ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షుడిగాతెలుగు వ్యక్తి

ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి చెన్నుపాటి జగదీశ్‌కు అత్యంత అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోని అత్యుత్తమ సైన్స్ అకాడమీల్లో ఒకటైన ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ తదుపరి అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు. ఈ పదవికి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. జగదీశ్ ప్రస్తుతం ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్‌యూ)లో భౌతికశాస్త్ర పరిశోధకుడిగా ఉన్నారు. నానో టెక్నాలజీలో నిపుణుడైన ఆయన మే 2022లో ఆస్ట్రేలియా అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు.
ఈ సందర్భంగా జగదీశ్ మాట్లాడుతూ.. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తానన్నారు. కృష్ణా జిల్లా వల్లూరిపాలెం అనే మారుమూల గ్రామం నుంచి 31 సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల కాంట్రాక్ట్‌తో జగదీశ్ ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్‌లో అడుగుపెట్టారు. ఇప్పుడు అదే అకాడమీకి ఆయన నేతృత్వం వహించనున్నారు. ఆస్ట్రేలియా పార్లమెంటుకు ఈ అకాడమీ స్వతంత్ర, శాస్త్రీయపరమైన సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటుంది.
ఇలాంటి ప్రముఖ సంస్థను నడిపించేందుకు చెన్నుపాటి సరైన వ్యక్తి అని ఏఎన్‌యూ వైఎస్ చాన్స్‌లర్, నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ బ్రియాన్ ప్రశంసించారు. ఆయన చేతుల్లో అకాడమీ సురక్షితంగా ఉంటుందని అన్నారు. జగదీశ్ ప్రస్తుతం ఆస్ట్రేలియన్ నేషనల్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీకి డైరెక్టర్‌గానూ ఉన్నారు. ఆస్ట్రేలియన్ రీసెర్చ్ కౌన్సిల్ నుంచి ఆయనకు ఫెడరేషన్ ఫెలోషిప్, లెరోట్ ఫెలోషిప్ కూడా లభించాయి. ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం సందర్భంగా 2016లో ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారానికి ప్రభుత్వం ఎంపిక చేసింది.