– రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
విజయవాడ : నేతన్నలకు ఆర్థిక భరోసా కలిగేలా చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్న మకుట డిజైనర్స్ స్టూడియో సేవలను రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. నగరంలోని జీఈవీ రాధా మాధవ్ క్లబ్ హౌస్ లో మకుట డిజైనర్స్ స్టూడియో ఆధ్వర్యంలో చేపట్టిన చేనేత ఎగ్జిబిషన్ ను మంత్రి సవిత శనివారం ప్రారంభించారు. ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉంచిన చేనేత రెడీ మేడ్ దుస్తులను, చీరలను పరిశీలించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, చేనేత రంగానికి సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. ఆన్ లైన్ తో పాటు ఆప్కో షో రూమ్ ల్లోనూ చేనేత విక్రయాల చేపట్టామని, చేనేత రెడీమేడ్ దుస్తులకు విశేష స్పందన లభిస్తోందని వెల్లడించారు. హైదరాబాద్ కు చెంది మకుట డిజైనర్స్ స్టూడియో యాజమాన్యం చేనేత ఎగ్జిబిషన్ నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఇటువంటి ఎగ్జిబిషన్లు రాష్ట్రమంతటా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మకుట డిజైనర్స్ యజమాన్యానికి మంత్రి సవిత సూచించారు. తెలుగింటి పండుగల్లో సంప్రదాయ చేనేత దుస్తులను ప్రజలు ధరించి, నేతన్నలకు అండగా నిలవాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, నేతన్నలకు చంద్రబాబు అండగా ఉంటోందన్నారు. ఈ కార్యక్రమంలో మకుట డిజైనర్స్ స్టూడియో ఎండీ శ్రావ్య, ఇతర ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.