ఢిల్లీ నడివీధుల్లో టీడీపీ ఎంపీలు రాష్ట్ర పరువును తీస్తున్నారు

– అప్పులకు ఆది పురుషుడు చంద్రబాబే
– ఫేక్ వీడియోలు సృష్టించి నా మాటలను వక్రీకరించారు
– చంద్రబాబు చేసిన అప్పుల గురించి బడ్జెట్ స్పీచ్ లో మాట్లాడితే.. కట్ అండ్ పేస్ట్ చేసి టీడీపీ వక్రీకరిస్తుంది
– ఓటిఎస్ పేదవర్గాలకు ఒక వరం
– రాష్ట్రం పరువును తీసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారు
– లోక్ సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ ప్రెస్ మీట్ 
మార్గాని భరత్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
కోవిడ్ కష్టకాలంలోనూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒకవైపు కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే, మరోవైపు ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగకుండా, పేదవారికి అండగా నిలబడ్డారు. సంక్షేమ పథకాల అమలులో దేశానికే రోల్ మోడల్ గా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంటే.. టీడీపీ ఎంపీలు మాత్రం రాష్ట్ర పరువును ఢిల్లీ నడి వీధుల్లో తీస్తున్నారు.
రాష్ట్ర అప్పులకు ఆది పురుషుడు చంద్రబాబు నాయుడు అయితే.. ఈ ప్రభుత్వం మీద టీడీపీ ఎంపీలు విమర్శలు చేయడం సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు మోడల్ ఫాలో అవ్వమని టీడీపీ ఎంపీ కనకమేడల ఢిల్లీలో నీతులు చెబుతున్నారు. మీ 5 ఏళ్ళ పాలనలో ఎఫ్ఆర్బీఎం పరిమితులు దాటి అప్పులు చేసిందేకాక, వివిధ కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పులు అక్షరాలా రూ. 4 లక్షల కోట్లు.
పైగా అమరావతి రాజధానిని చంద్రబాబు కట్టించాడని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఏం కట్టించారు.. నాలుగు రేకుల షెడ్లు కట్టించి రాజధాని కట్టించామంటే ఎవరు నమ్ముతారు..? నాలుగు- ఐదు టెంపరరీ బిల్డింగులు కట్టడమే రాజధాని నిర్మాణమా..?
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 7 ముంపు మండలాలను కలపకపోతే.. సీఎంగా ప్రమాణస్వీకారం చేయనని చంద్రబాబు చెప్పాడని గొంతు చించుకుని మాట్లాడుతున్న టీడీపీ ఎంపీలు, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే, సీఎంగా ప్రమాణస్వీకారం చేయనని ఆరోజే ఎందుకు చెప్పలేదు.. ?
బీజేపీతో పార్టనర్ గా ఉండి, ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ఆరోజు చంద్రబాబు ఎందుకు ఒక్క మాట చెప్పలేకపోయారు..? పైగా, ప్రత్యేక హోదా సంజీవని కాదు, ప్రత్యేక హోదా వల్ల ఏం వస్తుంది, వచ్చేది శూన్యం.. అని మాట్లాడింది ఇదే చంద్రబాబు కాదా..? అంటే, అధికారంలో ఉంటే ఒక మాట, దిగిపోతే మరో మాట మాట్లాడటం టీడీపీకే చెల్లింది. మీరు మాట్లాడే అబద్ధాలన్నింటినీ ప్రజలు నమ్ముతారనుకుంటే పొరపాటే.బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తి మెజార్టీతో నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎంపీల అవసరం ఉండి ఉంటే.. కచ్చితంగా ఎప్పుడో మనకు ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. ప్రత్యేక హోదా కోసం మా పోరాటం ఆగదు.
టీడీపీ హయాంలోనే గంజాయి దేశ సరిహద్దులు దాటి, శ్రీలంకకు కూడా తరలిపోయిందని అప్పట్లో కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. గంజాయి స్మగ్లింగ్ లో పెద్ద పెద్ద వాళ్ళ పాత్ర ఉన్నట్టు.. చంద్రబాబు కేబినెట్ మంత్రులే బహిరంగంగా మీడియాతో చెప్పారు. మీ ప్రభుత్వంలో పెద్ద వాళ్ళు అంటే చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ లు కాదా..? మీ మంత్రులు మాట్లాడిన మాటలను బట్టి, టీడీపీ హయాంలో ఏ స్థాయిలో గంజాయి స్మగ్లింగ్ జరిగిందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
– అదే, మేం అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏవోబీలో అక్రమంగా సాగు అవుతున్న గంజాయిని పట్టుకునేందుకు, ప్రత్యేకంగా ఎస్ఈబీని పెట్టి, పెద్దఎత్తున గంజాయిను పట్టుకుంటున్నారు కాబట్టే, బయటకు వస్తుంది. అదే మీ హయాంలో మీరే ప్రోత్సహించి, మాఫియాను పెంచి పోషించారు.
తెలంగాణకు హైదరాబాద్-ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు అని మాట్లాడుతున్న టీడీపీ ఎంపీలు తెలంగాణలో ఓటుకు కోట్ల రూపాయలు ఇస్తూ.. అడ్డంగా దొరికిపోయి, రాత్రికి రాత్రి తట్టాబుట్టా సర్దుకుని హైదరాబాద్ ను వదిలేసి, అమరావతికి పారిపోయిన వచ్చిన సంగతిని వారు గుర్తు ఉంచుకుంటే మంచిది.
కోవిడ్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రమే ఎఫ్ఆర్బీఎం పరిమితులు పెంచింది అని లోక్ సభలో ఇప్పటి సమావేశాల్లో నేను మాట్లాడితే.. దానిని కూడా టీడీపీ ఎంపీలు వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారు. ఫస్ట్ బడ్జెట్ స్పీచ్ లో, నేను మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్ట్ చేసి, ఇప్పుడు మాట్లాడినట్టు సృష్టించి

సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఫస్ట్ బడ్జెట్ స్పీచ్ లో భాగంగా, మొట్టమొదటి సారి లోక్ సభలో నేను మాట్లాడుతూ.. “చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయేటప్పుడు కేవలం రూ. 100 కోట్లు నిల్వలు మిగిల్చి, రూ. 4 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారని” చెబితే, దానినిమార్ఫింగ్ చేసి, ఫేక్ వీడియోలు సృష్టించి ప్రచారం చేయడం, దానిని టీడీపీ ఎంపీలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం శోచనీయం. వాస్తవాలేమిటో… టీడీపీ వక్రీకరణలు ఏమిటో వీడియోను మీడియా ఎదుట ప్రదర్శించారు.
రాష్ట్రం పరువును తీసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ఆఖరికి పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపైన కూడా నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు నిధులు మళ్ళించి ఇస్తే అది మంచిది అవుతుందా..?
ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీతో కలిసిపోయి, టీడీపీ అజెండాను మోస్తున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి పార్లమెంటులోనూ, నిత్యం మీడియాలోనూ అర్థంపర్థంలేని విమర్శలు చేస్తే, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే.. రాష్ట్ర ప్రజలెవరూ నమ్మరు. ముఖ్యమంత్రి సమర్థవంతంగా రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తున్నారో, పేద వర్గాలను ఏ విధంగా ఆదుకుంటున్నారో… ప్రజలంతా గమనిస్తున్నారు.మరోవైపు, ఓటీఎస్ గురించి చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. పేదల ముఖాల్లో ఆనందం చూడాలని, వారికి సొంత ఇంటి కల నెరవేర్చడంతోపాటు, దశాబ్దాలుగా ఆ ఇళ్ళపై ఉన్న రుణాలను మాఫీ చేస్తూ.. వన్ టైమ్ సెటిల్ మెంటు కింద వారికి పూర్తి హక్కులతో రిజిస్ట్రేషన్లు చేసి ఇళ్ళు ఇస్తుందీ ప్రభుత్వం.
రాజమండ్రిలో చూసినా.. రూ. 20 లక్షలు చేసే పక్కా ఇళ్ళను కేవలం రూ. 20 వేలకే రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులకు పూర్తి హక్కులతో ఇస్తున్నారు. పేదవారికి మంచి చేస్తుంటే దానినీ టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఓటిఎస్ అన్నది పేదవర్గాలకు ఒక వరం.ముఖ్యమంత్రి జగన్ డైనమిక్ లీడర్ గా పరిపాలన అందిస్తుంటే.. తనకున్న ఇద్దరు, ముగ్గురు ఎంపీలను పెట్టుకుని రాష్ట్రం పరువును ఢిల్లీలో తీసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర పరువును తీసేందుకు ఒక ప్రణాళిక ప్రకారం.. మత రాజకీయాలు, కుల రాజకీయాలు, గంజాయి రాజకీయాలు.. ఆఖరికి తన ఇంట్లో ఆడవారిని కూడా రోడ్డు మీదకు తీసుకొచ్చి బాబు చేస్తున్న రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ఛీ కొడుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వ్యవహరించాలి. మీ అనుకూల మీడియా ఉంది కదా అని రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయటం మానుకోవాలని హితవు పలుకుతున్నాం.
మీడియా సమావేశంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు.