Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేదు… ఇక ప్రజలకా?

  • మాజీ మంత్రి మెరుగు నాగార్జున
  • వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి మెరుగు నాగార్జున

తాడేపల్లి: రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని, ఇక ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందని మాజీ మంత్రి మెరుగు నాగార్జున ఫైర్‌ అయ్యారు. రాష్ట్రంలో నారా వారి రెడ్‌బుక్‌ రాజ్యాంగం కొనసాగుతోందన్న ఆయన, సీఎం చంద్రబాబు దారుణంగా ఆటవిక పాలన చేస్తున్నారని ఆక్షేపించారు.

రాజకీయ కక్షతో పరిపాలన సాగుతోందని, యథేచ్ఛగా దాడులు, హత్యలు, ఆస్తుల విధ్వంసం జరుగుతున్నా.. ఏ మాత్రం పట్టించుకోని పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పూర్తిగా గౌరవం కోల్పోయిన పోలీసు వ్యవస్ధ వల్ల వారి ధైర్యం, స్ధైర్యం సమాధి అవుతున్నాయని, అందుకు మొత్తం బాధ్యత చంద్రబాబుదే అని మెరుగు నాగార్జున చెప్పారు.

రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటలు చూస్తే.. పోలీసు వ్యవస్ధను ప్రభుత్వం ఎంతలా దిగజార్చిందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందన్న ఆయన, చిలకలూరిపేట ఎమ్మెల్యే భార్య పుట్టిన రోజు సందర్భంగా సీఐలతో సహా పోలీసు సిబ్బంది అంతా వెళ్లి కేక్‌ కట్‌ కటింగ్లో పాల్గొన్న విషయాన్ని ఉదహరించారు.

తాడిపత్రిలో నిజాన్ని నిర్భయంగా చెప్పిన ఓ సీఐతో ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌ రెడ్డి.. వీడియో కాల్‌లో క్షమాపణ చెప్పించారని, బాపట్ల జిల్లా భట్టిప్రోలులో ఓ టీడీపీ కార్యకర్త ఎస్‌ఐ చొక్కా పట్టుకున్నా.. అలాంటిదేం జరగలేదని ఏకంగా సీఎం చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు అని అభివర్ణించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్ధ అత్యంత దారుణంగా నీరుగారి పోయిందనడానికి ఇవన్నీ నిదర్శనాలని స్పష్టం చేశారు.

తాము చెప్పినట్లు చేయకపోతే, పోలీసు అధికారులు నైతికత దెబ్బ తీసే విధంగా తన అనూకూల మీడియాలో అభూత కల్పనలతో కధనాలు రాయించి.. వాటిని చూపి ఒక పథకం ప్రకారం వారిపై వేటు వేసే దుర్మార్గమైన చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని, ఇంకా 16 మంది సీనియర్‌ ఐపీఎస్‌లకు బాధ్యతలు ఇవ్వకుండా పక్కన పెట్టారని మెరుగు నాగార్జున ఆగ్రహించారు.

నంద్యాల జిల్లా సీతారామాపురంలో వైయస్సార్సీపీ నేత సుబ్బారాయుడును టీడీపీ నాయకులు పోలీసుల సమక్షంలోనే నరికి చంపారని గుర్తు చేశారు. ఒకవైపు దాడులను అరికట్టకపోగా, మరోవైపు బాధితులపైనే తిరిగి కేసులు నమోదు చేస్తున్నారన్న మాజీ మంత్రి, వీటన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

LEAVE A RESPONSE