Suryaa.co.in

Andhra Pradesh

పేరాబత్తుల విజయమే అంతిమ లక్ష్యం

మంత్రి సుభాష్, గన్ని కృష్ణలు విస్తృత ప్రచారం

రామచంద్రపురం : ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపే అంతిమ లక్ష్యంగా కూటమి శ్రేణులంతా కృషి చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు గన్ని కృష్ణ, రామచంద్రపురం ఎన్నికల పరిశీలకులు కాకినాడ రామారావు, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, కూటమి నాయకులతో కలిసి మంత్రి సుభాష్ సోమవారం గ్రామ గ్రామాన విస్తృత పర్యటన చేపట్టారు.

ఈ పర్యటన ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. రామచంద్రపురం నియోజవర్గంలోని చోడవరం, మాలపాడు, అంబికాపల్లి అగ్రహారం, యనమదల, నరసాపురపు పేట, ఓదూరు, అన్నయ్య పేట, ద్రాక్షారామ గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేపట్టి పట్టభద్రులైన ఓటర్లను కలిసి కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. విద్యా వంతుడు, పట్టభద్రుల సమస్యల పట్ల అవగాహన ఉన్న కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత (1) ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలన్నారు.

ద్రాక్షారామ, అన్నయ్య పేట గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో మంత్రి సుభాష్ మాట్లాడుతూ విద్యావంతులు కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓటెయ్యాలన్నారు. నిరుద్యోగం నిర్మూలన దిశగా స్వర్ణాంధ్ర సృష్టికర్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఏపీ పేరుతో సుమారు 7 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం ద్వారా 4 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి కోసం క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుంటూ ఓటర్లను చైతన్య పరచాలని సూచించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన 94 శాతం స్ట్రైక్ రేట్ కంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరింత ఎక్కువ రావాలని ఆకాంక్షించారు. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ్ఞులైన ఓటర్లు అభివృద్ధిని చూసి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE