- వరద ముంపు ప్రాంతాల్లో 16నుంచి సీఎల్పీ బృందం పర్యటన
- ప్రభుత్వ తప్పిదాలను ప్రజల ముందుంచుతాము
- ప్రతి జిల్లాలో రేపటి నుంచి ఆజాదీ గౌరవ్ యాత్రలు
- టీఆర్ ఎస్‌కు కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయం
- మునుగోడులో భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుంది
- సీల్పీ నేత భట్టి విక్రమార్క
- గాంధి చరిత్రను వక్రీకరించేందుకు బిజెపి కుట్ర: శ్రీధర్‌బాబు
- బిజెపికి ఎందుకు ఓటు వేయాలి:జీవన్‌రెడ్డి
వరదలతో జరిగిన నష్టం కంటే ప్రభుత్వం అవలంభిస్తున్న ఆలసత్వం వల్ల ప్రజలకు ఎక్కువ నష్టం జరుగుతున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. వరద ముంపు ప్రాంతాల్లో జరిగిన నష్టం అంచన వేయకుండ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఈ నెల 16నుంచి సీఎల్పీ బృందం వర్షాలు, వరద ముంపుతో జరిగిన నష్టాన్ని పరిశీలించడం కోసం పర్యటన చేస్తున్నదని ఆయన ప్రకటించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ టీ. జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
16న భధ్రచలం, వాజేడు, దుమ్మగూడెం, సీతమ్మసాగర్, సీతరామసాగర్, ములుగు, 17న కాళేశ్వరం, చెన్నూర్, మంచిర్యాల, 18న కడెం, కొమురంభీం ప్రాజెక్టులను సందర్శిస్తామని వెల్లడించారు. వరద ముంపునకు గురైన ప్రాజెక్టుల పరిస్థితులను స్వయంగా తెలుసుకొని ప్రభుత్వ తప్పిదాలను వెలికితీసి ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. వరదల్లో మునిగి పోయిన పంటలు, ఇండ్లు, పశు సంపద, మత్స్య సంపద నష్టాన్ని అంచనా వేసి బాధితులకు పరిహారం అందేలా కేంద్ర, రాష్ట ప్రభుత్వాలపై వత్తిడి పెంచుతామని చెప్పారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆనాటి స్వాతంత్ర సంగ్రామ చరిత్ర, దేశం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాలు, ఆనాటి మహనీయుల గాధలను, దేశం కోసం కాంగ్రెస్ నాయకులు చేసిన త్యాగాలను నేటి తరానికి చాటి చెప్పడం కోసం 75వ స్వాతంత్ర ఉత్సవాల సందర్భంగా ఆజాదీ గౌరవ్ యాత్ర పేరిట ఈనెల 9నుంచి 15వరకు అన్ని జిల్లాల్లో పాదయాత్రలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆజాదీ గౌరవ్ యాత్రలో బాగంగా ఆనాటి సమర యోధులను గుర్తించి ఘనంగా సన్మాణం చేస్తామన్నారు. దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం ప్రజలను చైతన్యం చేయడానికి, స్వాతంత్ర లక్ష్యాన్ని, దేశ భక్తిని ప్రజల్లో పెంపొందించడం కోసం నెహ్రు స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రికను మూసివేయడానికి బిజెపి కుట్రలు చేయడం స్వాతంత్రాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్రం రావడానికి మూలకారణమైన కుటుంబాన్ని అవమానించే విధంగా బిజెపి చేస్తున్న ఆకృత్యాలను ఈసందర్భంగా ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
నేషనల్ హెరాల్డ్ పత్రికలో మని లాండరింగ్ జరిగిందని ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా, రాహుల్ గాంధీలను విచారణ పేరిట రోజుల తరబడి ఈ.డీ కార్యాలయానికి పిలిపించి బిజెపి చేస్తున్న కక్ష్యపూరిత రాజాకీయాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో విపత్తులు వచ్చినప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వెంటనే స్పందించి నష్టం అంచనా వేయించి కేంద్రానికి నివేధిక ఇచ్చి కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి, వాటికి రాష్టం నుంచి మరిన్ని నిధులు జతచేసి బాధితులను ఆదుకోవడానికి పరిహారం ఇచ్చే వారని, కానీ నేడు టీఆర్ ఎస్ ప్రభుత్వం ఆలా చేయడం లేదని విమర్శించారు. రాష్టంలో కేంద్ర బృందం పర్యటన నామ మాత్రంగా కొనసాగిందన్నారు. బాధితులను ఆదుకునే చర్యలు కేంద్రం కూడ చేపట్టలేదన్నారు.
మునుగోడులో భారీ మెజార్టీతో గెలుస్తాము
మునుగోడు ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం దురదృష్టకరమన్నారు. చెయ్యి గుర్తుపై అనేక పదవులకు పోటీ చేసి గెలిచి ఇప్పడు కాంగ్రెస్‌ను కాదని బిజెపిలో చేరడాన్ని తీవ్రంగా ఖండించారు. మునుగోడులో 2018 ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లతో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. తెలంగాణలో టీఆర్ ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్లనే భద్రచలం మునిగిపోతున్నదని ప్రభుత్వం చెప్తున్నదని, భద్రచలం మునకకు గల కారణాలపై అధ్యయనం చేయడానికి త్వరలోనే సీఎల్పీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తామని వెల్లడించారు.
గాంధి చరిత్రను వక్రీకరించేందుకు బిజెపి కుట్ర
బ్రిటీష్ సామ్రజ్యవాదంపై పోరాడిన మహత్మగాంధి చరిత్రను కూడ వక్రకీరించేందుకు బిజెపి కుట్రలు చేస్తున్నదని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మండిపడ్డారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 50 సంవత్సరాల వరకు ఆర్ ఎస్ ఎస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయని వారు ఆజాది అమృత్ వారోత్సవాలు నిర్వహించాలని ప్రచార ఆర్భాటాలు చేయడం విడ్డూరంగా ఉందని పరోక్షంగా బిజెపిపై నిప్పులు చెరిగారు. రాజ్యంగం రూపొందించిన అంబేద్కర్‌ను వ్యతిరేకించిన బిజెపి నేడు రాజకీయ పబ్బం కోసం అంబేద్కర్ తన వాడన్నట్టుగా ప్రచార ఆర్భాటం చేస్తూ చరిత్రను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో బిజెపి పాత్ర ఏమున్నదని ప్రశ్నించారు.
స్వాతంత్ర పోరాటంలో ఆనాడు కాంగ్రెస్ వెనుకంజా వేస్తే స్వాతంత్ర ఫలాలు మనకు అందేవా అని అన్నారు. దేశానికి దశ దిశ కాంగ్రెస్ నిర్దేశించిందన్నారు. సంక్షేమ అభివృద్ది ఫలాలు నేడు పొందడానికి ఆనాటి కాంగ్రెస్ ప్రధానులు చేసిన కృషి ఫలితమేనని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరదల సాయం మాది కాదన్నట్లు వ్యవహరించడం తగదన్నారు. నష్టం అంచన వేయడానికి వచ్చిన కేంద్ర బృందం కేవలం భద్రచలం, ములుగులో పర్యటిస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. జగిత్యాల, మంథని, మంచిర్యాల, చెన్నూర్ ప్రాంతాలకు రాకపోవడం వివక్షత కాదా? అని నిలదీశారు. కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో నష్టం జరిగిన తీరును వివరించడానికి సెంట్రల్ టీమ్ ను సమయం కోరితే ఇవ్వలేదన్నారు. కాళేశ్వరం, సరస్వతి పంప్ హౌస్ లు మునిగాయని, వీటి వల్ల జరిగిన నష్టం, దీనికి బాధ్యలు ఎవరన్నదాని గురించి సీఎం కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బిజెపికి ఎందుకు ఓటు వేయాలి: జీవన్‌రెడ్డి
కాంగ్రెస్ తీసుకువచ్చిన ఐటీఐఆర్ ను బిజెపి రద్దు చేసినందుకా? ఆపార్టీకి ఓటు వేసేది. ఎందుకు వేయాలని రాజగోపాల్‌రెడ్డిని ఎమెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ఉండి యుద్దం చేయడానికి ఎవరు అడ్డు చెప్పారని నిలదీశారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన పబ్లిక్ రంగసంస్థలను మోడీ అమ్ముతున్నందుకా?, పెట్రోల్ డిజిల్ ధరలు పెంచి ప్రజలపైన భారం వేసినందుకా?, నిత్యవసర వస్తువులపై కూడ జీఎస్టీ పేరుతో ప్రజలను భాదుతున్నందుకా? తెలంగాణ రాష్ట ఏర్పాటును కించ పరిచే విధంగా ప్రధాని మోడీ ఆవహేళనగా మాట్లాడినందుకా?, దేశ రక్షణను గాలికొదిలేసి, సైనికులకు జీతాలు, పదవి విరమణ పొందిన వారిని ఫించన్లు ఇవ్వలేక ఆగ్నిపథ్ తీసుకొచ్చి యువకుల ఆశలపై నీళ్లు కుమ్మరించినందుకా?, ఎందుకోసం బిజెపికి ఓటు వేయాలని ప్రశ్నించారు. బిజెపి చేసిన మంచి పని ఒక్కటైన ఈదేశంలో ఉందా? అని నిలదీశారు.
గోమాత లాంటి పార్టీని వదిలి పులిలాంటి పార్టీకి పోతున్నట్టు ప్రకటించిన రాజగోపాల్‌రెడ్డి వైఖరిని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. గోమాతను మాత్రమే పూజిస్తారని, పులిని పూజించరన్నారు. పులిమీద స్వారీ చేయడం రాజగోపాల్‌రెడ్డికే ప్రమాదమని హెచ్చరించారు. టీఆర్ ఎస్ పెనం లాంటిది అయ్యితే బిజెపి పోయ్యి లాంటిదని టీఆర్ ఎస్‌పై యుద్దం చేయడానికి బిజెపిలోకి వెళ్లడం రాజగోపాల్‌రెడ్డి పోయ్యిలో పడిన చందమే అని ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి సెమి ఫైనల్ లాంటిదన్నారు. కచ్చితంగా పిసిసి, సీఎల్పీ సమన్వయంతో మునుగోడులో కాంగ్రెస్‌ను గెలిపించుకుంటామని ప్రకటించారు.