Suryaa.co.in

Andhra Pradesh

ఓటిఎస్ ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో టిడిపి శ్రేణుల ఆందోళన

– ఓటిఎస్ వసూళ్లు – పేదలకు ఉరితాళ్లంటూ నినాదాలు
– కలెక్టరేటర్ల ఎదుట నిరసన ప్రదర్శనలు…ఉద్రిక్తత
– గుంటూరు టీడీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జి…ఇద్దరికి గాయాలు
– విజయనగరంలో జెసిబిలతో ర్యాలీని అడ్డగించిన వైసిపి
– కడప కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు టిడిపి కార్యకర్తల యత్నం

అమరావతి: ఓటీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు శ్రీకాకుళం మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట టీడీపీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఒటిఎస్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేటర్ల ఎదుట చేపట్టిన ఆందోళన పలుచోట్ల పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినాధాలు చేశారు. జిల్లా కేంద్రాల నుంచి కలెక్టర్ కార్యాలయాల వరకు ఓటిఎస్ వసూళ్లు పేదలకు ఉరితాళ్లు అంటూ బ్యానర్లు ప్రదర్శించి భారీ నిరసన ర్యాలీలు చేశారు.

అనంతరం ఓటిఎస్నుల రద్దు చేయాలని కలెక్టర్ కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇచ్చారు. పలుచోట్ల పోలీసులు నిరసనకారులను అడ్దుకునే ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గుంటూరు కలెక్టరేట్ ఎదుట ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. ఈ సంఘటనలో వేమూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్త సునీల్ కాలు, మాచర్లకు చెందిన వెంకటేశ్వర్లు చేయి విరిగింది. గుంటూరు నగర కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ పై కూడా పోలీసులు చేయిచేసుకోగా, మాజీ మంత్రి ఆలపాటి రాజా ఒక్కసారిగా పరిగెత్తి కార్యకర్తల జోలికి వస్తే పద్ధతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగు మహిళలు కూడా గాయపడ్డారు. గుంటూరులో ఓటీఎస్ రద్దు కోరుతూ టీడీపీ నిరసన ర్యాలీ గుంటూరు మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌లో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్ళిన పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ

నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన ర్యాలీలో మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, పార్లమెంట్ అధ్యక్షులు జీవి ఆంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, నియోజకవర్గ ఇన్‌చార్జులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓటీఎస్ పేరుతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమ వసూళ్లు పేదలకు ఉరితాళ్లుగా మారాయని మండిపడ్డారు. ఓటీయస్ పథకం జగనన్న పైసా వసూలు పథకమని వ్యాఖ్యానించారు. ఓటీఎస్ పేరుతో పేదల నుంచి రూ. 5 వేల కోట్లు దోచుకునేందుకు వైసీపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించిందని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. పేదలు ఎవరికీ భయపడి డబ్బులు కట్టవద్దని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసి ఇస్తుందని అన్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం ఓటీయస్ పేరుతో చేస్తున్న రిజిస్ట్రేషన్లు చెల్లుబాటుపై అనుమానాలు ఉన్నాయని, రేపు న్యాయస్థానాలు గానీ, వేరే పార్టీ ప్రభుత్వం గానీ ఈ రిజిస్ట్రేషన్లు చెల్లవు అంటే డబ్బులు కట్టిన వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఓటీఎస్ కట్టాలంటూ వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు వత్తిడి చేస్తున్నారు, ఓటీఎస్ కట్టకపోతే ప్రభుత్వ పథకాలు నిలిపి వేస్తామంటూ రాష్ట్ర వ్యాప్తంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఒకవైపు పథకం స్వచ్చందమేనని చెబుతున్నా… క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉందన్నారు. ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం ఏంటని నేతలు మండిపడ్డారు. ఓటేసిన పేదలను ఒటిఎస్ పేరుతో ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. పేద ప్రజలను భయబ్రాంతులకు, బెదిరింపులకు గురిచేయడం దురదృష్టకరమని అంటూ గ్రామాల్లో ఎవరైనా ఒటిఎస్ చెల్లించాలని వత్తిడి తెస్తే ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.

