అండమాన్ లో వికసించిన పొత్తు ధర్మం, తెలుగు రాష్ట్రాలలో కూడా కొనసాగాలి

-జనసేన, బిజెపి, టిడిపిలు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏకం కావాలి
-పొత్తులపై స్పష్టతనిచ్చిన పవన్ కళ్యాణ్
-వైకాపా వారు అనుకునేది కాదు… ప్రజలనుకునేదే జరుగుతుంది
-ఇద్దరు బలమైన నాయకులు కలిస్తే ప్రజలకు వచ్చే ఆ ధైర్యమే వేరు
-ట్రెండింగ్ లో జస్టిస్ ఫర్ వైఎస్ వివేక హ్యాష్ ట్యాగ్
-వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్ పై కోర్టు తీర్పు త్వరలోనే వెలువరిస్తుందని కోరుకుందాం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే ఊహించుకుంటున్నారో దాన్ని జరగనివ్వను. ప్రజలు ఏదైతే ఊహించుకుంటున్నారో అదే జరుగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విస్పష్టంగా పేర్కొన్న తీరు అభినందనీయమని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. క్షేత్రస్థాయిలో బల, బలాల బేరిజు వేసుకొని అన్ని స్థానాలలో గెలవగలమని నమ్మకం కలిగిన్నప్పుడే 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేద్దాం . ఈసారి ఎన్నికల్లో పోటీ చేసిన వారంతా అసెంబ్లీలో అడుగు పెడతారు. రాశి కాదు వాసి ముఖ్యం అన్నట్టుగా పోటీ చేసిన వారంతా అసెంబ్లీలో అడుగుపెడతారని పవన్ కళ్యాణ్ చెప్పిన తీరు అద్భుతంగా ఉందన్నారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… జనసేన పదో వార్షికోత్సవ సభలో 90 నిమిషాల పాటు కొనసాగి పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని లక్షలాదిమంది టీవీలకు అతుక్కుపోయి వీక్షించారన్నారు.

మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన బహిరంగ సభకు ఇసుక వేస్తే రాలనంత మంది ప్రజలు హాజరయ్యారు. గతంలో ఎన్టీ రామారావు బహిరంగ సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలుహాజరయితే
, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సభకు జనం కిక్కిరిసిపోయారన్నారు. తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. గతంలో తనకు ఎదురైన ఓటముల గురించి చెరగని చిరునవ్వుతోనే ధైర్యంగా మాట్లాడారు. ఏపీ ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ గట్టిగా నిలబడ్డారు. ప్రధానమంత్రి మోడీ అంటే వ్యక్తిగతంగా ఎంతో గౌరవంతో ఉన్నప్పటికీ, నమ్మిన ప్రజల కోసం తనకు ఎంతో నచ్చిన మోడీతో కూడా హోదా సాధనకు పోరాడానని చెప్పారు. తాను ఎవరి కోసమైతే పోరాడానో, ఆ ప్రజలే ఒక విధంగా తనని మోసగించారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. పదేపదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, 175 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసే దమ్ముందా? అని ప్రశ్నిస్తున్నారని, తాను ఎన్ని స్థానాలలో పోటీ చేయాలో కూడా చెప్పడానికి మీరెవరు అంటూ జనసేన సేనాని సూటిగా ప్రశ్నించి చెంప చెల్లుమనిపించేలా సమాధానం చెప్పారు. కేంద్రంలో అధికారం ఉన్న బిజెపి, దేశంలోని 540 పార్లమెంటు స్థానాలలో పోటీ చేయడం లేదు. ఎన్నో రాష్ట్రాలలో పొత్తుల కారణంగా ఆ పార్టీ, మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తుందని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు.

సొంత కులాన్ని గౌరవించడంతోపాటు, పక్క కులాన్ని మరింత గౌరవించాలన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అందరికీ ఆదర్శం. పవన్ కళ్యాణ్ మాట్లాడితే చాలు, ఆయనపై స్వజాతీయులైన మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి అంబటి రాంబాబు వంటి వారితో విమర్శలు చేయించడం సిగ్గుచేటని రఘు రామ కృష్ణంరాజు విమర్శించారు. ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఎన్నికల్లో పొత్తుల గురించి పవన్ కళ్యాణ్ విస్పష్టమైన సమాధానాన్ని ఇచ్చారు. బుద్ధి, జ్ఞానం ఉన్న ఎవరికైనా పవన్ కళ్యాణ్ చెప్పింది అర్థమవుతుంది. పొత్తులపై పవన్ కళ్యాణ్ కంటే స్పష్టంగా మరొకరు చెప్పలేరని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

కేంద్ర పెద్దలతో సఖ్యత ఉందంటే… రాష్ట్ర పెద్దలతో లేనట్టే లెక్క
జాతీయ బిజెపి నాయకులతోను , కేంద్ర పెద్దలతోనూ తనకు సఖ్యత ఉందని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే, రాష్ట్ర బిజెపి నాయకులతో సరైన సఖ్యత లేదన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతియేనని ర్యాలీ నిర్వహించడానికి కేంద్ర పెద్దలను, బిజెపి జాతీయ నాయకులను ఒప్పించినప్పటికీ, రాష్ట్ర బిజెపి నాయకత్వం మాత్రం ఎందుకో మొండి చేయి చూపిందన్న పవన్ కళ్యాణ్, ర్యాలీ నిర్వహించాలనుకున్నప్పటికీ, నిర్వహించలేని తన నిస్సహాయతను వ్యక్తం చేయడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్ధుడైన నాయకుడని పవన్ కళ్యాణ్ కితాబు నిచ్చారన్న రఘురామకృష్ణం రాజు , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల కోటలు బద్దలు కొడతానని చెప్పారన్నారు . విశాఖపట్నం నుంచి తనని వెనక్కి పోలీసుల ద్వారా పంపిన తీరు, జన సైనికులపై దాడి చేసి అక్రమంగా కేసులు నమోదు చేసిన వైనాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారని వెల్లడించారు. తనపై వస్తున్నా నీలాప నిందల గురించి కూడా పవన్ కళ్యాణ్ , జనసేన పదవ వార్షికోత్సవ వేదికగా తిప్పికొట్టారు. తనకు ఒక చిత్రంలో నటిస్తే, రోజుకు రెండు కోట్ల రూపాయల పారితోషికం లభిస్తుందని చెప్పారు. ఏడాదికి 200 రోజులు పని చేసిన పవన్ కళ్యాణ్ కు 400 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఇంతగా అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రజల కోసం ఏదో చేయాలనే తపనతో పరిశ్రమిస్తుంటే, తమ పార్టీకి చెందిన కొంతమంది చిల్లరగాళ్లతో మాట్లాడించి, ఆయన పై వ్యక్తిగత విమర్శలు చేయడం వారి సంస్కారానికి నిదర్శనం అని మండిపడ్డారు. ఏదో ఒక రకంగా రెచ్చగొడితే పవన్ కళ్యాణ్ ఎమోషనల్ గా ఉద్వేగానికి లోనవుతారని, దానితో తాము అనుకున్నది జరుగుతుందనే భ్రమలో తమ పార్టీ పెద్దలు ఉన్నారన్నారు.

సీట్ల గురించి అందరితో చర్చించాక నిర్ణయమన్న పవన్ కళ్యాణ్
ఎన్నికల పొత్తులో భాగంగా ఇప్పటికే పాతిక సీట్లకు ఒప్పందం కుదిరిందని కొంతమంది చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. సీట్ల గురించి పార్టీలో అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటాను. జనసేన పదో వార్షికోత్సవ సభ లో పవన్ కళ్యాణ్ ప్రసంగం ప్రజాస్వామ్య పరిరక్షణకు, అణగారిన భవిష్యత్ ఆశలకు మళ్లీ ఊపిరి పోసినట్లయ్యిందని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్నో అరాచకాలు చూశాం. 5, ఆరవ తరగతి చదివిన వారు కూడా పట్టభద్రులుగా పేర్లు ను నమోదు చేసుకొని ఓట్లు వేయడం తెలిసిందే. ఎన్నికల బూతుల వద్ద పోలీసుల సహకారంతో డబ్బులు పంచాక, ప్రజాస్వామ్యంపై, తమ భవిష్యత్తుపై ఆశలను వదులుకున్న వారికి పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎంతో ఊరటనిచ్చిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు .

బాహుబలి లాగా ఆ ఇద్దరు నేతలు ముందు ఉంటే ప్రజలకు కొండంత ధైర్యం
బాహుబలి చిత్రంలో మనోధైర్యం లేని ప్రజలకు కథానాయకుడు ప్రభాస్ ముందు ఉండడం ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని, అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుంటే రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షసత్వాన్ని ఎదుర్కొనే ధైర్యం ప్రజలకు వస్తుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. క్షేత్రస్థాయిలో బలమున్న ప్రాంతాలలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఒక స్పష్టత వచ్చినప్పటికీ,ఎన్నికల ఎత్తుగడలు వ్యూహాత్మకంగానే ఉండాలి. రెండున్నర ఏళ్ల క్రితం అండమాన్ పోర్టు బ్లేయర్ మున్సిపల్ పాలకవర్గానికి జరిగిన ఎన్నికల్లో టిడిపి, బిజెపి కలిసి పోటీ చేశాయి. ఎన్నికల ఒప్పందంలో భాగంగా రెండున్నర ఏళ్ల తర్వాత టిడిపి నాయకురాలు సెల్వి కి బిజెపి నాయకత్వం చైర్మన్ పదవిని అప్పగించింది. ప్రధానమంత్రి మోడీ నాయకత్వాన్ని చూసి ఎన్నికల్లో పొత్తులు సాధ్యపడ్డాయని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఎప్పుడైనా రుతుపవనాలు అండమాన్ నుంచే ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు విస్తరిస్తాయి. అండమాన్ లో వికసించిన పొత్తు ధర్మం, తెలుగు రాష్ట్రాలలో కూడా కొనసాగాలని రఘురామకృష్ణం రాజు ఆకాంక్షించారు. జనసేన, బిజెపి, టిడిపిలు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏకం కావలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో కొనసాగుతున్న దారుణాలు, ప్రజలను హింసించే సంఘటనలు ఆగాలి అంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఏకం కావలసిన అవసరం ఉందని రఘురామకృష్ణం రాజు అభిప్రాయపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రానున్నది గడ్డు రోజులేనని ఆయన వ్యాఖ్యానించారు.

పురోగతి లేని వైఎస్ వివేకా కేసు
నాలుగేళ్లు పూర్తి కావస్తున్నా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏమాత్రం పురోగతి లేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. వైయస్ వివేకా అన్న గారి అబ్బాయి ముఖ్యమంత్రి అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. జస్టిస్ ఫర్ వివేక హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో మూడవ స్థానంలో ఉందని, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో సహా పార్టీలకతీతంగా అందరూ న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. తొలుత గుండెపోటు అని చెప్పి, ఆ తరువాత గొడ్డలి పోటు అని , నారాసుర రక్త చరిత్ర అని చెప్పినప్పటికీ, హత్య లో పాల్గొన్నవారు దొరికిన తర్వాత ఒక స్థాయి సూత్రధారులు ఎవరో తెలిసిందని అన్నారు. నిజ దోషులు తప్పించుకునే ప్రమాదం ఉందని గ్రహించి సిబిఐ విచారణ కోసం డాక్టర్ సునీత న్యాయపోరాటం చేశారు. హత్యలు చేసే వారికి, చేయించే వారికి భయం ఉండేలా మార్పు కోసం పోరాడుతున్న డాక్టర్ వైయస్ సునీతకు ప్రజలంతా అండగా ఉండాలని రఘురామకృష్ణం రాజు కోరారు. బంధువుల రూపంలోనే చుట్టూ నరరూప రాక్షసులు ఉన్నా ఆమె పోరాడుతున్న తీరు అభినందనీయం. హత్య కేసులో కొత్త, కొత్త క్యారెక్టర్ లను తీసుకువచ్చి, కోర్టులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. వైయస్ అవినాష్ రెడ్డి అత్యవసరంగా దాఖలు చేసిన పిటిషన్ పై ఈ వారాంతంలో, లేకపోతే సోమవారమైన తీర్పు వెలువబడుతుందేమో చూడాలి.

సీబీఐ అధికారిపై గతం లో చిన్నాచితకా వ్యక్తులు కేసులు పెట్టగా, ప్రస్తుతం ఒక ఎంపీ నే నేరుగా కోర్టులోనే మెన్షన్ చేయడం పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వమే స్పాన్సర్డ్ చేస్తుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కోర్టులకు వెళ్లి విచారణ ఆగిపోయే విధంగా అడ్డంకులను సృష్టిస్తున్నారు. ఈ తరహా పరిణామాల వల్ల వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉంది. కోర్టుకు వెళితే చేతులు జోడించి తీర్పు త్వరగా రావాలని భగవంతున్నిప్రార్థించడం మినహా చేయగలిగింది ఏమీ లేదు. సమాజంలో ఇటువంటి దారుణ హత్యలు జరగకుండా కోర్టు తీర్పు త్వరగా రావాలని కోరుకుందామని రఘురామ కృష్ణంరాజు అన్నారు. కథ తెలిసిన వాడే సినిమా దర్శకుడని, బాబాయ్ హత్య గురించి కళ్లకు కట్టినట్లు వివరించిన వాడే హూ కిల్డ్ బాబాయ్ చిత్ర దర్శకుడని ఒక పార్టీ జాతీయ కార్యదర్శి లైటర్ వే లో చెప్పినప్పటికీ, అందరిని ఆలోచింప చేస్తోంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఏడాదిన్నర విరామంతో రాజమౌళి తేల్చేసినప్పటికీ, వైఎస్ వివేక హత్య సూత్రధారులు నాలుగేళ్లయిన చట్టానికి చిక్కకపోవడం ఆశ్చర్యకరమే. వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షులు శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్ రెడ్డిలు అనుమానాస్పస్థితిలో మృతి చెందారు. వైఎస్ వివేక హత్య కేసును త్వరగా తేల్చకపోతే మరిన్ని మరణాలు, ఆత్మహత్యలు ఉంటాయేమోనని రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply