పాదయాత్రకు ముఖ్యమంత్రి భయపడ్డారు

-అందుకే అసెంబ్లీ వేదికగా మూడు ప్రాంతాల విభజన భావోద్వేగ గీతం ఆరోపించారు
-అమరావతి బహుజన జేఏసీ బాలకోటయ్య వ్యాఖ్య

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నాలుగవ రోజుకే భయపడ్డారని, అందుకే అసెంబ్లీ వేదికగా వికేంద్రీకరణ పేరు చెప్పి పాదయాత్ర పై రాజకీయ యుద్ధానికి తెరలేపారని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని సమస్యలను, శాంతి భద్రతల ను, అభివృద్ధి కార్యక్రమాల చర్చను గాలికొదిలి ఏకంగా పాదయాత్ర పైనే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగించటం ఇందుకు నిదర్శనం అన్నారు.

దేవుళ్ళకు కూడా ప్రాంతీయతను అంటగట్టిన ఏకైక సిఎం గా జగన్మోహన్ రెడ్డి చరిత్ర కెక్కారని ఎద్దేవా చేశారు. కట్టని రాజధాని అంటూనే కట్టిన అసెంబ్లీ నుంచి ప్రసంగించారని,మూడేళ్లుగా పరిపాలన అమరావతి నుంచే జరుగుతుందని గుర్తు చేశారు. భగవద్గీత,ఖురాన్, బైబిల్ గా పేర్కొన్న వైకాపా మేనిఫెస్టోలో రాజధాని అమరావతి అని ఎందుకు పేర్కొన్నారో,ఇల్లు కట్టుకున్నామని, కార్యాలయం పెట్టుకున్నామని, గత ప్రభుత్వం కంటే మిన్నగా రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పిన అంశాలపై ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు.

రాష్ట్రానికి రాజధాని మార్చే హక్కు లేదని న్యాయస్థానం చెప్పిందని, ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుందని, ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్రాలకు రాజధాని ఏర్పాటు చేసుకునే హక్కు కల్పించమంటూ పార్లమెంట్లో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టిన అంశాలను ఎందుకు ప్రస్తావించలేదు అని అన్నారు. మహిళల పాదయాత్ర వామన పాదంగా మారి ఎక్కడ వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేస్తుందో అనే ఆందోళనతోనే రాజధానిపై విష ప్రచారానికి రాజధాని అమరావతి కొరకు ఏక గ్రీవంగా తీర్మానం చేసిన అసెంబ్లీని వేదికగా వాడుకోవడం సిగ్గు చేటు అని బాలకోటయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply