అక్రమ గ్రావెల్ తవ్వకాలను పరిశీలించిన టీడీపీ బృందం

– రాష్ట్రంలో వైసీపీ నేతలు పాల్పడుతున్న అక్రమ మైనింగ్ ను పరిశీలించిన టీడీపీ బృందం
– అనకాపల్లి, అనపర్తి, గన్నవరం, పామర్రు, నందిగామ ప్రాంతాల్లో పర్యటన
– గన్నవరంలో బచ్చుల అర్జునుడు, వైవీబీ రాజేంద్రప్రసాద్ ను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు
– పోలీసులు అరెస్టు చేస్తారన్న ముందస్తు సమాచారంతో చాకచక్యంగా తప్పించుకుని పామర్రు వెళ్లి పరిశీలించిన కొందరు నేతలు
– వైసీపీ అక్రమ తవ్వకాలను బయటపెట్టిన టీడీపీ బృందం పర్యటన

రాష్ట్రంలో వైసీపీ నేతలు పాల్పడుతున్న అక్రమ మైనింగ్ ప్రాంతాలను టీడీపీ నేతల బృందం పరిశీలించింది. అనకాపల్లి, అనపర్తి, గన్నవరం, పామర్రు, నందిగామ ప్రాంతాల్లో జరుగుతున్న మైనింగ్ ప్రాంతాలను పార్టీ నేతలు శుక్రవారం పరిశీలించారు. గన్నవరం నుండి కొండపావులూరుకు బయలుదేరిన బచ్చుల అర్జునుడును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై బచ్చుల ఆగ్రహం వ్యక్తం చేశారు. లంకపల్లి వెళ్తున్న మాజీఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ నూ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మిగిలిన ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ ప్రాంతాలను పరిశీలించారు.

పామర్రు లోని లంకపల్లి ప్రాంతంలో…
మైనింగ్‌లో దేశంలోనే ఏపీని మొదటి స్థానంలో నిలిపిన ఘనత వైసీపీ నాయకులదేనని టీడీపీ నేతల బృందం ఆరోపించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే మైనింగ్ దోపిడీలు రోజు రోజుకూ అడ్డూఅదుప లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పామర్రు నియోజకవర్గంలోని లంకపల్లిలో వైకాపా నాయకులు చేస్తున్న అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని తెదేపా నాయకులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, రావి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ, పామర్రు ఇంచార్జి వర్ల కుమార్ రాజా, పెడన ఇంచార్జి కాగిత కృష్ణప్రసాద్, పార్లమెంట్ కమిటీ నాయకులు, నియోజక వర్గంలోని నాయకులతో కలిసి సందర్శించారు. లంకపల్లి మైనింగ్ ప్రాంత పరిశీలనకు బయలుదేరిని మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాదర్ పోలీసులు హౌస్ అరెస్టు చేయడంపై మండిపడ్డారు. తమను పోలీసులు అడ్డుకుంటారన్న సమాచారంతో వారి కంట పడకుండా ప్రణాళిక ప్రకారం విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు నెట్టెం రఘురాం సూచనతో మీడియాను వెంట తీసుకెళ్లి మైనింగ్ జరుగుతున్న తీరును కొందరు నేతలు వివరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. నాడు పాదయాత్రలో ఊరురు తిరిగి టీడీపీ1500 వందలకు ట్రాక్టర్ ఇసుక ఇస్తే అవినీతి అని గుండెలు బాదుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు సొంత పార్టీ మంత్రులు ఇదే ఇసుకను రూ.8 వేల నుండి రూ.10 వేలకు అమ్ముతుంటే ఏ కలుగులో దాక్కున్నారని ప్రశ్నించారు.
ఇసుక విధానాన్ని మార్చి కార్మికుల పొట్టకొట్టి, నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారని అన్నారు. పక్క
tdp-visit1 రాష్ట్రాలకు వందలాది లారీలు తరలిస్తూ అక్రమ సంపాదన చేస్తున్నారని తెలిపారు. జిల్లా మంత్రి కొడాలి నాని అక్రమ సంపాదనను హైదరాబాద్ లో సీజ్ చేశారు. ఇలాంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఎంత అక్రమార్జన చేస్తున్నారో, ఎంతమంది పేదల పొట్టకొడుతున్నారు? ఒకసారి ప్రజలు ఆలోచించాలని అన్నారు. వీరి దోపిడీని ప్రశ్నిస్తున్న తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఎన్నికేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు పోరాటం చేస్తామని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు శాండ్, ల్యాండ్ రూపంలో రాష్ట్రాన్ని దోచేస్తూ రాష్ట్ర ప్రజలకు బ్యాండు వాయిస్తున్నారని అన్నారు.

గన్నవరంలో బచ్చుల అర్జునుడు అరెస్ట్
గన్నవరం నియోజకవర్గం, కొండపావులూరులో వైసీపీ నేతలు చేస్తున్న గ్రావెల్ పరిశీలనకు బయలు దేరిన గన్నవరం ఇంఛార్జ్ బచ్చుల అర్జునుడును ఇంటివద్దే పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ మైనింగ్ పరిశీలించేందుకు వెళ్తున్న తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారని అర్జునుడు మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి దిగిపోయే సమయం దగ్గరపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అరెస్టుకుపూనుకున్నప్పటికీ రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి మండవ లక్ష్మి, మచిలీపట్నం పార్లెమెంట్ తెదేపా కార్యదర్శి జూపల్లి సురేష్, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమాదేవి, గన్నవరం మండల తెదేపా ప్రధాన కార్యదర్శి బోడపాటి రవి, ఉపాధ్యక్షులు కంచర్ల ఈశ్వరరావు, కొండపావులూరు ఎంపీటీసీ కొవ్వలి రాజు, తెలుగుయువత నాయకులు అట్లూరి రామ్ కిరణ్, తదితరులు పోలీసుల వలయాన్ని ఛేదించుకుని కొండపావులూరు గ్రామ రెవిన్యూ పరిధిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. హౌస్ అరెస్ట్ లో ఉన్న బచ్చుల అర్జునుడు గారు ఇంటివద్ద నుండే ప్రెస్ మీట్ పెట్టి గన్నవరం శాసనసభ్యుడు చేస్తున్న అక్రమ మైనింగ్ విధానాలను ఖండించడం జరిగింది.

నందిగామలోని పల్లగిరి
అక్రమంగా మైనింగ్ జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు ఏం చేస్తున్నారు?
కొందరు అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారు
– దేవినేని ఉమామహేశ్వరరావు,, శ్రీరాం రాజగోపాల్ తాతయ్య
రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరుగుతుంటే స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. శుక్రవారం నందిగామ ప్రాంతంలోని పల్లగిరిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను పార్టీ నేతలు, కార్యకర్తలతో వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. గతంలో మైలవరంలో అక్రమ మైనింగ్ పరిశీలించడానికి వెళ్తే కేసులు పెట్టారని, ఇప్పుడు ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో గెలవడం కోసం అపార్ట్ మెంట్లలో డబ్బులను పార్కింగ్ ప్లేస్ లో పెడుతున్నారని ఆరోపించారు. టీవీ5, ఏబీఎన్ ,ఆంధ్రజ్యోతి, ఈనాడును చూడొద్దంటున్నారని, అసలు వైసీపీ నేతల మొహాలు చూడడానికి ప్రజలు ఇష్టపడడం లేదని ఎద్దేవా చేశారు. జగ్గయ్యపేట ఇంఛార్జ్ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ… అక్రమ మైనింగ్ ఆపకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు నెట్టెం రఘురాం, మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య, రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, విజయవాడ పార్లమెంట్ ఉపాధ్యక్షులు లింగమనేని శివరామప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు కోగంగి సత్యనారాయణ, వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.

అనపర్తిలోని వీరంపాలెం…
తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం వీరంపాలెంలో చినకొండలో అక్రమ గ్రావెల్ తవ్వకాలను టీడీపీ బృందం పరిశీలించింది.. ఈ బృందంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కె.ఎస్. జవహర్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, పలువురు నేతలు, కార్యకర్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ చూసినా అక్రమ మైనింగ్ జరుగుతోందని, దీంతో అధిక సంఖ్యలో క్వారీల్లో అక్రమ గ్రావెల్ ను తరలిస్తూ రోడ్లను పాడు చేస్తున్నారని తెలిపారు. ‘‘దీంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ మైనింగ్ పై టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఒక కమిటీ వేశారు.

నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చినకొండను గ్రావెల్ త్రవ్వకానికి 2018లో ప్రభు సొసైటీ పేరుతో 5 సంవత్సరాలకు 3.08 లక్షల క్కుబిక్ మీటర్లు గ్రావెల్ త్రవ్వకానికి అనుమతులు ఇచ్చారని తెలిపారు. ‘‘ఇక్కడ లీజుదారులు దాదాపుగా అనుమతులకు 50 అడుగులకు మించి అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. ఇక్కడ గ్రావెల్ త్రవ్వకాలు మాత్రమే జరపాలని మైనింగ్ అధికారలు అనుమతులిచ్చారు. కానీ
tdp-visit3 సాండ్, లాటరైట్, స్టోన్స్ త్రవ్వకాలు జరుపుతున్నారు. మేము సమాచార హక్కు చట్టం ద్వారా తనిఖీ చేశారా అని ప్రశ్నిస్తే తనిఖీలు లేవన్నారు. గ్రావెల్ త్రవ్వకాలను రాష్ట్రం వ్యాప్తంగా ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి అనుయాయులకు రూ.25 వేల కోట్ల విలువ చేసే గ్రావెల్ త్రవ్వకాలను కేవలం రూ.2500 కోట్లకు అప్పగించాలని చూస్తున్నారు. టీడీపీ అడిగిన సమాచారం హక్కు చట్టంలో గ్రావెల్ త్రవ్వకాలు, చిత్తూరు జిల్లాలో బంగారు గనులు బయట పడ్డాయి, వజ్రాలు కూడా బయట పడ్డాయి అని సమాచారం ఇచ్చారని, రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మైనింగ్ పై అన్ని విధాలుగా పోరాడటం జరుగుతుందని పేర్కొన్నారు.

కె.ఎస్.జవహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు నుండి ల్యాండ్, వైన్, మైయిన్స్ లను యథేచ్ఛగా దోచుకుంటున్నారని, మైన్స్ దోచుకోవడంలో ఘణాపాటి అయిన గాలి జనార్దన్ రెడ్డికి వారసుడిలా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజలను దోచుకోవడం ఆపకపోతే పోరాటం తప్పదన్నారు.

కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ టీడీపీ హయాంలో వనరులను కాపాడి, సంపద సృష్టిస్తే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సంపదను, వనరులను దోచుకుకంటున్నారని మండిపడ్డారు. చినకొండను 22 సంవత్సరాలుగా మేకలు, ఆవులు మేపుకుంటున్నారని, ఈ ప్రభుత్వం వచ్చాక అనుమతులకు మించి గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారని విమర్శించారు.

అనంతరం అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ రంగంపేట మండలం వీరంపాలెం గ్రామంలో సర్వే నెం 137లో ఉన్న చినకొండ గ్రావెల్ తవ్వుకోవడానికి 5 ఏళ్లపాటు 3.08 లక్షలు క్యూబిక్ మీటర్లు గ్రావెల్ మైనింగ్ కు అనుమతి ఇస్తే ఒక్క సంవత్సరానికే 5లక్షల క్యూబిక్ మీటర్లు గ్రావెల్ తవ్వకాలు జరిపారన్నారు. ఇసుకను రూ.2వేలకు చంద్రబాబు ఇస్తే జగన్ రెడ్డి మాత్రం రూ.5 వేలు చేశారని మండిపడ్డారు.

అనకాపల్లిలోని కశింకోట…
అనకాపల్లి నియోజకవర్గం, కశింకోట మండలంలోని బయ్యవరం గ్రామంలో వైసీపీ నేతలు చేస్తున్న మైనింగ్ ప్రాంతాన్ని టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద్, పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 600 ఎకరాల భూ అక్రమణలు జరిగాయని, వాటిపైవెంటనే ప్రత్యేక దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కుంటున్న వైసీపీ నేతలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.