సీఎం జగన్ పై ప్రజాదరణ ఎక్కడా చెక్కుచెదరలేదు

Spread the love

– జగన్ పరిపాలనను మెచ్చి ప్రజలు ఇచ్చిన అద్భుతమైన విజయం ఇది
– మా పాలన మెచ్చి నూటికి 98-99 శాతం మార్కులు ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారు
– ఓడిపోయి కూడా నాదే పై చేయి అంటున్న బాబును ఇక ఆ భగవంతుడే రక్షించాలి
– ప్రజావాణి ప్రకారం మీడియా ఉండాలే తప్ప.. మీడియా రాసిందే ప్రజావాణి అనుకుంటే పొరపాటు
– 2009లో ఓడిపోయినప్పుడు ఈవీఎంలపై బాబు నెపం వేశాడు.. ఇప్పుడు దొంగ ఓట్లు అంటున్నాడు
– స్వాతంత్ర్య ఉద్యమానికి.. అమరావతి ఉద్యమానికి అసలు పోలికే లేదు
– ఒక సామాజికవర్గం కోసం, వారి ఆస్తులు పెంచుకోవడానికి, ఒక రాజకీయ పార్టీకి వత్తాసు పలుకుతూ పిడికెడు మంది చేస్తున్న ఉద్యమం అది
– రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఈ ప్రభుత్వ పరిపాలనను మెచ్చి ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు అద్భుతమైన విజయాలను అందిస్తూ.. ప్రభుత్వ పనితీరుకు నూటికి 98 నుంచి 99 శాతం మార్కులు వేసి ఆశీర్వదించారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వరుస ఎన్నికల్లో ఓడిపోయినా.. చంద్రబాబు ఆత్మపరిశీలనగానీ, ఎందుకు ఓడానన్న సమీక్షగానీ చేసుకోకుండా ఓడినా.. తనదే పై చేయి అంటూ మీడియా ముందు కేకలు వేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎన్నికల్లో ఓడిన ప్రతిసారీ ఏదో ఒక సాకు చెప్పే చంద్రబాబు నాయుడు మాటలు చూస్తుంటే.. ఆయనను ఇక ఆ భగవంతుడే రక్షించాలని వ్యాఖ్యానించారు. టీడీపీకి వత్తాసు పలికే ఓ వర్గం మీడియా కథనాల గురించి మాట్లాడుతూ.. ప్రజావాణి ప్రకారం మీడియా ఉండాలే తప్పితే.. మీడియా రాసిందే ప్రజావాణి అనుకోవడం పొరపాటు అన్నారు. ఇప్పటికైనా వాస్తవాలను గుర్తెరగాలని హితవు పలికారు.
మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిస్తూ.. అమరావతి ఉద్యమానికి, స్వాతంత్ర్య ఉద్యమానికి అసలు పోలికే లేదని, అలాంటి వ్యాఖ్యలు హైకోర్టు న్యాయమూర్తులు చేశారని తాను అనుకోవడం లేదని, ఒకవేళ అని ఉంటే చాలా దురదృష్టకరం, బాధాకరమని అన్నారు. ఒక సామాజికవర్గం కోసం, వారి ఆస్తులు పెంచుకోవడానికి, ఒక రాజకీయ పార్టీకి వత్తాసు పలుకుతూ పిరికెడు మంది చేస్తున్నది అమరావతి ఉద్యమం అని అన్నారు.మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
రెండున్నరేళ్ల మా ప్రభుత్వ పరిపాలనను చూసి వైయస్సార్‌ సీపీని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలు ఆశీర్వదిస్తూ, అభినందిస్తూ ప్రతి ఎన్నికల్లో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు ఇచ్చిన తీర్పుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎన్నికల ఫలితాలు చూశాక చాలా సంతోషంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ఎన్నో ఎన్నికలు, ఫలితాలు, పరిపాలనను చూశాం. ఇటువంటి విజయాలు, ఫలితాలు ఎప్పుడూ చూడలేదు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలో వైయస్సార్‌ సీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని.. ఇవాళ వచ్చిన ఫలితాలు ఇవి.
ముఖ్యమంత్రి జగన్న పరిపాలనను మెచ్చి, ఈ ప్రభుత్వానికి ప్రజలు నూటికి 98-99శాతం మార్కులు వేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండున్నరేళ్లు పూర్తి అయిన తర్వాత.. ప్రభుత్వం పరిపాలనా విధానం పట్ల, పార్టీ పరంగా నాయకుడి విధానం పట్ల, ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధానం పట్ల, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ- అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు నూటికి 98శాతం సంతృప్తితో ఉన్నారనేది ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం, తార్కాణం కూడా.
తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలికే కొన్ని పత్రికలు, టీవీలు, చంద్రబాబు లాంటి వ్యక్తులు ప్రతిరోజూ ప్రభుత్వం మీద అవాకులు, చెవాకులు పేలుతూ.. బురదచల్లడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు వారిని విశ్వసించలేదు, వారి మాటలను నమ్మడం లేదనడానికి నిదర్శనమే ఈ ఫలితాలు. వైఎస్‌ జగన్‌ నాయకత్వం, వైయస్సార సీపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలుతో ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి, అభివృద్ధికి పాటుపడుతున్నాయని ప్రజలు సంపూర్ణంగా నమ్ముతున్నారు కాబట్టే ఈ ఫలితాలు వచ్చాయి.
చంద్రబాబు, టీడీపీ నేతల మాటలు పట్టించుకోనక్కరలేదు. 2009 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి చవిచూసినప్పుడు.. ఈవీఎంలు ట్యాంపరింగ్‌ జరిగిందంటూ నిస్సిగ్గుగా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది. తాను ఎందుకు ఎన్నికల్లో ఓడిపోయాడో, ప్రజలు ఎందుకు ఓడించారో… పాలనలో లోపాలను సరిదిద్దుకుంటానని చెప్పకుండా ఈవీఎంలు ట్యాంపరింగ్‌ల వల్లే తాము ఓడిపోయామని, మరొకటని సాకులు చెప్పడం చంద్రబాబుకు అలవాటే.
నిన్న కూడా కుప్పంలో దొంగ ఓట్లు వేశారని చంద్రబాబు చెబుతున్నారు. ఓటమికి కారణాలను విశ్లేషించుకోకుండా, ఇంకా ఇటువంటి మాటలు మాట్లాడుతున్న ఆయనను ఇక భగవంతుడే కాపాడాలి. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలంతా కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయిన తర్వాత కూడా సాధారణ ఎన్నికల్లో చూపించిన ఆదరణకు మించి ఇప్పుడు కూడా చెక్కుచెదరనటువంటి ఆదరణను చూపించారు. ఈ ఫలితాలు ఇచ్చినందుకు ప్రజలందిరికీ అందరికీ కృతజ్ఞతులు తెలుపుతున్నాం. ముఖ్యంగా మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ సమన్వయంగా పని చేయడంవల్లే ఈ ఫలితాలు వచ్చాయి. ప్రజలు మా మీద నమ్మకం ఉంచి ఇచ్చిన ఈ ఫలితాలను చూశాక, మరింత ఎక్కువగా ప్రజా సేవకు పునరంకితం అవుతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలుపుతున్నాం.
విలేకర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ…
ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా.. వాస్తవాలను అంగీకరిస్తూ ఎక్కడ లోపం ఉందో దాన్ని సమీక్షించుకుంటాం. పార్టీపరంగా గానీ, ప్రభుత్వపరంగాగానీ ఎక్కడైనా తప్పులు జరిగాయా అని సమీక్షించుకుంటూ మరోసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాం. అంతేకానీ చంద్రబాబు నాయుడులా సాకులు చెప్పి తప్పించుకోం. ఆయనలా కింద పడినా.. నేనే మీద ఉన్నానని, తప్పుడు మాటలు చెప్పి మభ్యపెట్టేలా మాట్లాడటం మాకు చేతకాదు.
ఇప్పటికైనా చంద్రబాబుకు వత్తాసు పలికే పత్రికలు, చానల్స్‌ వాస్తవాలు గ్రహిస్తే మంచిది. ప్రజావాణి ప్రకారం మీడియా ఉండాలి తప్పితే.. మీడియా చెప్పినట్టు ప్రజావాణి ఉండదన్న సత్యాన్ని గుర్తెరగాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీకి వత్తాసు పలికే మీడియా ఎంత ఊదరగొట్టినా.. ప్రజలు మావైపే ఉన్నారు. మా ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుంది. ఇచ్చిన మాటను నెరవేర్చడానికి పట్టుదలతో, కృతనిశ్చయంతో పనిచేస్తూ, సమస్యలు అధిగమించి ముందుకు వెళుతున్నాం. ప్రజలు ఇచ్చిన ఈ ఫలితాలతో రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా పని చేస్తాం.
2019లో సాధారణ ఎన్నికలు జరిగాయి. అప్పుడు మేము అధికారంలో లేము. టీడీపీనే అధికారంలో ఉంది. వైయస్సార్‌ సీపీకి 151 సీట్లు వచ్చాయి. మాకు అధికారులు, పోలీసుల సహకారం కూడా లేదు. మరి మేము విజయం సాధించాం కదా…? ఆ సత్యాన్ని చంద్రబాబు ఎందుకు అంగీకరించడు. ఎంతసేపటికీ తప్పుడు ప్రచారం చేస్తూ.. తన ఓటమికి మరొకర్ని కారణంగా చూపిస్తూ పబ్బం గడువుకోవడం ఆయనకు బాగా అలవాటైంది. 2009 ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్‌ జరిగిందని చంద్రబాబు ఎలా చెప్పారో… ఇవాళ ఈ ఎన్నికల్లోనూ దొంగ ఓట్లు వేశారని చెబుతున్నారు. అప్పుడు… ఇప్పుడూ చంద్రబాబు వైఖరి ఒకటే. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుడు అనేవారు లోపాలను సమీక్షించుకుని ముందుకు వెళ్లాలే కానీ చంద్రబాబులా టక్కుటమార విద్యలు ప్రదర్శించడం సరికాదు.
బీజేపీ, జనసేన పార్టీలతో మాకు సంబంధం లేదు. ఆ పార్టీలు రాష్ట్రానికి చేసిందేముంది… వాటి గురించి చర్చించుకోవడానికి, మాట్లాడుకోవడానికి అన్నది నా అభిప్రాయం. ఆ పార్టీలకు స్పష్టమైన వైఖరి లేదు, కాబట్టే మాట్లాడటం కూడా అనవసరం. స్వాతంత్ర్య ఉద్యమంతో పోల్చారని నేను నమ్మటం లేదు. అదే నిజమైతే దురదృష్టకరం.
అమరావతి ఉద్యమంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. స్వాతంత్ర్య ఉద్యమంతో పోలుస్తూ హైకోర్టు వ్యాఖ్యలు చేసిందని మీరు అడుగుతున్నారుకానీ, అలా అన్నారని నేను అనుకోవడం లేదు, నమ్మడం లేదు. అమరావతి ఉద్యమానికి, స్వాతంత్ర్య ఉద్యమానికి చాలా తేడా ఉంది. ఒకవేళ అలా అని ఉంటే మాత్రం చాలా దురదృష్టకరం. అమరావతి రైతుల ఉద్యమాన్ని స్వాతంత్ర్య ఉద్యమంగా పోల్చడం అనేది చాలా బాధాకరం. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది అశువులు బాశారు. అదే అమరావతి ఉద్యమం, ఒక సామాజికవర్గం కోసం, వారి ఆస్తులను కాపాడుకోవడం కోసం, ఒక రాజకీయ పార్టీకి వత్తాసు పలుకుతూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్నది. స్వాతంత్ర్య ఉద్యమానికి, అమరావతి ఉద్యమానికి ఎలాంటి పోలిక లేదు.
700 రోజులు.. వెయ్యి రోజులు కాదు.. తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం ఈ ఉద్యమం సాగుతుంది. సెంటు భూమి లేనివారు ఎందుకు ఉద్యమం చేయాలి? దేనికోసం చేయాలి? తమ సామాజిక వర్గం మాత్రమే ముందుకు రావాలని చేస్తున్న ఉద్యమం కాదా? కొంతమంది స్వార్థం కోసం, టీడీపీ రాజకీయ దురుద్దేశంతో, ఆర్థిక ప్రాధాన్యత కోసం వాళ్లు డబ్బు ఇచ్చి నడిపిస్తున్న ఉద్యమం ఇది.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. ఏ ఒక్క వర్గం, ప్రాంతం కోసమో నిర్ణయాలు తీసుకోం. మా ప్రభుత్వం నుంచి, మా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నుంచి.. వైయస్సార్‌సీపీ సామాన్య కార్యకర్త వరకూ మూడు రాజధానులకు సంబంధించి మా పార్టీ విధానానికి కట్టుబడి ఉన్నాం. ఎవరెన్ని మాట్లాడినా మా ప్రభుత్వ విధానం ఇదే.

Leave a Reply