– ప్రజలను రక్షించాల్సిన వ్యవస్థలు నిర్వీర్యం
– రాష్ట్రంలో ప్రజాహక్కులు కరిమింగిన వెలగపండు
– జోగి రమేష్ అక్రమ అరెస్టు దుర్మార్గం
– రాష్ట్రంలో నడుస్తుంది నారా వారి రూల్ ఆఫ్ లా
– మీడియాతో వైయస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి
తాడేపల్లి: రాజ్యాంగ ప్రకారం ప్రజల హక్కులను కాపాడుతూ.. రాష్ట్రాన్ని, ప్రజలను రక్షించాల్సిన వ్యవస్థలు కరిమింగిన వెలగపండులా తయారయ్యాయని.. వైయస్సార్సీపీ స్టేటే కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు ద్వారా చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ వికృతరూపం బట్టబయలైందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే రాజకీయ వ్యవస్థ శూన్యమైందని.. కూటమి ప్రభుత్వం నేర స్వభావాన్నే రూల్ ఆఫ్ లా గా నడుపుతుందని మండిపడ్డారు.
రెండేళ్లలోనే ఇంతటి దారుణమైన పాలన ఉంటే… రానున్న మూడేళ్లలో మరింత వికృతంగా, విచ్చలవిడిగా తయారయ్యే ప్రమాదముందని.. సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు, మీడియా వీటిని అధ్యయనం చేసి.. జరుగుతున్న దారుణాలను ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2024 జూన్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి ప్రభుత్వం అన్నమాటకు నిర్వచనమే మారిపోయింది.
ప్రభుత్వమే నేరస్వభావంతో దాన్నే రూల్ ఆఫ్ లా గా కార్యనిర్వహణలోకి తీసుకొస్తే… అది 2024 జూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లా ఉంటుంది. ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్లే దాన్ని ప్రోత్సహిస్తున్నారు. మాజీ మంత్రి, వెనుకబడిన వర్గాలకు చెందిన బలమైన నాయకుడిగా ఎదిగిన జోగి రమేష్ ను ఏ తప్పు చేయకుండా అక్రమంగా అరెస్టు చేశారు.
ఈ కేసు చూస్తే… నేరం జరుగుతున్న మొలకల చెరువు, ఇబ్రహీం పట్నం, అనకాపల్లి, ఏలూరులో నకిలీ మద్యం తయారీ చేస్తున్న చోట పోలీసులు పట్టుకున్నారు. నిన్నా, మొన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చుంటే.. ఈ నకిలీ మద్యం వ్యవహారంలో మా పాత్ర లేదు అని చెప్పడానికి అవకాశం ఉండేది. కానీ సాక్షాత్తూ చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ 2024 అభ్యర్ధి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న నకిలీ లిక్కర్ తయారీ ఫ్యాక్టరీ బయటపడింది.
నకిలీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జయచంద్రా రెడ్డికి చంద్రబాబు బీఫామ్ ఇస్తున్న దృశ్యం చూస్తే.. జనరల్ గా బీపామ్ తీసుకున్నప్పుడు పక్కనే కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ జయచంద్రారెడ్డి పక్కనే ఆయన ఆత్మలా జనార్ధనరావు పక్కనే ఉన్నాడు. ఇది పక్కన పెట్టి.. ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం జోగి రమేష్ తో ఏదో పెళ్లిలో జనావర్ధన రావు ఫోటో దిగితే దాన్ని ఆధారంగా చూపిస్తున్నారు. ఇక్కడ చంద్రబాబుతో బీపామ్ తీసుకుంటున్న జయచంద్రా రెడ్డి, పక్కనే జనార్ధన రావు ఉంటే దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు?
కాశీబుగ్గ ఘటన జరిగిన వెంటనే అధికార తెలుగుదేశం పార్టీ మంత్రులు మాకు సంబంధం లేదు.. అది ప్రైవేటు దేవాలయం అని ప్రకటించారు. ఘోరం జరిగిన వెంటనే అది మాది కాదు అన్నారంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టే.