విజయనగరం జిల్లా
విజయనగరం క్లాక్ టవర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున, కొండపల్లి అప్పలనాయుడు, పత్తివాడ నారాయణస్వామి నాయుడు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కలెక్టర్‌‌కు వినతిపత్రం అందజేశారు. టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు అడ్డంకులు సృష్టించారు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న కార్యకర్తలను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు రోడ్డుకు అడ్డంగా జేసీబీలు, కరెంట్ పోల్స్ పెట్టి అడ్దుకునే ప్రయత్నం చేశారు.

విశాఖపట్నం జిల్లా
జిల్లా టీడీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, బుద్దా నాగజగధీష్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా నాయకులందరు కలిసి ఓటీఎస్‌ను రద్దు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, కిడారి శ్రావణ్, రాష్ట్ర పార్టీ మహిళ ప్రెసిడెంట్ వంగళపూడి అనిత, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా
కాకినాడలో ఓటీఎస్కుూ వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటీఎస్ బలవంతపు వసూళ్లు ఆపాలని నినాదాలు చేశారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నిరసన కార్యక్రమంలో పార్లమెంటు నియోజకవర్గ ఇన్ చార్జి జ్యోతుల నవీన్, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గొల్లపల్లి సూర్యరావు, గోరంట్ల బుచ్చియ్య చౌదరి, మాజీ డిప్యూటీ ఛైర్మన్ రెడ్ది సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, నల్లమిల్లి రామకృష్ణరెడ్డి, పెందుర్తి వెంకటేష్, అయితాబత్తుల ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా
నగరంలో టీడీపీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పార్లమెంట్ అధ్యక్షులు గన్నీ వీరాంజనేయులు, తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఓటీయస్ పథకం జగనన్న పైసా వసూలు పథకమని వినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంగరరామ్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా
మచిలీపట్నంలో పార్లమెంట్ అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు, నెట్టెం రఘురాం, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు జిల్లా కోర్టు సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యేలు శ్రీరాం తాతయ్య, బోడే ప్రసాద్, జయమంగళ వెంకట రమణ, రావి వెంకటేశ్వరరావు, తంగిరాల సౌమ్య, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లా
ఓటీఎస్‌కు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యే డోలా బాలా వీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్ కర్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్ రెడ్డి, కందుల నారాయణరెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఇన్‌చార్జులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లా
ఓటిఎస్ కు వ్యతిరేకంగా నెల్లూరు నగరంలోని విఆర్సి సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు, కంభం విజయరామిరెడ్డి, కురుగుండ్ల రామకృష్ణ, నెలవల సుబ్రమణ్యం, పాశం సునీల్ కుమార్, నియోజకవర్గాల ఇన్‌చార్జులు, రాష్ట్ర స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లాలో ఓటీఎస్ కు వ్యతిరేకంగా పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలివచ్చారు. పోలిట్‌బ్యూరో సభ్యులు ఎన్‌ఎమ్డిల ఫరూక్, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి, కె మీనాక్షి నాయుడు, బివి జయ నాగేశ్వరరెడ్ది, కోట్ల సుజాతమ్మ, గౌరు చరితా రెడ్డి, భూమా బ్రహ్మనందరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

కడప జిల్లా
ఓటీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేశారు. టీడీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడంతోపాటు కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీనితో సీఎం విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షులు లింగారెడ్డి, ఎమ్మెల్సీలు బి.టెక్ రవి, శివనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా
నగరంలోని పాత ఊరు పవర్ ఆఫీస్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, బికె పార్థసారధి, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, , ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. పార్టీ శ్రేణులతో కలిసి ఓటీఎస్ రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో భారీ స్థాయిలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

చిత్తూరు జిల్లా
ఓటీఎస్ కడితేనే పథకాలు అమలు చేస్తామని వైసీపీ నాయకులు, అధికారులు పేదలను ఓత్తిడి చేయడాన్ని నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంట్ అధ్యక్షులు పులివర్తి నాని, గొల్లా నరసింహ యాదవ్, ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, హేమలత, నియోజకవర్గ ఇన్‌చార్జులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE