పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఘనవిజయానికి ప్రతీక నూతన సన్సద్‌ భవన్‌!

ఎంపీ విజయసాయిరెడ్డి

భారత పార్లమెంటు నూతన భవనం మే 28న ప్రారంభమవుతోంది. 1927లో నిర్మించిన ప్రస్తుత సన్సద్‌ భవన్‌ కు సమీపంలోని సెంట్రల్‌ విస్తాలో నిర్మించిన కొత్త భవనంలో పార్లమెంటు ఉభయసభలు రాజ్యసభ, లోక్‌ సభ కార్యకలాపాలు ఇక కొనసాగుతాయి. ఈ సందర్భంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటు భవనాల చరిత్ర క్లుప్తంగా తెలుసుకుందాం. ఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు పుట్టినిల్లుగా ఇంగ్లండ్‌ ను పరిగణిస్తారు.

అయితే, బ్రిటిష్‌ పార్లమెంటును పొరపాటున ఇప్పటికీ చాలా మంది ప్రపంచంలోని పార్లమెంట్లకు మాతృక అని భావిస్తారు. అసలు విషయం ఏమంటే–ప్రఖ్యాత బ్రిటిష్‌ రాజకీయవేత్త, సంస్కర్త జాన్‌ బ్రయిట్‌ 1865 జనవరి 18న బర్మింగ్‌ హామ్‌ నగరంలో ప్రసంగిస్తూ ఇంగ్లండ్‌ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ‘ఇంగ్లండ్‌ ఈజ్‌ ద మదర్‌ ఆఫ్‌ పార్లమెంట్స్‌’ అని అభివర్ణించారు. ప్రాతినిధ్య పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంచుకుని, ఆచరణలో అనుసరిస్తున్న అన్ని దేశాలకు మోడల్‌ ఇంగ్లండ్‌ అనే అర్థంలో జాన్‌ బ్రయిట్‌ అలా మాట్లాడారు.

కాని, యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ రాజధాని లండన్‌ లోని వెస్ట్‌ మినిస్టర్‌ అబి ప్రాంతంలో ఉన్న బ్రిటిష్‌ పార్లమెంటు భవనాన్ని (అంటే అందులో సమావేశమవుతూ పనిచేసే పార్లమెంటు ఉభయ సభలు–హౌస్‌ ఆఫ కామన్స్, హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌) అన్ని దేశాల పార్లమెంట్లకు మాతృక అనే భావనతో కొందరు బ్రయిట్‌ అన్న మాటలను వాడుతుంటారు. ఈ సందర్భంగా బ్రిటిష్‌ పార్లమెంటు చరిత్రను ఒకసారి గుర్తుచేసుకుందాం. 1707–1800 మధ్య లండన్‌ లోని ఈ పార్లమెంటు గ్రేట్‌ బ్రిటన్‌ పార్లమెంటుగా పనిచేసింది.

1801 జనవరి 1 నుంచి పార్లమెంట్‌ ఆఫ్‌ యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ గా నడుస్తోంది. వెస్ట్‌ మినిస్టర్‌ ఆబీ ప్రాంతంలో ఉన్న భవనాల్లో బ్రిటిష్‌ పార్లమెంటు ఉభయసభలు సమావేశమవుతుండడం వల్ల బ్రిటిష్‌ తరహా పార్లమెంటరీ వ్యవస్థను వెస్ట్‌ మినిస్టర్‌ మోడల్‌ అని కూడా పిలుస్తారు. గతంలో రెండుసార్లు అగ్నిప్రమాదాల్లో పార్లమెంటు భవనాలు ధ్వంసం కావడం, మళ్లీ నిర్మించడం జరిగింది. లండన్‌ థేమ్స్‌ (టెమ్జ్‌) నది తీరాన ఉన్న పార్లమెంటు భవనాలను ఇప్పుడు మళ్లీ ఆధునికీకరించే పనిచేపడుతున్నారు. 2025లో ప్రారంభమయ్యే నవీకరణ ఆరేళ్ల పాటు సాగుతుందని అంచనా.

ప్రారంభం తర్వాత 100 ఏళ్లు నిండక ముందే కొత్త భవనంలోకి భారత పార్లమెంటు
మారిన పరిస్థితులు, సాంకేతికత, పెరుగుతున్న అవసరాల దృష్ట్యా భారత పార్లమెంటు ఉభయ సభలకు కొత్త భవనం అవసరం ఏర్పడింది. 1927లో నిర్మాణం పూర్తయి నాటి ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ కార్యకలాపాలతో ప్రారంభమైన ప్రస్తుత సన్సద్‌ భవన్‌ ను అలాగే ఉంచి దగ్గర్లో కొత్త పార్లమెంటు భవనం నిర్మించడం, ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా కొత్త సన్సద్‌ భవన్‌ ప్రారంభించడం నేడు చర్చనీయాంశాలయ్యాయి.

భారత రాజ్యాంగ రచనకు వేదికగా ఉపకరించిన పార్లమెంటు భవనంలో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్లమెంటు ఉభయసభల నిర్వహణకు వీలు కల్పించారు. 1952 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకూ 15 మంది ప్రధానమంత్రులు (రెండుసార్లు 13 రోజులు చొప్పున ప్రధానిగా ఉన్న జీఎల్‌ నందాతో కలిపి), 15 మంది రాష్ట్రపతులు ఈ పార్లమెంటు భవనంలో తమ విధుల్లో భాగంగా ప్రసంగించారు. 14 మంది ఉపరాష్ట్రపతులు (సర్వేపల్లి రాధాకృష్ణన్‌ నుంచి జగదీప్‌ ధన్‌ఖడ్‌ వరకూ) రాజ్యసభ అధ్యక్షుల హోదాలో ఎగువసభ సమావేశాలు నిర్వహించారు.

అలాగే, 17 మంది స్పీకర్ల (జీవీ మావలంకర్‌ నుంచి ఓం బిర్లా వరకూ) ఆధ్వర్యంలో లోక్‌ సభ సమావేశాలను ఈ భవనంలోనే జరిపించారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న పాత సన్సద్‌ భవన్‌ నుంచి ఇక ఉభయ సభల సమావేశాలు, కార్యకలాపాలు కొత్త భవనంలోకి మారడం నిజంగా 21వ శతాబ్దం మొదటి పాతికేళ్లలో గొప్ప పరిణామం.

భారత రాజ్యాంగం 73 ఏళ్ల క్రితం అమలులోకి వచ్చినప్పుడు అనేక మంది ఇతర దేశాల మేధావుల వ్యతిరేక అంచనాలకు భిన్నంగా ఇండియాలో ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కాలపరీక్షను తట్టుకుని నిలిచింది. విజయవంతమైంది. ఈ విజయానికి నూతన సన్సద్‌ భవన్‌ ప్రతీకగా నిలుస్తుంది.

Leave a Reply