Suryaa.co.in

Telangana

పల్లెల్లో గ్రామపంచాయతీల నిర్వహణ పూర్తిగా పడకేసింది

  • కనీసం వీధిదీపాలు పెట్టే.. బ్లీచింగ్ పౌడర్ కొనే పరిస్థితి లేదు

  • గిరిజన గ్రామాలకు కనీసం రోడ్ల నిర్మాణం కల్పించడం లేదు

  • 5 నెలలుగా ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు జీతాలు చెల్లించడం లేదు

  • సీతక్క అభివృద్ధి నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారు

  • బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు

హైదరాబాద్: ఇటీవలే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. కానీ, రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తెలంగాణలో ఆదివాసీలతో పాటు గిరిజన గ్రామాల్లో కనీస సదుపాయాలు లేకుండా పరిస్థితి దయనీయంగా తయారయ్యింది.

స్వయాన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బండగూడ గ్రామంలో కడుపులో కవలలతో ఓ గర్భిణి పురిటి నొప్పులతో 2 కిలోమీటర్ల దూరం నచిడి యాతన అనుభవించింది. గ్రామానికి రహదారి లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు గ్రామం నుంచి కిలోమీటర్ల దూరం నడిచి వాగు వద్దనే ప్రసవించగా శిశువు మృతి చెందింది.

ఆదివాసీ మహిళ ప్రసవ వేదన పడుతూ పురిటినొప్పులతో వాగు వద్దే ప్రసవించడం.. శిశువు మృతి చెందిన ఘటన బాధాకరం. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే. సిర్పూర్ (టి) నియోజకవర్గంలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో లింబుగూడ గ్రామంలో నిండు గర్భిణి చనిపోయింది.

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోణంపేట గ్రామానికి చెందిన జస్వంత్ అనే బాలుడు అనారోగ్యానికి గురవ్వడంతో ఆస్పత్రికి ఎడ్లబండిపై తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.

రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం లేకుండా వ్యవహరిస్తోంది. గిరిజన గ్రామాలకు కనీసం రోడ్ల నిర్మాణం కల్పించడం లేదు. రాష్ట్రంలో పల్లెల్లో గ్రామపంచాయతీల నిర్వహణ పూర్తిగా పడకేసింది. కనీసం వీధిదీపాలు పెట్టే.. బ్లీచింగ్ పౌడర్ కొనే పరిస్థితి లేదు.సర్పంచుల పదవీకాలం ముగియడంతో పంచాయతీ కార్యదర్శులతో పాలన నడిపిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గత 5 నెలలుగా ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు జీతాలు చెల్లించడం లేదు. గత ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన రూ. 500 కోట్ల రూపాయలు నిధులు గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా దారిమళ్లించింది. రాష్ట్ర ప్రభుత్వం పాలన వ్యవహారాలను చక్కదిద్దే ఆలోచనలో లేదు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క అభివృద్ధి నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పాలనతో గ్రామపంచాయతీలను, మున్సిపాలిటీలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. రేవంత్ రెడ్డి కేవలం నారాయపేట, జిల్లా, వికారాబాద్ జిల్లాలకు, కొడంగల్ కు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు.కొడంగల్ తో పాటు కొన్ని మండలాలకు మాత్రమే విద్యావాలంటీర్ల నియామకాన్ని జరుపుతామని ప్రకటించారు.

రాష్ట్రంలో అనేక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గిరిజన ప్రాంతాల్లోనూ విద్యావాలంటీర్ల నియామకాలు చేపట్టాలి. కాంగ్రెస్ సర్కారు ఇంకా పాలనపై పట్టు సాధించలేదు. వ్యవస్థ గాడితప్పింది. రాష్ట్రంలో అసమర్థ పాలనతో కాలం వెల్లదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పక తప్పదు.

LEAVE A RESPONSE