– ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక అంగన్వాడీ కార్యకర్తలు మృతి బాధాకరం
– మృతుల కుటుంబసభ్యులకు ప్రభుత్వం రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వాలి
– తెలుగునాడు అంగన్వాడీ-డ్వాక్రా సాధికార సంఘం అధ్యక్షురాలు ఆచంట సునీత
అంగన్వాడీల జీవితాలతో జగన్ రెడ్డ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. మూడున్నరేళ్లుగా వారికి సకాలంలో జీతాలు ఇవ్వని ప్రభుత్వం వారికి టార్గెట్లు పెడుతూ , పని భారం మోపి తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ వారి ప్రాణాల మీదకు తేవడం ఎంతవరకు న్యాయం? తనిఖీల పేరుతో ఉన్నతాధికారులు వేధించడంతో మానసిక ఒత్తిడికి గురై తూర్పుగోదావరి జిల్లా ,అనంతపురం జిల్లాల్లో ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలు మృతి చెందారు.
అవి ప్రభుత్వ హత్యలే. రికార్డుల తనిఖీల పేరుతో అధికారులు హడావుడి చేయడంతో తూర్పుగోదావరి జిల్లా గాడాలలో అంగన్వాడీ కార్యక్తర్త సుబ్బలక్ష్మి ఆకస్మిక మృతి చెందింది. అనాధలైన ఆమె పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారు? అనంతపురం జిల్లా రాయదుర్గంలో చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ ఎల్లమ్మ వేధింపులు తట్టుకోలేక అంగన్వాడీ కార్యకర్త లక్ష్మీదేవి ఉరివేసుకుని చనిపోయింది.
కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లడానికి శెలవు అడిగిందని లక్ష్మీదేవిని అధికారిణి వేధించడం ఎంతవరకు సమంజం? పైగా ఆమెపై కక్ష కట్టి రోజువారీ విధులు సరిగా చేయడంలేదంటూ వేధింపులకు గురిచేయడం దుర్మార్గం. లక్ష్మీదేవి మృతికి తానే కారణమైనప్పటికీ ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించనూ లేదు.
ప్రభుత్వ అండ చూసుకునే ఉన్నతాధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ కార్యకర్తలకు ఒక్క నెలా జీతాలు సరిగా ఇవ్వకపోగా వారితో అడ్డమైనా చాకిరీలు చేయిస్తున్నారు. ఆదాయ పరిమితి నిబంధనలు పెట్టి వారికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. అంగన్వాడీ సెంటర్ల కరెంటు బిల్లులు కట్టకుండా సిబ్బందిపై భారం మోపారు. ఇవన్నీ చాలవన్నట్టు ఉన్నతాధికారులు వేధింపులకు గురిచేయడం ఎంతవరకు సమంజసం? సిబ్బందిని వేధింపులకు గురిచేసి వారి మృతికి కారణమైన ఉన్నతాధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మృతుల కుటుంబసభ్యులకు రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలి.