విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి పట్టాభి నివాసం వద్ద వేచి ఉన్న పోలీసులు రాత్రి 9గంటల సమయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి పట్టాభిని అరెస్టు చేశారు. కాలింగ్ బెల్‌కొట్టినా పట్టాభి తలుపు తీయలేదని అందుకే బలవంతంగా అరెస్టు చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ‘‘తలుపు పగులగొట్టి ఇంట్లోకి వచ్చి తీసుకెళ్లడం సరికాదు. నోటీసు ఇచ్చిన వెంటనే నా
భర్తను అరెస్టు చేశారు. 120-బి సెక్షన్ కింద కేసు నమోదు చేశామని చెప్పారు. ఎఫ్‌ఐఆర్ కాపీ అడిగితే తర్వాత ఇస్తామని చెప్పారు. నా భర్త ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు.. అలాగే తిరిగి రావాలి. నాభర్తకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత ’’ అని పట్టాభి భార్య కొమ్మారెడ్డి చందన మీడియాకు తెలిపారు. నిన్న సాయంత్రం వైకాపా మద్దతు దారులు పట్టాభి నివాసంపై దాడి చేసి వాహనాలు, ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం
చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్‌పై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వైకాపా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. నిన్న తెదేపా కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. సీఎంపై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని వైకాపా ఫిర్యాదు మేరకు విజయవాడ గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌లో పట్టాభిపై కేసు నమోదైంది. అరెస్టు అనంతరం పట్టాభిని గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఏం జరిగినా సీఎం, డీజీపీదే బాధ్యత: పట్టాభి
