియదు. నన్నెవరూ పిలవలేదు. సినిమా పరిశ్రమ చర్చల పేరుతో రియల్ ఎస్టట్ వ్యాపారం చేస్తున్నారు. వాళ్లంతా కలసి శ్రీనివాసయాదవ్‌తో కలసి భూములు పంచుకుంటున్నారా? ఎవరికి భయపడతాం? వక్రీకరించేంది ఏంటి? ఇది వాస్తవం’ అని బాలయ్య అగ్గిరాముడయ్యారు. తనను చర్చలకు పిలవని వారిపై బాలకృష్ణ ఆరకంగా కారాలు మిరియాలు నూరారు. అసలు అక్కడ జరిగేవన్నీ, రియల్ ఎస్టేట్ వ్యాపార చర్చలేనన్న కొత్త కోణానికి తెరలేపారు. అయితే.. చిరంజీవి నివాసంలో చర్చలు నిర్వహించడం, తర్వాత కేసీఆర్‌తో జరిగిన భేటీలోనూ చిరంజీవికే పెద్దపీట వేయటం బాలయ్యకు నచ్చినట్లు లేదు.

నాగబాబు కస్సుబుస్సు…

బాలయ్య అసలే ఫైర్‌బ్రాండ్. ఆయన ఆరోపణలు మీడియాలో హల్‌చల్ చేసిన క్రమంలో, చిరంజీవి సోదరుడు నాగబాబు తెరపైకొచ్చారు. పరిశ్రమను నానా మాటాలు మాట్లాడిన బాలయ్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో, సినిమా కథ కొత్త మలుపు తిరిగింది. ‘భూములు పంచుకుంటున్నారన్న మాట పరిశ్రమలో ఉన్న నాలాంటివారిని బాధపెట్టింది. తక్షణమే బాలయ్య తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. పరిశ్రమపై మీకున్న గౌరవం ఇదేనా? మీరు పరిశ్రమనే కాదు, తెలంగాణ ప్రభుత్వాన్నీ  అవమానించారు. పరిశ్రమకు, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికీ క్షమాపణ చెప్పాల’ని డిమాండ్ చేశారు.

బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..

ఇక దీనితో చిరంజీవి-బాలకృష్ణ అభిమానుల మధ్య సోషల్‌మీడియాలో వార్ మొదలయింది. సినిమాలు లేని చిరంజీవి, నాగార్జునను చర్చలకు ఎలా పిలుస్తారని బాలయ్య ఫాన్స్ మండిపడ్డారు. చిరంజీవి-పవన్ సోదరుడన్న పేరు తప్ప, నాగబాబుకు ఏం ఉందని ఫైరయ్యారు. బాలయ్యను అనే స్థాయి నాగబాబుకు లేదని వాదించారు. నాగబాబు పుట్టకముందే నందమూరి కుటుంబం సినిమా స్టుడియో నిర్మించిందన్నారు. చిరంజీవి, పవన్ లేకపోతే నాగబాబు ఎవరికి తెలుసని విరుచుకుపడ్డారు. బూతు జోకులకు నవ్వుకునే నీ స్థాయి ఏమిటన్నారు. టీడీపీ ప్రభుత్వం వద్ద ప్రైమ్‌లోకేషన్‌లో తక్కువ రేటుకు చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ఎందుకు తీసుకున్నారు? మార్కెట్ ధరకే కొనవచ్చుకదా? బాలయ్య కరోనా క్రైసిస్ చారిటీకి 25 లక్షలిస్తే నువ్వేం ఇచ్చావ్? అసలు నిర్మాతగా నువ్వు తీసిన ఎన్ని సినిమాలు ఆడాయ’ని తాడికొండ సాయికృష్ణ అనే బాలయ్య అభిమాని, నాగబాబుపై సంధించిన పోస్టు వైరల్ అవుతోంది.

నడుమ నలుగుతున్న తలసాని..

అదేదో సామెత చెప్పినట్లు.. పుణ్యానికి పోతే పాపం ఎదురయినట్టయింది మంత్రి తలసాని పరిస్థితి. సహజంగా ఏ ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి, దానిపై చర్చలు జరిపే అలవాటున్న ఆయన సినిమా సమస్యలపైనా దృష్టి సారించారు. గతంలో వలస కార్మికులకు రైళ్ల విషయంలో కూడా తలసాని చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఇదికూడా చదవండి.. ‘నెరవేరిన తలసాని డిమాండ్’ అగ్రహీరోల అధిపత్యపోరులో మంత్రి నలుగుతున్నట్లు కనిపిస్తోంది.  సినిమా పరిశ్రమ క్లిష్ట పరిస్థితిలో ఉందని, కార్మికులు తిండిలేక అల్లాడుతున్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలకు స్పందించిన తలసాని తన సొంత ట్రస్టు ద్వారా తనయుడు సాయికిరణ్‌తో కలసి, వారికి నిత్యావసర వస్తువులు అందించారు. ఇదికూడా చదవండి.. ‘తండ్రిని మించిన తనయుడు తలసాని సాయి కిరణ్’ తర్వాత అదే అంశంపై సినీపెద్దలతో చర్చలకు అంగీకరించారు. బాలకృష్ణ హీరో కమ్ పొలిటీషియన్ కాబట్టి బిజీగా ఉంటారు. చిరంజీవి, నాగార్జున పెద్ద హీరోలయినా వారికి ఇప్పుడు సినిమాల్లేవు కాబట్టి ఖాళీగానే ఉన్నారు. పైగా చిరంజీవికి పరిశ్రమలో కొంత పెద్దరికం ఉంది. ఇలాంటి లెక్కలతో చ ర్చలకు వెళ్లిన తలసాని.. ‘సినిమా కథలు’, ‘హీరోల వేషాలు’ చూసి తలపట్టుకోవలసి వచ్చింది. చివరకు ఆయనే ఆరోపణలు ఎదుర్కోవలసి వచ్చింది. ఇదికూడా చదవండి.. తలసాని చొరవతో తెలంగాణలో హాస్టళ్ల సమస్యకు తెర!

గతంలో తలసాని టీటీడీలో ఉన్నప్పుడు..  బాలకృష్ణ ఇంటికి, ఆసుపత్రికి అర్చకులను పంపించి, పూజలు చేయించారు. బాలయ్య ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన కోలుకోవాలని ప్రార్ధిస్తూ, మహంకాళీ ఆలయ అర్చకులను బాలయ్య వద్దకు తీసుకువెళ్లారు. పాపం.. అలాంటి తలసాని ఇప్పుడు అదే బాలయ్య ఆరోపణలకు గురికావలసి వచ్చింది. దీనితో ఆయన ‘కావాలంటే ఇండస్ట్రీలోని వారందరితో మరో సమావేశం నిర్వహిస్తామ’ని చెప్పాల్సి వచ్చింది. అసలు బాలయ్య ఆవిధంగా ఎందుకన్నారో తనకు తెలియదని వాపోయారు. ఇదికూడా చదవండి.. తెలంగాణలో తలసాని టాప్!

3 thoughts on “చిరంజీవి,బాలకృష్ణ.. మధ్యలో తలసాని!”
  1. […] సీఎం జగన్‌తో భేటీకి బాలకృష్ణకు పిలిచినా, ఆయన తన జన్మదినం కాబట్టి రాలేకపోయారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ, జనసేన అధ్యక్షుడు, ఇంకా సినిమాల్లో నటి స్తున్న పవన్ కల్యాణ్, రాజశేఖర్‌ను ఎందుకు ఆహ్వానించలేదన్న ప్రశ్నలు సినిమా పరిశ్రమ నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే జగన్ సర్కారుపై పవన్ ఓ వైపు యుద్ధం చేస్తుంటే, మరోవైపు ఆయన సోదరుడైన చిరంజీవి మాత్రం ఆయనను సీఎంతో జరిగే చర్చలకు ఆహ్వానించకపోవడాన్ని, పవన్ అభిమానులు మండిపడుతున్నారు. అమరావతి ఉద్యమానికి పవన్ మద్దతునిస్తుంటే, ఆయన సోదరుడైన చిరంజీవి మాత్రం విశాఖలో స్టుడియోలు, స్థలాలకోసం జగన్‌కు మద్దతునివ్వడమేమిటని నిలదీస్తున్నారు. కరోనా సమయంలో అగ్రహీరోలంతా దుప్పటి ముసుగేసుకుని పడుకున్న సమయంలో, సినీ కార్మికులకు సొంత నిధులతో సాయం చేసిన జీవితా రాజశేఖర్‌ను ఎందుకు ఆహ్వానించలేదని టాలీవుడ్ వర్గాలు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై.. చిరంజీవికి తమ్ముడు, పవన్‌కు అన్నయ్యగా గుర్తింపుపొందిన నాగబాబు.. తన యూట్యూబ్ చానెల్‌లో ఏం సందేశమిస్తారో చూడాలి! ఏదేమైనా.. జగదేక వీరులంతా అతిలోక సుందరమైన బెజవాడకు వెళ్లిన జాలీ ట్రిప్ హాట్ టాపిక్ అయింది. మరిక మిగిలింది.. చిరంజీవి అండ్ కోకు సన్మానమే! ఇంతకూ పెత్తనమంతా చిరంజీవి చేస్తే.. ఇక  సిని‘మా’ అసోసియేషన్ ఉనికిలో ఉన్నట్లా? లేనట్లా? అన్నది డౌటనుమానం! సినీజనం మాత్రం.. ఆ సంగతి సత్యహరిశ్చంద్రుడి కజిన్ బ్రదరయిన, ‘మెంటల్‌కృష్ణ’నే చెప్పాలంటున్నారు! వినపడిందా రాజా?ఇది కూడా చదవండి: చిరంజీవి,బాలకృష్ణ.. మధ్యలో తలసాని! […]

Leave a Reply