– ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు
న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదానికి జీవం పోసేలా, ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.11,440 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన సందర్భంగా కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో కలిసి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపినట్టు కేంద్ర ఉక్కు, భారీపరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రానున్న బడ్జెట్ సమావేశాలు – 2025 దృష్ట్యా వికసిత ఆంధ్రప్రదేశ్ – 2047 కలని సాకారం చేసేలా, రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు (ముఖ్యంగా పోలవరం – అమరావతి), నూతన ప్రాజెక్టులను కేటాయించి, పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు వర్మ పేర్కొన్నారు. ఇంకా, ఆయన ఏ వివరాలు అందించారంటే..
గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి తో కలిసి పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ని కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని గౌరవించాలని పలు దఫాలుగా విజ్ఞప్తి చేశాం. చివరగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చిత్తశుద్ధి కలిగిన నరేంద్ర మోదీ ప్రభుత్వం కాలయాపన చేయకుండా కేవలం 7 నెలల వ్యవధిలోనే నేడు ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనీయం.
ఈ నిర్ణయం ద్వారా ఎన్నో ఏళ్లుగా కార్మికులు పడుతున్న ఇబ్బందులు తిరిపోయి, విశాఖ ఉక్కు కర్మాగారం పునర్ వైభవ స్థితికి చేరుకొని లాభాల బాటలో పయనిస్తుందని ఆశిస్తున్నాను. మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుపున ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల తరుపున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు.