అసెంబ్లీలో ఘటన తెలుగు జాతి చరిత్రలో దుర్దినం

– డాక్టర్ ఎన్ తులసిరెడ్డి
విజయవాడ : అసెంబ్లీలో 19న జరిగిన సంఘటన తెలుగు జాతి చరిత్రలో ఒక దుర్దినం అని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అభివర్ణించారు. తెలుగు జాతి కీర్తిని విశ్వ వ్యాప్తం చేసిన తెలుగు తల్లి ముద్దు బిడ్డ నందమూరి తారక రామారావు ఆడ బిడ్డకు అసెంబ్లీ సాక్షిగా అవమానం జరగడం అత్యంత శోచనీయమని పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే అసహ్యం వేస్తోంది అని, జుగుప్స కలుగుతోందని వ్యాఖ్యానించారు. తరిమెల నాగి రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి లాంటి సంస్కార వంతులు, ఉద్దండులు ఉండిన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నేడు సంస్కార హీనులకు వేదిక కావడం దురదృష్ట కరమని విమర్శించారు.
కౌరవ సభలో సంస్కార హీనంగా ప్రవర్తించిన దుర్యోధన, దుశ్శాసనులకు ఏ గతి పట్టిందో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని హితవు పలికారు. ధర్మ సంస్థాపనార్ధయ సంభవామి యుగే యుగే అని భగవద్గీత లో కృష్ణ భగవానుడు పలికిన పలుకులను కు సంస్కారులు గుర్తుకు తెచ్చు కోవాలన్నారు. స్త్రీ జాతిని అవమానించిన వారు దుష్ఫలితాలు అనుభవించక తప్పదని హెచ్చరించారు.