లబోదిబోమంటున్న తెలంగాణ ఇంటర్ విద్యార్థులు

-అన్నింటిలోనూ ఫస్ట్ క్లాస్ మార్కులు.. ఒక్క సబ్జెక్టులో మాత్రం ‘సున్నా’

తెలంగాణలో నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాలు అధికారుల నిర్లక్ష్యానికి మరోమారు అద్దంపట్టాయి. ఇంటర్ ఫలితాల్లో ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా మార్కులను డబుల్ చెక్ చేశామని, అందుకే ఫలితాల విడుదల ఆలస్యమైందని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్ చెప్పారు. అయినప్పటికీ మార్కులు తప్పుల తడకగా ఉండడంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కొందరు విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లోనూ ఫస్ట్ మార్కులు తెచ్చుకోగా ఒక్క సబ్జెక్టులో మాత్రం ‘సున్నా’ మార్కులు రావడం వారిని ఆందోళనలో పడేసింది. చాలామంది విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదురైంది.

ఖమ్మం జిల్లా ముదిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బద్రి గోపి ఇంటర్ (హెచ్ఈసీ) రెండో సంవత్సరం చదువుతున్నాడు. గతేడాది ఫస్టియర్ మంచి మార్కులతో పాసయ్యాడు. ఈసారి సెకండియర్‌లో ఇంగ్లిష్‌లో 70, తెలుగులో 90, హిస్టరీలో 93, రాజనీతి శాస్త్రంలో 80 మార్కులు వచ్చాయి. ఆర్థికశాస్త్రంలో సున్నా మార్కులు వచ్చాయి. 80 మార్కులు వస్తాయని ఆశించిన గోపి సున్నా మార్కులను చూసి విస్తుపోయాడు.

మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఫస్టియర్ (బైపీసీ)లో పాసైన విద్యార్థికి సెకండియర్‌లో మాత్రం సంస్కృతంలో సున్నా మార్కులు వచ్చాయి. మిగిలిన నాలుగు సబ్జెక్టుల్లో మాత్రం పాసయ్యాడు. వీరిద్దరే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇలా సున్నా మార్కులు వచ్చిన వారు ఎందరో ఉన్నారు. ఇలా సున్నా మార్కులు వచ్చిన వారు పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకుంటే న్యాయం జరుగుతుందని కళాశాల అధ్యాపకులు వారికి ధైర్యం చెప్పారు.