భారతదేశంలో స్త్రీల పేరు మీద ఆస్తి ఉండని రోజులలో మొట్టమొదటిగా స్త్రీలకు, ఆస్తి హక్కు తెచ్చిన ఘనత ఎన్ టి రామారావు గారికి దక్కుతుంది. అయినా అనేక కుటుంబాలలో ఆడపిల్లలను మగపిల్లలను సమానంగా చూడట్లేదు, ప్రస్తుత పరిస్థితులలో, చదువు వరకు ఆడపిల్లలను, మగ పిల్లలను సమానంగా చదివిస్తున్నారు గాని, పెండ్లి అయిన తరువాత వ్యత్యాసముగా చూస్తున్నారు. ఆస్తుల పంపకాలలోనూ సమాన వాటా ఆడపిల్లలకు దక్కటలేదు.
ఆస్తి గురించి కాదు గాని, ఒకే కడుపున పుట్టినప్పటికీ ప్రేమలో, కూతుర్ని ఒకలాగా, కొడుకుని ఒకలాగా చూసేసరికి, కొన్నిసార్లు స్త్రీలు మనస్తాపం చెందుతున్నారు. పిల్లల మధ్యలో తగాదాలకు దారి తీస్తుంది. కుమారుడు తన దగ్గర ఉంటాడని, కూతురు వేరే ఇంటికి వెళ్ళిపోతుందని, కొంతమంది భావిస్తారు, నిజానికి ఉద్యోగాల నిమిత్తం కుమారులు కూడా తల్లిదండ్రులకు దూరంగానే ఉంటున్నారు. ఇంకొంతమంది కుమారుడికి ఆస్తంతా రాసేసి, కొడుకు, కోడలు చూడట్లేదని కూతురు, అల్లుడు దగ్గరికి వచ్చి, సేవలు చేయించుకుంటున్నారు.
ఆస్తి అనుభవించేది కొడుకులు. సేవ చేసేది కూతుర్లు. నిజానికి ఎక్కువ శాతం కొడుకులు కంటే కూడా కూతుర్లే తల్లిదండ్రులని బాగా చూసుకుంటున్నారు. అయినా కృతజ్ఞత లేని కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. ఇంకొంతమంది తల్లిదండ్రులు, కొడుకు పిల్లలను ఒకరకంగా, కూతురు పిల్లల్ని ఇంకొక రకంగా కూడా చూసేవారు ఉన్నారు. నిజానికి భారతదేశంలో ఎన్నో శతాబ్దాలుగా స్త్రీ సమాజానికి మనం అన్యాయం చేశామనే చెప్పుకోవాలి. చదువుకోనీయలేదు. ఆస్తి హక్కు ఇవ్వలేదు.
ఇంట్లో ఉండి, వంట చేసి, పిల్లలను కనీ, భర్తకు, భర్త కుటుంబానికి సేవ చేసే వారిని గాను, భర్త క్రింద అణిగి మణిగి ఉండే వారిగానే చేశాము, ఇష్టముతో సేవ చేయడం తప్పు కాదు గాని, బలవంతంగా సేవ చేయించుకోవడం తప్పు, చాలాసార్లు స్త్రీలకు తగిన గౌరవం గాని, వారికి స్వేచ్ఛ గాని ఇవ్వలేదు. బిడ్డలను ప్రసవించే సమయంలో కూడా మగవారు చూడకూడదని హాస్పిటల్స్ కు పంపించకుండా ఇంటి వద్ద ప్రసవం చేసేవారు. బ్రతికితే బ్రతికినట్టు లేకపోతే అంతే, ఎందరో మహానుభావులు విలియం కేరి, మిషనరీలు స్త్రీలకు పాఠశాలలు, స్త్రీల ఆసుపత్రులు స్థాపించి సేవ చేశారు.
బాల్య వివాహాలు, సతీ సహగమనం మొదలగు దురాచారాల విషయంలో విలియం కేరి గారు, రాజా రామ్మోహన్ రాయ్ వంటి స్థానిక నాయకులతో కలిసి సంస్కరణలు తీసుకురావడానికి నాంది పలికారు. ఆ సంస్కరణ ఫలితంగా స్త్రీ సమాజం పురుష సమాజం కంటే కూడా ముందుగా ఉంది. చదువులు, ఉద్యోగాలలో కూడా స్త్రీ సమాజం తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు.
అయినప్పటికిని ఇంకా స్త్రీలను వ్యాపార ఆట బొమ్మలు గాను, సెక్స్ బొమ్మలు గాను ఎంతోమంది చూస్తున్నారు. వితంతువులను, ఒంటరి మహిళలను చిన్నచూపు చూస్తూ మానసిక మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. దేవుడు స్త్రీలకు ఒక ప్రత్యేకమైన గుణం ఇచ్చాడని తల్లిగా, చెల్లిగా, భార్యగా, కూతురుగా వారు ప్రేమ చూపించినట్టుగా ఇంకెవరూ చూపించలేరని, అందుకే ప్రతి కుటుంబంలోనూ కుమారులు లేకపోయినా కుమార్తెలు ఉండాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పురుష సమాజం స్త్రీల కు గౌరవం ఇచ్చిపుచ్చుకునేవారుగా ఉండాలని తీర్మానం చేసుకోవాలి. స్త్రీ సమాజం కూడా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొనకుండా సద్వినియోగం చేసుకుని లాగున తీర్మానం చేసుకోవాలి.

జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ చైర్మన్