Advertisements

తలసాని చొరవతో తెలంగాణలో హాస్టళ్ల సమస్యకు తెర!

యజమానునులతో ఫలించిన మంత్రి చర్చలు
అసలు ఒత్తిళ్లు పోలీసుల నుంచేనట
వాళ్లే ఒత్తిడి చేశారన్న హాస్టల్ యజమానులు
తలసాని జోక్యంతో మళ్లీ తెరచుకున్న హాస్టళ్లు
సరుకులకు పాసులు ఇవ్వాలని పోలీసులకు ఆదేశం
స్వయం నియంత్రణ పాటించాలని విద్యార్ధులకు హితవు
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో నెలకొన్న హాస్టల్ విద్యార్ధులు, బ్యాచిలర్ల సమస్యకు తెలంగాణ
సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెరదించారు. కరోనా కారణంగా దీర్ఘకాలిక
సెలవులివ్వడం, తాము ఉంటున్న హాస్టళ్లను ఖాళీ చేయాలని యజమానులు ఆదేశించడంతో..
విద్యార్ధులు, బ్యాచిలర్లయిన ఉద్యోగులు సతమతమయ్యారు. అమీర్‌పేట, సంజీవరెడ్డినగర్,
వెంగళరావునగర్‌లో ఉన్న, దాదాపు వంద హాస్టళ్ల విద్యార్ధులంతా ఏపీకి వెళ్లేందుకు
ప్రయత్నించారు. అయితే,  అది జగ్గయ్యపేట గరికపాడు చెక్‌పోస్టు వద్ద వివాదం సృష్టించిన
విషయం తెలిసిందే.

తలసాని జోక్యంతో మళ్లీ తెరచుకున్న హాస్టళ్లు

దీనితో నూజివీడులో ఏర్పాటుచేసిన క్వారంటైన్లకు వెళ్లడం ఇష్టం లేని వారంతా, తిరిగి హైదరాబాద్‌కు వెనక్కివచ్చారు. అయితే వాళ్లకు తిరిగి హాస్టళ్లలో ప్రవేశం లేకపోవడంతో, తలదాచుకునే వీలు లేక నానా పాట్లు పడ్డారు. అలాంటి వారికి జీహెచ్‌ఎంసీ 5 రూపాయల భోజనం ఏర్పాటుచేస్తుందని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.  ఈ విషయం తెలుసుకున్న సనత్‌నగర్ ఎమ్మెల్యే, తెలంగాణ సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ హుటాహుటిన రంగంలోకి దిగారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్‌తో కలసి, వందమంది హాస్టల్ యజమానులు, సంజీవరెడ్డినగర్ పోలీసులతో యుద్ధప్రాతిపదికన సమావేశం ఏర్పాటుచేశారు.ఈ క్లిష్ట పరిస్థితితో హాస్టళ్లలో ఉండేవారిని ఖాళీ చేయమని ఒత్తిడి చేయడంపై, తలసాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ప్రభుత్వానికి సహకరించకుండా, సమస్యలు సృష్టించడం ఏమిటని క్లాసు తీసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురాకుండా, ఇంత సున్నితమైన అంశంలో ఏకపక్ష నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారని తలంటారు.

వాళ్లే ఒత్తిడి చేశారన్న హాస్టల్ యజమానులు

తలసాని ఆగ్రహాన్ని గ్రహించిన హాస్టల్ యజమానులు, అసలు విషయాన్ని బయటపెట్టారు. వారు హాస్టళ్లలో ఉండటం వల్ల తమకేమీ నష్టం లేదని, అయితే స్థానిక పోలీసులు ఒత్తిడి చేయడం వల్లే ఖాళీ చేయించాల్సి వచ్చిందని తలసాని, మాగంటి దృష్టికి తీసుకువెళ్లారు. వారిని హాస్టళ్లలో ఉండనిస్తామని, అయితే భోజన ఏర్పాట్ల కోసం, కావలసిన సరుకులు తీసుకునేందుకు బయటకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.దీనితో, అసలు సమస్య తెలుసుకుని , హాస్టళ్ల యజమానులు సరకులు తెచ్చుకునేందుకు, పాసులు ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.

స్వయం నియంత్రణ పాటించాలని విద్యార్ధులకు హితవు

తర్వాత, అక్కడికి వచ్చిన హాస్టల్ విద్యార్ధులు, బ్యాచిలర్ ఉద్యోగులకూ క్లాసు ఇచ్చారు. కరోనా తీవ్రత కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాటించాలన్నారు. స్వయం నియంత్రణతోనే కరోనాను నివారించగలమని చెప్పారు. తాను పోలీసులకు తగిన సూచనలు ఇచ్చామని, ఇకపై మీకు ఎలాంటి సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. హాస్టళ్ల వద్ద 5 రూపాయల భోజనం ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. దీనితో వారంతా తలసానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఉచిత భోజన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తలసాని

అనంతరం మంత్రి తలసాని.. మాజీ మంత్రి  దానం నాగేందర్,  ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్, ఎమ్మెల్యే,  కార్పొరేటర్ నామన శేషుకుమారితో కలసి.. అమీర్‌పేటలో అక్షయపాత్ర-జీహెచ్‌ఎంసీ ఏర్పాటుచేసిన ఉచిత భోజన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మునిసిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు, 10 వేలమందికి నగరంలోని 80 ప్రాంతాల్లో ఉచిత భోజన సెంటర్లు ఏర్పాటుచేశామని తలసాని చెప్పారు.

మార్కెటింగ్ అధికారులపై మండిపాటు

తర్వాత ఎర్రగడ్డ రైతుబజార్‌ను సందర్శించారు. మార్కెట్‌లో పారిశుధ్య పనులు, సక్రమంగా నిర్వహించని మార్కెటింగ్ అధికారులపై విరుచుకుపడ్డారు. వ్యాపారులు దూరం పాటించాలని, కూరగాయల ధరల బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తర్వాత యూసుఫ్‌గూడలోని రత్నదీప్ సూపర్‌మార్కెట్‌ను తనిఖీ చేశారు. అక్కడి వస్తువుల ధరలను వాకబు చేశారు. రైతుబజార్ ధరల కంటే, రత్నదీప్ ధరలు ఎక్కువగా ఉండటంపై, యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా లాభాపేక్షతో వ్యాపారం చేస్తే ఎలా అని క్లాసు ఇచ్చారు. మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య వివాదం సృష్టించిన హాస్టల్ సమస్య పరిష్కరించడంతోపాటు, రైతుబజార్, ప్రైవేటు మాల్స్‌లో ధరల పెంపుపై తలసాని దృష్టి సారించారు.

One thought on “తలసాని చొరవతో తెలంగాణలో హాస్టళ్ల సమస్యకు తెర!

Leave a Reply

%d bloggers like this: