టిడిపి హయాంలో జరిగిన అభివృద్ది,సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Spread the love

– టిడిపి విద్యార్ధి, యువజన సంఘాలను బలోపేతం చేయాలి
– సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి
– పార్టీ కార్యదర్శులు, టిఎన్ ఎస్ ఎఫ్ సమావేశాల్లో బక్కని నర్సింహులు పిలుపు

‘‘తెలుగుదేశం పార్టీ నాయకుల తయారీ కార్ఖానా’’ అంటూ రాష్ట్రంలో ఇప్పుడున్న నాయకులంతా టిడిపి ద్వారా ఎదిగినవారేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు పేర్కొన్నారు.వ్యక్తిగత బలం కాదు, పార్టీ బలం పెంచడమే ప్రధానాంశంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.ఎన్టీఆర్ భవన్ లో సోమవారం పార్టీ కార్యదర్శులు, కార్యనిర్వాహక కార్యదర్శుల మూడోవిడత సమావేశం, తెలుగునాడు విద్యార్ధి సమాఖ్య(టిఎన్ ఎస్ ఎఫ్) ఆత్మీయ సమావేశాల్లో పాల్గొని ప్రసంగించారు.

‘‘ఎన్టీఆర్ ద్వారానే బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం లభించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా విద్యా, ఉపాధి రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్డు, ఫ్లైవోవర్లు, వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు వచ్చాయి, యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించారు.

రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమంలో తెలుగుదేశం పార్టీ ముందు, తర్వాత రాష్ట్ర స్థితిగతులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని , క్షేత్రస్థాయిలో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అందరూ చురుగ్గా పాల్గొనాలని, అన్నిస్థాయిలలో కలిసికట్టుగా, అందరూ సమన్వయంగా పనిచేయాలని’’ విజ్ఞప్తి చేశారు.

పార్టీలో 11ఏళ్లు పనిచేశాక తనకు ఎమ్మెల్యే టిక్కెట్ లభించిన విషయం గుర్తుచేశారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో ఎన్నిక కావడం తెలుగుదేశం పార్టీ పట్ల, ఎన్టీఆర్, చంద్రబాబుల సామర్ధ్యంపై ప్రజల్లో ఉన్న నమ్మకమే కారణం అన్నారు.పార్టీ మనకేమి ఇచ్చింది అనిగాకుండా, పార్టీ బలోపేతంకోసం మనం ఏం చేశామనేది అందరూ ముఖ్యంగా తీసుకోవాలని అన్నారు.

ఈ సమావేశంలో జక్కలి అయిలయ్య యాదవ్, రాష్ట్రపార్టీ అధికార ప్రతినిధి బాలసుబ్రమణ్యం, టిఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్, తెలుగు యువత, టిఎన్ ఎస్ ఎఫ్ నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply