– తలసాని ఇంటి వద్ద సంబరాలు
కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం MG రోడ్ లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి, అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అండగా నిలిచి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన మహా ధర్నా కు కేంద్రం దిగొచ్చిందని చెప్పారు. ఇందిరా పార్క్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో రాష్ట్రంలో ని వివిధ ప్రాంతాల నుండి రైతులు స్వచ్చందంగా పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఆందోళన ఉదృతం అవుతుందనే భయంతో నే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించుకుందని అన్నారు.
గత ఆరు నెలలుగా రైతులు అనేక పోరాటాలు నిర్వహిస్తున్నారని, ఎంతో మంది రైతులు మరణించారని పేర్కొన్నారు. రైతే రాజు అన్న నినాదాన్ని నెరవేర్చాలనే సంకల్పంతో 24 గంటలు ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇస్తూ ప్రోత్సహిస్తుంటే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాయిల్డ్ రైస్, రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. రాజ్యాంగ కల్పించిన హక్కులు, చట్టాలను తుంగలో తొక్కే ప్రయత్నాలను ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. Bjp నేతలు ఏది పడితే అది మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు.
రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలు మనుగడ సాధించిన దాఖలాలు చరిత్రలో లేవని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను మీ ఇష్టమొచ్చినట్లు తిడతామంటే, మేము ప్రధానమంత్రి ని తిట్టలేమా? మాకు సంస్కారం ఉందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు మేలు చేసే విధంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈసందర్భంగా బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ TRS ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, TRS డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, గుర్రం పవన్ కుమార్ గౌడ్, హన్మంతరావు, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, వెంకటేష్ రాజు, నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్, శ్రీహరి, సురేష్ గౌడ్, అబ్బాస్, ఫహీం, ఉమానాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.