Suryaa.co.in

Andhra Pradesh

ఏప్రిల్ 6 లోగా కుటుంబ సాధికార సారధుల ప్రక్రియ పూర్తి చెయ్యాలి

పార్టీ సభ్యత్వ కార్డులు అందజేసిన మంత్రి సుభాష్ గారు

రామచంద్రపురం: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కుటుంబ సాధికార సారధులు (కె ఎస్ ఎస్) ప్రక్రియ ఈనెల 6 తేదీ లోగా పూర్తిచేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పార్టీ నాయకులను ఆదేశించారు. మంగళవారం రామచంద్రపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం గా అధ్యక్షతన రామచంద్రపురం నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సాధికార సారధుల పేరిట నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టారని, ప్రతి 30 కుటుంబాలకు ఈ సాధికార సారథులు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తారన్నారు. ఈ నియమకాల్లో మహిళలకు కూడా సమ ప్రాధాన్యత కల్పిస్తామన్నారు.

పార్టీను అన్ని రకాలుగా బలోపేతం చేసేందుకు, ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలిసేలా కుటుంబ సాధికార సారధులు వ్యవహరిస్తారన్నారు. అలాగే పార్టీ పంపిన సభ్యత్వ కార్డులు త్వరితగతిన సభ్యులకు అందజేయాలని సూచించారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో, సమన్వయంతో పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే మంత్రి సుభాష్ గారి దృష్టికి తీసుకురావాలన్నారు. పార్టీ కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా పార్టీ పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఆయా మండలాల అధ్యక్ష కార్యదర్శులు, క్లస్టర్ ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE