-
జనసేన ఇలాకాలో జనాగ్రహం
-
పంచాయితీ అనుమతి లేకుండానే పొలాల మధ్య రోడ్డు, సొంత రైల్వేలైన్
-
అయినా యాజమాన్యంపై చర్యలు తీసుకోని అధికారులు
-
భూముల కొనుగోలులో రైతులను నిండాముంచిన చెట్టినాడ్ కంపెనీ
-
ఎమ్మెల్యే యరపతినేని వద్దకు రైతుల పరుగులు
-
అనుమతి ఒక చోట.. క్రషర్ ఇంకో చోట
-
పంచాయితీ అనుమతులు లేకున్నా అడ్డగోలు నిర్మాణాలు
-
క్రషర్‌తో 300 ఎకరాలకు పెను ముప్పు
-
పంటలు నాశనమవుతున్నా పట్టించుకోని పీసీబీ
-
కంపెనీతో పీసీబీ అధికారుల కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు
-
అటకెక్కిన ప్రజాభిప్రాయ సేకరణ హామీలు
-
బ్లాస్టింగ్‌లతో బీటలువారుతున్న బడుగుల ఇళ్లు
-
రెండు కిలోమీటర్లు విస్తరిస్తున్న దుమ్ము, ధూళి
-
అయినా నిద్రపోతున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు
-
‘తెల్ల’బోతున్న పచ్చటి పంటపొలాలు
-
మిర్చిరైతు కళ్లలో ‘చెట్టినాడు’ కారం
-
పరిహారం కోసం కోర్టుకెక్కుతున్న రైతన్న
-
ఉద్యోగాలివ్వకుండా ఎగ్గొడుతున్న చెట్టినార్
-
దేవాదయ, నీటిపారుదల శాఖ భూముల ఆక్రమణ
-
దేవాదయశాఖకు చెందిన ఐదు ఎకరాల్లో అక్రమ నిర్మాణం
-
కలెక్టర్ ఎదుటా తేలని పంచాయతీ
-
కమిటీ వేసిన పల్నాడు కలెక్టర్
-
చెట్టినాడును సీజ్ చేయాలంటూ రోడ్డెక్కనున్న రైతన్న
-
ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్న జనసేన, టీడీపీ కార్యకర్తలు
-
ఆ రెండు గ్రామాల్లో జనసేనదే హవా
-
‘చెట్టినాడు’కు అధికారుల మద్దతుపై ఆగ్రహం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆ సిమెంట్ కంపెనీ ఇప్పుడు రెండు గ్రామాలను కబళిస్తోంది. అది విడుదల చేసే దుమ్ము, ధూళి.. పేలుళ్లతో పచ్చటి పంట పొలాలే కాదు. బడుగుల బతుకులూ ఛిద్రమవుతున్నాయి. దాదాపు 300 ఎకరాలు కాలుష్యపు కోరలకు బలవుతున్నాయి. 5 వేల మంది గ్రామస్థులు, ఇప్పుడు కాలుష్యపు కోరలో చిక్కుకున్న విషాదం. అక్కడ పచ్చటి పంటపొలాలు రంగుమారి, ‘తెల్ల’బోతున్నాయి. ఫలితంగా మిర్చిరైతు కంట కన్నీరు! ఆ రకంగా మిర్చిరైతు కళ్లలో కారం కొడుతున్నా.. సదరు కంపెనీకి ముకుతాడు వేసే దమ్ము లేని పీసీబీ నిస్సహాయ స్ధితి.
ఆ కంపెనీ పేలుళ్లకు.. సర్కారు ఇళ్లలో తలదాచుకుంటున్న బడుగుల ఇళ్లు బీటలు వారుతున్నాయి. ఎప్పుడు, ఏ రాత్రి తమ బతుకులు కూలిపోతాయో తెలియని ఆందోళన. వీటిపై చర్యల కొరడా ఝళిపించాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, చర్యల కొరడాను అటకెక్కించిన అవినీతి పర్వం. తీసుకున్న అనుమతి ఒక పంచాయితీ అయితే, క్రషర్‌తో గ్రామప్రజలను కబళిస్తున్న నిర్మాణాలు మరో పంచాయితీ పరిథిలోనిది. ఈ అతితెలివిని కనిపెట్టలేని రెవిన్యూ పనిమంతుల అసమర్థతే ఆ కంపెనీకి శ్రీరామరక్ష.
