– ఉచితంగా ఇసుక ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
– అక్రమంగా రవాణాచేస్తే వాహనాలను సీజ్ చేయడంతోపాటు పిడి యాక్ట్ సైతం అమలుచేస్తాం
– ముసునూరు మండలం వలసపల్లిలో ఇసుక రీచ్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి
ఏలూరు/ముసునూరు: ప్రజలకు పారదర్శకంగా ఎటువంటి అబ్బందులు లేకుండా ఉచిత ఇసుక సరఫరాకు నిర్ధేశించిన ఉచిత ఇసుక పాలసీకి ప్రభుత్వం కట్టుబడివుందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి స్పష్టం చేశారు.
గురువారం ముసునూరు మండలం వలసపల్లి, యల్లాపురం లలో ఉచిత ఇసుక రీచ్ లను ఆయన ప్రారంభించారు. తొలుత రాష్ట మంత్రి కొలుసు పార్ధసారధికి నూజివీడు ఆర్డిఓ యం. వాణి పూలమొక్కను అందజేసి స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు ఐదేళ్లుపాటు ఇసుకను ఇస్టారాజ్యంగా త్రవ్వేశారని, అంతటితో ఆగకుండా ఇసుక ధరలు పెంచి ప్రజలు, నిర్మాణదారులపై భారంమోపారన్నారు. అయితే ప్రజలకు ఇసుక కొనుగోలు బారం కాకూడదని, నిర్మాణ రంగానికి ఊతం ఇవ్వాలన్న ఆలోచనతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీమేరకు కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చామన్నారు.
అయితే జూలై మాసం నుంచి అధిక వర్షాలు , వరదలు మూలంగా రాష్ట్రంలో నదులన్నీ జలకళతో నిండిపోయాయన్నారు. దాంతో ఇసుక తీయడానికి ఆటంకాలు ఏర్పడి, కొంత అందుబాటులోకి రాకపోవడం జరిగిందన్నారు. ఇలా రకరకాల ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇప్పుడున్న రీచ్ లతోపాటు రాష్ట్రంలో మరో 108 కొత్త రీచ్ లకు ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. తద్వారా ఇసుక సరఫరా పెంచడానికి అవకాశం ఉంటుందన్నారు.
అంతేకాకుండా ఇసుక లభ్యతను మెరుగుపరచడానికి అక్రమ రవాణా నిరోధించి నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఉచిత ఇసుక విధానంలో ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. సీనరేజ్, డి.ఎం.ఎఫ్. మెరిట్ ఫీజులకు మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
దీనివలన టన్నుకు రూ. 88/-లు చెల్లించవలసివుండేదని దీనిని రద్దుచేయడం మూలంగా రూ. 265 కోట్లు ప్రభుత్వంపై భారమైనప్పటికీ రద్దుచేయడం జరిగిందన్నారు. ప్రజలు ఎవరైనా తమ గృహనిర్మాణాలకు అవసరమైన ఇసుకను సొంతంగా లోడింగ్ కోసం లేబరు,ట్రాక్టర్లు వినియోగించుకొని ఇసుకను తీసుకువెళ్లేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్నారు.
అయితే స్ధానికంగా ఎప్పటినుంచో ఇసుక లోడింగ్ పై జీవనోపాధి చేసుకుంటున్న కార్మికులు లోడింగ్ చార్జీల కోసం రూ. 400/-లు కోరడం జరిగిందని ఈ పనులపై ఆధారపడి ఉన్నారుకాబట్టి, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ స్ధాయిలో కార్మికులకు లోడింగ్ చార్జి ఎంతమేర తగ్గించకలిగే పరిస్ధితివుందో పరిశీలించడం జరుగుతుందన్నారు.
ట్రాక్టర్లు రవాణాచార్జి ఎక్కువ వసూలు చేస్తున్నారని తమ దృష్టికి రావడం జరిగిందన్నారు. దీనిపై గ్రామ దూరాన్నిబట్టి సబబు అయిన ధర వసూలు చేయాలని ఇష్టారాజ్యంగా వసూలు చేసేందుకు వీలులేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ట్రాక్టర్ల యజమానులు సమావేశమై ధర నిర్ణయించి వివరాలను సబ్ కలెక్టర్ కు అందజేస్తే వారు ఉప రవాణా కమీషనరు వారి పరిశీలనకు పంపడం జరుగుతుందన్నారు.
ఇసుక రీచ్ వద్ద విఆర్ఓ, సచివాలయ సిబ్బందిని పర్యవేక్షణకు ఉంచడం జరుగుతుందన్నారు. రీచ్ కు వచ్చే ట్రాక్టర్ నెంబరు, డ్రైవర్ పేరు, ఫోన్ నెంబరు, ఎవరికి ఇసుక రవాణా చేస్తున్న భవనయజమాని వివరాలు నమోదు చేయడంజరుగుతుందన్నారు. ఆ వివరాలను సంబంధిత గ్రామాల్లో సచివాలయ సిబ్బందిచే క్రాస్ చెక్ చేయడం జరుగుతుందన్నారు. అందులో ఏమైనా వ్యత్యాసాలు ఉంటే ఆ ట్రాక్టర్లను సీజ్ చేయడం జరుగుతుందన్నారు.
ట్రాక్టర్లో ఇసుక తీసుకువెళ్లి లారీల్లో లోడింగ్ చేయడం వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడినా, అధిక ధరకు ఇసుకను విక్రయించినా అటువంటి వారిపై పిడియాక్ట్ అమలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజలకు అవసరమైన ఇసుకను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
దీనిని ప్రభుత్వం ఒక భాద్యతగా తీసుకుందని ముఖ్యమంత్రి స్ధాయిలో ఉచిత ఇసుక విధానం పర్యవేక్షింపబడుచున్నదన్నారు. తొలుత ఇసుక లోడింగ్ చేస్తున్న కార్మికులతో లోడింగ్ చార్జీల విషయంపై రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి చర్చించారు.
కార్యక్రమంలో నూజివీడు ఆర్డివో ఎం. వాణి, తహశీల్దారు పురుషోత్తమ శర్మ, యంపిడివో జి. రాణి, స్ధానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.