Suryaa.co.in

Features

థాంక్యూ…థాంక్యూ…థాంక్యూ

-మనఃస్ఫూర్తిగా చెబుతున్నామా… ఆలోచించండి!

థాంక్యూ… చిన్న పదమే కానీ దాని ప్రయోజనాలు బోలెడు!
ఎవరైనా కాస్త సాయం చేయగానే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతారు కొందరు. ఫార్మాలిటీ కోసం థాంక్యూ అంటారు మరికొందరు.
ఇంత చిన్న పనికి కూడా థాంక్స్‌ చెప్పాలా అనుకుని అసలు చెప్పరు ఇంకొందరు. కానీ ఎంత చిన్నదానికైనా థాంక్స్‌ చెప్పే తీరాలి. ఆ పదానికి అంత విలువుంది మరి. కృతజ్ఞతాభావన వ్యక్తులమధ్య అనుబంధాన్నీ నమ్మకాన్నీ పెంచుతుంది.

ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్ని పెంచి, ఆ ఇద్దరినీ చూసిన మరికొందరు సైతం సాయం చేసేలా ప్రేరేపిస్తుందని పరిశోధనలూ చెబుతున్నాయి. కావాలంటే సోషల్‌మీడియాలో పెట్టే పోస్టులనే పరిశీలించండి. ఓ ఫొటో షేర్‌ చేయగానే కొందరే ముందు రియాక్ట్‌ అవుతారు.

వాళ్లకి థాంక్స్‌ చెప్పగానే మరికొందరు స్పందిస్తారు. అదే మీరు ఎవరికీ థాంక్స్‌ చెప్పకపోతే… మర్నాటి మీ పోస్టుకి స్పందన స్వల్పమే. కొన్నిసార్లు థాంక్‌ యూ నోట్‌ వల్ల ఊహించని లాభాలూ ఉంటాయి. ఇప్పటిలా క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌ లేని రోజులవి. చదువులో చాలా చురుకైన అమ్మాయి సంధ్య… చిన్నప్పటి నుంచీ తాను కలలు కన్న ఓ ప్రముఖ సంస్థలో మేనేజర్‌ పోస్టుకి అప్లై చేసింది. ఇంటర్వ్యూ బాగా చేసింది. ఉద్యోగం వస్తుందనుకుంది కానీ, వేరే అమ్మాయిని తీసుకున్నారని తెలిసింది.

తనకు రానందుకు బాధనిపించినా, ఆ పదవికి తనకు అర్హతలు ఉన్నాయని భావించి ఇంటర్వ్యూకి పిలిచినందుకు కంపెనీకి ‘థాంక్‌ యూ’ అని ఓ లెటర్‌ రాసి, అందమైన కవర్‌లో పెట్టి పోస్టు చేసింది. అది చూసి ఆ సంస్థ యాజమాన్యం ఆశ్చర్యపోవడమే కాదు, తిరిగి ఉత్తరం రాసింది.

‘థాంక్స్‌ చెప్పాల్సిన అవసరం లేకున్నా మీరు స్పందించిన తీరు, నిజాయతీ మాకు నచ్చాయి. భవిష్యత్తులో ఏ అవకాశం ఉన్నా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటాం’ అని.కొన్ని రోజులకు నిజంగానే ఆ కంపెనీలోనే మరో పోస్టుకు ఆమెకు అపాయింట్‌మెంట్‌ లెటర్‌ వచ్చింది. ఇదంతా కేవలం ఆమె రాసిన థాంక్‌యూ నోట్‌ ఫలితమే.

నిజానికి ఉద్యోగం రానప్పుడు చాలామంది ఏం చేస్తారు? అన్ని అర్హతలూ ఉన్నా తనకి ఉద్యోగం ఇవ్వలేదని కంపెనీ పట్ల అకారణ ద్వేషం పెంచుకుంటారు. నెగెటివ్‌గా మాట్లాడతారు. సంధ్య అలా చేయకపోగా ఆ సంస్థలో ఇంటర్వ్యూకి వెళ్లడమే గొప్పగా భావించింది. కంపెనీని, దాని నిర్ణయాన్ని గౌరవించింది. కృతజ్ఞత కనబరిచింది. లక్ష్యాన్ని చేరుకుంది.

మరి మనం అలా చేస్తున్నామా? జీవితాన్నిచ్చిన తల్లిదండ్రులకీ, పాఠాలు నేర్పిన గురువులకీ, అండగా ఉన్న స్నేహితులకీ, తోడుగా ఉన్న భాగస్వామికీ, జీవితంలో స్థిరపడేందుకూ ఎదగడానికీ కారణమైన సంస్థల యాజమాన్యానికీ, ఎప్పుడైనా మనఃస్ఫూర్తిగా థాంక్స్‌ చెబుతున్నామా… ఆలోచించండి!

– రాళ్లపల్లి

LEAVE A RESPONSE