పీసీబీతోపాటు.. పరిశ్రమ, కార్మిక శాఖ, రెవిన్యూ, నీటిపారుదల, దేవదాయ శాఖలు కూడా, ‘గుప్పెడు నిద్రమాత్రలు మింగి’ సుఖనిద్ర పోతున్న నిర్లక్ష్యం. తమ భూములు ఆక్రమించి, ఐదు ఎకరాల్లో ఆఫీసు భవనాలు నిర్మించినా దేవాదయ శాఖ దేవుడిపై భారం వేసి తప్పించుకున్న వైనం. ఏడేళ్ల క్రితం ఫ్యాక్టరీ నిర్మించినప్పుడు గ్రామస్థులకు.. ఉద్యోగాలు-ఉపాథి కల్పిస్తామన్న యాజమాన్య హామీలు చెట్టెక్కిన నిర్లక్ష్యం. అయినా ఇదేమిటని అడిగే దిక్కులేని దుస్థితి.
దానితో రైతులు రోడ్డెక్కక తప్పని అనివార్య పరిస్థితి. తమకు నష్టపరిహారం ఇవ్వాలంటూ కోర్టుకెక్కుతున్న వైనం. ఇవన్నీ అటు తిరిగి కూటమి ప్రభుత్వంపై ,జనసేన-టీడీపీ కార్యకర్తనే తిరగబడేందుకు కారణమవుతున్న వైచిత్రి. కారణం.. ఆ రెండు గ్రామాలు జనసేనకు పట్టున్నవే.
విచిత్రంగా.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖ కూడా జనసేనాధిపతి పవన్ అధీనంలోనిదే. అయినా చెట్టినాడ్ సిమెంట్స్ ఎవరినీ లెక్కచేయని వైచిత్రి. ఈ ధిక్కారపర్వంపై చర్యలు తీసుకోవాలంటూ.. జనసేన- టీడీపీ ఎమ్మెల్యే యరపతినేనిపై రైతులు ఒత్తిళ్లు తెస్తున్న పరిస్థితి. అయినా సరే ఆ యాజమాన్యంపై చర్యలు తీసుకోలేని విషాద వైఫల్యం. ఇదీ..పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో, రెండు రెవిన్యూ గ్రామాల మధ్య నిర్మించిన చెట్టినాడ్ సిమెంట్ కంపెనీ ధిక్కార సిత్రాలు.
అది గురజాల నియోజకవర్గంలో కేసానిపల్లి, తక్కెళ్లపాడు రెవిన్యూ గ్రామాల మధ్య నిర్మించిన చెట్టినాడ్ సిమెంట్ ప్యాక్టరీ. దాదాపు 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో కట్టిన ఫ్యాక్టరీ. అది చాలదన్నట్లు దేవదాయ, నీటిపారుదల శాఖల భూములను కూడా ఆక్రమించింది. ప్రస్తుతం ఆ కంపెనీ ఆఫీసు భవనం దేవదాయ శాఖదే అని గ్రామస్థుల ఆరోపణ.
సిమెంట్ రవాణా కోసం, కంపెనీ రెండు గ్రామాల పొలాల మధ్య నుంచి రైల్వే వ్యాగన్ లైన్ కూడా.. తుమ్మలచెరువు స్టేషన్ నుంచి తీసుకుంది. ఇది అన్ని చోట్లా జరిగేదే. కానీ అందుకు అనుమతి ఉందా అంటే లేదు. రైల్వే వ్యాగన్ లైన్, రోడ్డు ఏర్పాటుచేసుకోవాలంటే ఆ గ్రామ పంచాయతీ అనుమతి తప్పనిసరి. ఎందుకంటే అవి ఆ గ్రామాల్లోని పొలాల మధ్య నుంచి వెళ్లాలి కాబట్టి. అయితే తెలివైన చెట్టినాడ్ సిమెంట్ కంపెనీ.. పెదగార్లపాడు పంచాయతీలో అనుమతి తీసుకుని, తక్కెళ్లపాడులో క్రషర్ పెట్టి, అక్కడి నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
పోనీ ఆ మేరకు పంచాయితీ నుంచి రివైజ్ అలైన్‌మెంట్, పర్మిషన్లు తీసుకుందా అంటే అదీ లేదు. అంతా అడ్డగోలు ధిక్కారమే. నిబంధనలు అతిక్రమించిన చెట్టినాడ్ కంపెనీని, మామాలుగా అయితే సీజ్ చేయాలి. కానీ పొల్యూషన్ కంట్రోల్‌బోర్డుతో సహా, అన్ని శాఖలో ఆ కంపెనీకి గులాములయి, సలాము చేస్తున్న దుస్థితి.
చెట్టినాడ్ ప్యాక్టరీ నిబంధ నలకు విరుద్ధంగా నిర్మించిన క్రషర్ వల్ల, దాదాపు 300 ఎకరాలు నిర్వీర్యమవుతున్న విషాదం. దాదాపు 5 వేల మంది రైతుల పరిస్థితి ప్రమాదంలో పడినప్పటికీ, ప్రభుత్వం పట్టించుకోని నిర్లక్ష్యం. నిజానికి ఏడేళ్ల క్రితం చెట్టినాడ్‌ను స్ధాపించిన సమయంలో.. ప్రతి గ్రామానికి సంబంధించిన నిరుద్యోగులకు ఉద్యోగ-ఉపాథి కల్పిస్తామని, సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తామని ప్రజాభిప్రాయ సేకర ణలో హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ ఇంకా రెండు గ్రామాలకు సంబంధించి 20 మందికి ఉద్యోగాలివ్వకుండా తిప్పుతోందన్నది ప్రధాన ఆరోపణ.
ఇక ఈ సిమెంట్ కంపెనీ వె లువరించే దుమ్ము, ధూళి దాదాపు 2 కిలోమీటర్ల మేర విస్తరిస్తోంది. ఫలితంగా ఆ రెండు కిలోమీటర్లలో, దాదాపు 300 ఎకరాల్లో మిర్చి వేసిన రైతుల పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఎకరానికి 2 లక్షలు ఖర్చు పెట్టి వేసిన మిర్చి పంటకు ఇప్పటికే గిరాకీ లేదు. దానికితోడు ఈ కాలుష్యపు కాటు అదనపు పోటుగా మారింది.
ఈ వ్యవహారం కాలుష్యపు కాటుతోనే కాదు. అనుమతి లేకుండా చేస్తున్న క్రషర్ పేలుళ్లలో, పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ గృహాలు బీటలు వారుతున్న ఆందోళనకర పరిస్థితి. క్రషర్ వల్ల తమ ఇళ్ల గోడలు, పై కప్పులు పగుళ్లు వస్తున్నాయని స్థానిక ప్రజలు మొత్తుకుంటున్నా, ఇప్పటివరకూ అక్కడకు తనిఖీలకు వెళ్లిన అధికారి ఒక్కరూ లేకపోవడమే ఆశ్చర్యం.
కాగా చెట్టినాడ్ సిమెంట్స్ నిర్వాకం వల్ల దెబ్బతింటున్న తమ పొలాలకు నష్టపరిహారం ఇప్పించాలంటూ, రైతులు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. పీసీబీ అధికారుల అవినీతి వల్ల, తమకు న్యాయం జరగడం లేదంటున్నారు. చెట్టినాడ్ ఫ్యాక్టరీని సీజ్ చేయాలన్నది వారి ప్రధాన డిమాండ్. తాజాగా పల్నాడు జిల్లా కలెక్టర్ బాధితులు, కంపెనీ ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. అయితే అది ఎటూ తేలకపోలకపోవడంతో కలెక్టర్ ఒక కమిటీ వేసి, పదిరోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశారు.
చెట్టినాడుతో గ్రామాల్లో చిచ్చు
పల్నాడు జిల్లాలోని దాచేపల్లి మండలం, పెదగార్లపాడు , తక్కెల్లపాడు గ్రామాలలో.. పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన జీవనం. కానీ, ఈ ప్రశాంతతను చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ రాకతో చెదిరిపోయింది.
ఏడేళ్ల క్రితం చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే ముందు, యాజమాన్యం స్థానిక రైతులకు ఎన్నో వాగ్దానం చేసింది. పొలాలు కొన్న వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, కాలుష్య రహిత వాతావరణం, పొలాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని హామీ ఇచ్చింది. కానీ, వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి.
ఫ్యాక్టరీ నుండి వెలువడే దుమ్ము, ధూళి సుమారు 200 ఎకరాల పొలాలను కమ్మేసింది. మిర్చి, మొక్కజొన్న, కంది పంటలు పండించే రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటలపై దుమ్ము పేరుకుపోవడంతో, తరచూ పురుగు మందులు చల్లాల్సి వస్తోంది. మార్కెట్లో పంటలకు సరైన ధర రావడం లేదు. రైతుల పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదు.
దేవాదాయ శాఖకు చెందిన 32 ఎకరాల భూమి కూడా కాలుష్యం కారణంగా కౌలుకు తీసుకునేవారు లేక, బుదవాడ శ్రీ సీతారామ స్వామి గుడి ఆదాయం కోల్పోయింది. గుడి నిర్వహణ, అన్నదానం నిలిచిపోయాయి.
ఫ్యాక్టరీ సమీపంలోని ప్రజలు, వ్యవసాయ కూలీలు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. 2019 నుండి లైమ్ స్టోన్ క్రషర్ కు అనుమతులు లేకుండా, కాలుష్య నివారణ చర్యలు చేపట్టకుండా ఫ్యాక్టరీని నడపడం వల్లే ఈ దుస్థితి దాపురించింది.
అంతేకాదు, ఫ్యాక్టరీ యాజమాన్యం వైసీపీ నాయకులతో కలిసి 8 ఎకరాల రజకుల భూమిని దొంగ రిజిస్ట్రేషన్లతో స్వాధీనం చేసుకుంది. ఇరిగేషన్ భూమిని కూడా ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టింది. పొలాలు ఇచ్చిన రైతులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, వైసీపీ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఉద్యోగాలు ఇప్పించారని ఆరోపణలు ఉన్నాయి.
శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ ఎకరానికి 20 లక్షలు చెల్లిస్తుంటే, చెట్టినాడు యాజమాన్యం మాత్రం 16 లక్షలు మాత్రమే చెల్లించి రైతులను మోసం చేస్తోంది. అంబుజా సిమెంట్ మైనింగ్ ప్రాంతంలోని 66 ఎకరాల భూమిని అక్రమంగా కొనుగోలు చేసింది. ఆ భూమిని తిరిగి అంబుజా సిమెంట్స్ కు అమ్మమని గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు కోరినా, చెట్టినాడు యాజమాన్యం స్పందించలేదు.
శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీకి రోడ్డు, రైలు మార్గాలు ఏర్పాటు చేయడానికి చెట్టినాడు భూముల గుండా వెళ్లాలని కోరినా, చెట్టినాడు యాజమాన్యం సహకరించడం లేదు.
ఈ విధంగా, చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ తన స్వార్థం కోసం స్థానిక రైతులను, ప్రజలను, ఇతర కంపెనీలను ఇబ్బంది పెడుతోంది.
గ్రామానికి ప్యాక్టరీలు వస్తే మా పిల్లలకు ఉద్యోగాలొ స్తాయి.. మా జీవితాల్లోకి వెలుగులు వస్తాయి.. చదువుకున్న వారికి ఉద్యోగాలు, కాయ కష్టం చేసే వారికి పనులు లభిస్తాయని ప్యాక్టరీలకు భూములు ఇచ్చామని పెదగార్లపాడు గ్రామంలోని బీసీ కాలనీ వాసులు చెబుతున్నారు.
ఫ్యాక్టరీ నిర్మాణం చేపడితే గ్రామాల్లో తాగునీరు, రహ దారుల నిర్మాణం, పాఠశాలల అభివృద్ధి జరుగుతుందాని చెబితే విని సంతోషించాం అని అంటున్నారు. ప్యాక్టరీ నిర్మాణం పూర్తిచేసుకొని ఉత్పత్తులు ప్రారం భించిన తర్వాత గ్రామానికి సమీపంలో మైనింగ్ క్వారీలో జరుగుతున్న భారీ బ్లాస్టింగ్ గోడలు పగు ళ్లు ఏర్పడి నివాస గృహాలు దెబ్బతింటున్నాయనీ, గ్రామ అభివృద్ధి జాడేమో తెలియదు కాని ఇళ్లు ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఈ కాలనీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 200లకు పైగా నిరుపేద కుటుంబాల వారు ప్రభుత్వం కట్టించిన ఇళ్లల్లో నివాసం ఉంటూ వ్యవ సాయ, కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తుం టారు. ఐదు సంవత్సరాల క్రితం గ్రామ సమీపంలో చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించారు. ఉత్పత్తులు కూడా ప్రారంభించారు. గ్రామానికి దగ్గరలో మైనింగ్ క్వారీలో భారీ బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఇళ్లు కదిలి పోతున్నాయి. భూగర్భజలాలు రంగు, రుచి మారిపోతున్నాయి.
బాసింగ్ల వలన తమకు జరుగు తున్న నష్టాన్నిగురించి తెలియజేసేందుకు పలుమార్లు ప్రజా ప్రతినిధులు, అధికారులను కలిసి విన్నవించాం. ఫ్యాక్టరీ యాజమాన్యానికి కూడా వివరించాం. కానీ తమ గోడు పట్టించుకొనే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోకపోతే కాలనీని ఖాళీ చేసే పరిస్థితి రావొచ్చని అంటున్నారు. ప్యాక్టరీ యాజ మాన్యం మాత్రం కాలనీవాసుల సమస్యల పట్ల ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటం, తమను మరింత బాధకు గురిచేస్తోందని కాలనీ చెందిన పలువురుఆవేదన చెందుతున్నారు.
రైతుల వైపే ఉంటా: యరపతినేని
కాగా చెట్టినాడు సిమెంట్స్ వ్యవహారంపై గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్పందన కోరగా.. తాను రైతుల వైపే ఉంటానని స్పష్టం చేశారు. చెట్టినాడు యాజమాన్యం తమను మోసం చేసిందన్న రైతుల ఫిర్యాదులను, తాను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానన్నారు. మా ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహిస్తుందోదని, అంతమాత్రాన రైతులకు అన్యాయం చేయమని చెప్పలేదని వ్యాఖ్యానించారు. ఆ రెండు గ్రామాల్లోని జనసేన కార్యకర్తలు ఇప్పటికే తనకు ఫిర్యాదు చేశారని, రైతులను మోసం చేస్తున్న చెట్టినాడ్‌ను సీజ్ చేయాలని తనకు ఫిర్యాదు చేశారని వివరించారు.
ఏటా నష్టపోతున్నాము
సిమెంట్ కర్మాగారం పక్కనే మిర్చి పంట వేశాకోయడానికి ఎవరూ రావడం లేదు. వచ్చిన వాళ్ళు కూడా సగం కోసి వెళ్లిపోతున్నారు. రోజుకు రూ.500 కూలి ఇస్తామన్నా రావడం లేదు. దుమ్ము దూళి పడి కాయలు పనికిరాకుండా పోతున్నాయి. మార్కెట్లో మిర్చి రూ.పది వేలు ఉంటే.. ఈ దుమ్ము కాయలకు రూ.నాలుగు వేలే అడుగుతున్నారు. ఏటా తీవ్రంగా నష్టపోతున్నాం. – రైతు సైదులు తక్కెళ్లపాడు
మా ఇళ్ళు దెబ్బతింటున్నాయి
ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఇళ్ళు నిర్మించు కున్నాం. ఫ్యాక్టరీ వారు జరిపే భారీ బ్లాస్టింగ్తో మా ఇళ్లకు పగుళ్ళు ఏర్పడుతున్నాయి. ఎప్పుడు కూలి పోతాయోనని భయాందోళనలకు గురవుతున్నాం. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – పటాన్ హసీనా పెద్దగార్లపాడు కాలనీ వాసి
ప్రభుత్వ అధికారులు, పర్యావరణ శాఖ, దేవాదాయ శాఖ వెంటనే స్పందించి, చెట్టినాడు ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.