నాసిరకం మద్యం మొత్తం వైసీపీ నేతల కంపెనీల్లో తయారవుతోంది

– ఛాంపియన్, గ్రీన్ ఛాయిస్.. ఛాంపియన్, రాయల్ సింహా, సెలబ్రిటీ, ఓల్డ్ టైమర్ బ్రాండ్ లో ఫెరోగిలాల్ అనే హానికర పదార్థం
– ఎం.ఎన్ సీ కంపెనీలైతే కమీషన్లు రావని ఆ బ్రాండ్లను రాష్ట్రంలో లేకుండా చేశారు
– ముఖ్యమంత్రి తన దోపిడీ కోసమే రాష్ట్రంలో ఊరూపేరులేని కల్తీమద్యం, కల్తీసారా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్నాడు
– ఏటా రూ.5వేల కోట్ల సంపాదన కోసం వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కల్తీ మద్యానికి బలిచేస్తోంది
– మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

కల్తీమద్యం, కల్తీసారా వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతిని క్రమేణా మరణాల సంఖ్య పెరుగుతోందని, వెలుగులోకి వచ్చిన మరణాలు కొన్నేనని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఊరూపేరూ లేని కల్తీబ్లాండ్ల మద్యం అమ్మకాలు పెరిగిపోయాయని, ప్రముఖ కంపెనీ బ్రాండ్ల మద్యం అమ్మకాలు రాష్ట్రంలో ఎక్కడా జరగడం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

దశలవారీగా మద్యపాననిషేధం అమలు చేస్తామని చెప్పినవారే, దశలవారీగా నాసిరకం మద్యం విక్రయాలు పెంచుకుంటూ పోతున్నారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం స్లోపాయిజన్ (విషపూరితమైన మద్యం) అమ్మకాలు సాగిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వమే మద్యం విక్రయదారుగా మారిపోయింది. మెక్ డోవెల్, ఓల్డ్ మంక్, ఓల్డ్ టావ్రెన్, కింగ్ ఫిషర్, బడ్వైజర్ లాంటి బ్రాండ్లతో పాటు మల్టీనేషనల్ బ్రాండ్ల మద్యం రాష్ట్రంలో దొరకడంలేదు.

గతంలో ఒక చట్టం ఉంది. ఎవరైనా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలనుంచి వచ్చేటప్పుడు మూడు బాటిళ్లు తెచ్చుకోవడానికి అవకాశముండేది. కానీ ఈ ప్రభుత్వం దాన్ని తొలగించి, అలా తీసుకొచ్చే వారిపై ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం కేసులు పెడుతోంది. మద్యం దుకాణాల్లో కార్డులు, పేటీఎమ్. గూగుల్ పే వంటి వాటిని అనుమతించడంలేదు. రసీదులు కూడా ఇవ్వడం లేదు. కేవలం నగదు చెల్లింపులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు.

జంగారెడ్డిగూడెంలో మరణించిన 28 మంది కాకుండా, రాష్ట్రంలో అమ్ముతున్న స్లోపాయిజన్ మద్యం వల్ల భవిష్యత్ లో ఇంకా ఎక్కువ ఘోరాలు చూడాల్సి వస్తుంది. ఎంపీ రఘురామకృష్ణంరాజు రాష్ట్రంలో అమ్ముతున్న 5 బ్రాండ్లను ఎస్.జి.ఎస్ ప్రయోగశాల టెస్టింగ్ కు పంపితే, పరీక్షల అనంతరం ఎస్.జి.ఎస్ ప్రయోగశాల నివేదికలో భయానక వాస్తవాలు బయటపడ్డాయి. ప్రభుత్వం అమ్ముతున్న మద్యం తాగితే మెదడు వ్యవస్థ, నాడీ వ్యవస్థ దెబ్బతినడంతోపాటు, రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా పనికి రాకుండాపోతుంది.

రాష్ట్రంలో మద్యంతయారు చేస్తున్న ఎస్.ఎన్.జే డిస్టిలరీ మరియు ఇతర కంపెనీ వారి గ్రీన్ ఛాయిస్.. ఛాంపియన్, రాయల్ సింహా, సెలబ్రిటీ, ఓల్డ్ టైమర్ వంటి బ్రాండ్ల మద్యంను ల్యాబ్ లో పరీక్షలు చేయించారు. ఆయా బ్రాండ్లలో ఉండే హానికర పదార్థాల వల్ల శరీరంలో ఏఏ భాగాలు దెబ్బతిని వాటి ప్రభావం ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా చెప్పారు. బెంజోక్వినన్ అనే రసాయనం వల్ల శరీరంలో దీర్ఘకాలిక విష లక్షణాలు ప్రబలుతాయని వాటివల్ల మనిషి త్వరగా మరణించే అవకాశముందని చెప్పారు.
ఛాంపియన్ బ్రాండ్ లో ఫెరోగిలాల్ అనే హానికర పదార్థం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. అలానే రాయల్ సింహా, సెలబ్రిటీ అనే బ్రాండ్ ల మద్యంలో కూడా ప్రమాదకర రసా యనాలు ఉన్నాయని, వాటివల్ల మానవ శరీరంలో తలెత్తే దుష్పరిణామాలను తెలియచేశారు.

నెల్లూరుజిల్లా సర్వేపల్లిలో ఎస్.ఎన్.జే కంపెనీ తయారు చేసే గ్రీన్ ఛాయిస్ మద్యం క్వార్టర్ బాటిల్ ‘(180ఎమ్.ఎల్) ధర రూ.120లుగా ఉంది. ప్రభుత్వం ఆ బాటిల్ ను రూ.15కే కొంటుంది. 48 సీసాలను రూ.696 కి కొంటారు. కానీ బయట అదే 48 సీసాలను వైసీపీ ప్రభుత్వం రూ.5,760 కి అమ్ముతోంది. ఆ విధంగా ఒక్కో బాక్స్ పై వైసీపీ ప్రభుత్వానికి రూ.5,064ల వరకు లాభం వస్తోంది.

ఇలా గ్రీన్ ఛాయిస్ బ్రాండ్ ఒక్కటే కాదు.. మలబార్ హౌస్, రాయల్ ప్యాలెస్ అనే బ్రాండ్లను కూడా రూ.6,63 కొని రూ.7 వేల వరకు అమ్ముతున్నారు. ఇలా అన్నిరకాల నాసిరకం మద్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఎవరూ ఊహించని విధంగా అధిక ధరలకు విక్రయిస్తోంది. 48 బాటిళ్లున్న ఒక మద్యం కేస్ (బాక్సు) పై రూ.200 లు ముఖ్యమంత్రికే పోతోంది. డిస్టిలరీ కంపెనీల నుంచి రూ. 15కి కొంటున్న మద్యం సీసాను రూ.250 నుంచి రూ.270 వరకు అమ్మడం ద్వారా లక్షల కోట్ల దోపిడీ జరుగుతోంది.

నెలకు రూ.400 కోట్ల చొప్పున సంవత్సరానికి రూ.5వేల కోట్ల వరకు ప్రభుత్వానికి అందుతుంటే, కల్తీమద్యం తాగి ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న మద్యం పేర్లు ఎక్కడైనా..ఎప్పుడైనా విన్నామా? ఆఖరికి కమీషన్ల కట్టడం కోసం మాన్షన్ హౌస్ బ్రాండ్ ను కూడా కల్తీ చేసి సదరు కంపెనీ వారు వేరే విధంగా తయారుచేసి అమ్ముతున్నారు.

బయట రాష్ట్రాలు, దేశంలో లభించే మాన్షన్ హౌస్ బ్రాండ్ వేరు. ఏపీ లో అమ్ముతున్న బ్రాండ్ వేరు. వైసీపీ ప్రభుత్వంకు కమీషన్లు కట్టి తమ ప్రతిష్టను ఎందుకు దెబ్బతీసుకోవాలన్న ఉద్దేశంతో మెక్ డోవెల్, .కింగ్ ఫిషర్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలు తమ అమ్మకాలను పూర్తిగా ఆపేశాయి. సింగరాయకొండలోని మెక్ డోవెల్ డిస్టిలరీ మూతపడే పరిస్థితి వచ్చింది. నెల్లూరులోని ఎస్.ఎన్.జే కంపెనీ వారు, గతంలో బీర్ లైసైన్స్ తీసుకొని ఒకటి, రెండి మద్యంబ్రాండ్లు అమ్మేవారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఏకంగా 9 బ్రాండ్లను మార్కెట్లోకి వదులుతున్నారు. అవన్నీ కూడా పరమచెత్త బ్రాండ్లు.

ప్రభుత్వానికి నాసిరకం మద్యం అమ్ముతూ, పాలకులకు కట్టాల్సిన సొమ్ముకడుతూ, ప్రజల ప్రాణాలు హరిస్తున్నారు. కేవలం ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు కట్టడానికే ఎస్.ఎన్.జే కంపెనీ వారు నాసిరకం మద్యం విక్రయిస్తున్నారు. నెల్లూరులోని పొగతోటలో ఒక ఆసుపత్రిలో చేరినవారిన వారి గురించిన సమాచారం అక్కడి వైద్యులు మాకు చెప్పారు. సర్వేపల్లి ప్రాంతంలో తయారయ్యే నాసిరకం మద్యం తాగే వారంతా ఆసుపత్రిలో చేరారు.

ఎస్.జి.ఎస్ పరీక్షలుచేసిన ఐదు బ్రాండ్లలో బెంజోక్వినాన్, ఓల్ క్వినిన్, స్కోపరాన్, డైమిథాక్సి సినమిక్ యాసిడ్, పెరోగల్లాల్, ఓల్కనిక్ లాంటి అత్యంత విషపదార్ధాలు ఉన్నాయని తేల్చి చెప్పారు. ఆ విషపూరిత కెమికల్స్ కారణంగా రక్తపోటు క్షీణించడం, చర్మవ్యాధులు, కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, తీవ్రమైన ధీర్ఘకాలిక విష లక్షనాలు కలుగజేస్తాయి. ప్రయోగశాలలు రిపోర్టు ఇచ్చిన సంగతి వైసీపీ ప్రభుత్వానికి తెలుసు. కానీ నెల మాముళ్లు వస్తుండటంతో ప్రజలు ప్రాణాలు పోతున్నా చర్యలు తీసుకోవడం లేదు.

ప్రభుత్వం మద్యం అమ్మకాల పేరుతో విషపూరితమైన పదార్థాలను ప్రజల శరీరాల్లోకి ఎక్కిస్తోంది. దేశంలో ఎక్కడాలేని ప్రొహిబిషన్ ఏపీలో మాత్రమే ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం అమలుచేయడమేంటి? వైసీపీ స్లో పాయిజన్ మద్యం త్రాగి లెక్కల్లోకి రాకుండా మరణిస్తున్న వారి సంఖ్య చాలానే ఉంది.
దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ప్రత్యేక నిబంధనలు అమలుచేసే అధికారం వైసీపీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నాం.

ఏపీలో అమ్ముతున్న మద్యం బ్రాండ్లలో విషపూరితమైన పదార్ధాలు ఉన్నాయని తేలాక కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం? ఏటా వచ్చే రూ.5 వేలకోట్ల ఆదాయం కోసం ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఈప్రభుత్వానికి ఎవరిచ్చారు. రాష్ట్రంలో విక్రయిస్తున్న నాసిరకం మద్యం తయారు చేసే కంపెనీలు మొత్తం వైసీపీ నాయకులవే. రాయల్ ప్యాలెస్. రాయల్ ఛాయిస్.. మలబార్ హౌస్,గ్రీన్ ఛాయిస్ బ్రాండ్లు తయారుచేస్తున్నఎస్ ఎన్ జే కంపెనీ మొదలు రాయలసీమలో ఎంపీ మిథున్ రెడ్డి కంపెనీ, బొత్ససత్యనారాయణడిస్టిలరీ కంపెనీల మద్యాన్ని అమ్ముతున్నారు.

జంగారెడ్డిగూడెం ఘటన జరిగాక కేవలం 3,4 రోజుల్లోనే లక్షల లీటర్ల కల్తీసారాను నేలపాలుచేశారు. ఆ పనిని ఈ ప్రభుత్వం ముందేచేసి ఉంటే అక్కడ 28 మంది చనిపోయేవారు కాదు. కల్తీమద్యం అమ్మకాలు. అవితాగిన వారికి జరిగే నష్టానికి సంబంధించిన వివరాలు తమవద్ద ఉన్నాయి.

ఆ వివరాల్లోని సమాచారమంతా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తెలుసు. తెలిసే కావాలనే కేవలం డబ్బుకోసమే ప్రజల ప్రాణాలను నాసిరకం మద్యానికి బలి చేస్తున్నారు. ప్రజలతో కల్తీమద్యం, నాటు సారా తాగిస్తూ వారి ప్రాణాలు హరిస్తూ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో పాలకులు సమాధానం చెప్పాలి.

Leave a Reply