– చంద్రబాబు ట్వీట్
రైతు సోదరులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. దేశానికి అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ ఉండేది. రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ రోజు రైతు పడే కష్టాలు చూస్తుంటే బాధగా ఉంది. దుక్కిదున్ని, విత్తనం నాటి, పంటను అమ్మి డబ్బు చేతకొచ్చే వరకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒకరోజు రుణాల కోసం, మరో రోజు విత్తనాల కోసం, ఇంకో రోజు ఎరువుల కోసం, చివరకు పంటను అమ్ముకోవడం కోసం, తరువాత ధాన్యం డబ్బుల కోసం రైతులు రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన దుస్థితి.
రాష్ట్రంలో ప్రభుత్వసాయం, పంటలకు కనీస మద్ధతు ధర లేక వ్యవసాయం సంక్షోభంలో ఉంది. దీంతో ఏపీలో 93 శాతం మంది రైతులు రుణభారంలో మునిగిపోయారు. రుణభారంలో రాష్ట్రాన్ని దేశంలో మొదటిస్థానంలోకి నెట్టారు. దీనివల్ల ఆత్మహత్యల్లో కౌలు రైతులు 2వ స్థానంలో, రైతులు ఆత్మహత్యల్లో మూడువ స్థానంలో ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం అమలుచేసిన రైతు రుణమాఫీని ఈ ప్రభుత్వం రద్దు చేసింది. వరి పంట వేయొద్దని ప్రభుత్వమే చెప్పడం రైతులను అవమానించడమే. కౌలు రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు. కనీస మద్ధతు ధరకు వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేసి వెంటనే నిధులు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి.