( ఇంద్రాణి)
“ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు విఫలమైనప్పుడు కమ్యూనిజమే మిగులుతుంది” – బి.ఆర్.అంబేద్కర్ చెప్పిన ఈ మాటలు వింటుంటే, మన రాజ్యాంగ రూపకర్తల చైర్పర్సన్కు కమ్యూనిజం మీద ఉన్న విశ్వాసం అర్థమవుతున్నది. భారతదేశంలో ఏయే వ్యవస్థలు విఫలమయ్యాయో చెప్పటం కష్టం. స్వతంత్ర వ్యవస్థలు కేంద్రప్రభుత్వాల పావులుగా మారాయని ప్రతిపక్షాలు అంటూ ఉంటాయి, వ్యవస్థలు తమ పనులు తాము చేసుకుంటూ పోతుంటాయి అని అధికారపక్షం చెబుతూ ఉంటుంది.
అందుకని కమ్యూనిజమే మిగిలే పరిస్థితి వచ్చిందో రాలేదో చెప్పటం కష్టం. కానీ, భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం ఘనమైన చరిత్ర కలిగిన ఉద్యమమని ఒప్పుకోక తప్పదు. అటువంటి ఘన చరిత్రలో కేరళ కమ్యూనిస్ట్ పార్టీకి ప్రత్యేకమైన స్థానం ఉన్నదని చెప్పనవసరం లేదు. ప్రపంచంలో కమ్యూనిస్టు ఉద్యమంలో మొట్టమొదటిసారి ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఈ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ నాయకత్వంలోని కేరళ కమ్యూనిస్ట్ పార్టీది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకసారి ఓడినా, ఒకసారి గెలిచినా వామపక్ష పార్టీలు కేరళలో బలహీనపడలేదు.
అయితే అంబేద్కర్ అన్నట్లు వ్యవస్థలు విఫలమైనప్పుడు కమ్యూనిజమే మిగులుతుందో లేదో కానీ, వ్యవస్థలతో సక్రమంగా పని చేయించటం ద్వారా ప్రభుత్వాన్ని నడపగలిగే పార్టీల జాబితాలో ముందు వరుసలో ఉండే పార్టీగా కేరళ కమ్యూనిస్ట్ పార్టీ నిలుస్తుంది. వందశాతం అక్షరాస్యతతో, 80 శాతం మంది దినపత్రికలు తిరగేసే వారిని మభ్యపెట్టటం, తాయిలాలు చూపించి ఓట్లు దండుకోవటం చాలా కష్టం.
హామీలు గుప్పిస్తే వారు మెచ్చరు, హామీ ఇచ్చేముందే సాధ్యాసాధ్యాలను వారికి వివరించి ప్రజలను మెప్పించాలి. కేరళ ప్రజలు రేపటి గురించి ఆలోచిస్తారు. దేశంలో గ్యాస్ సమస్య గురించి మనం ఆలోచిస్తే, కేరళ ప్రజలు మధ్యప్రాచ్యంలో యుద్ధం గురించి చెబుతుంటారు. వాళ్ల దగ్గర ఎన్నికలు అంటే కోట్లు పెట్టే అవసరం తక్కువే, పాతికలక్షల లోపు ఖర్చుపెట్టి ఎమ్మెల్యే అయినవారు ఉన్నారు.
అటువంటి రాష్ట్రంలో ఎన్నికలు నేడు జరగనున్నాయి. మూడు జాతీయపార్టీలు కదనరంగంలో ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతానికి పోటీ మాత్రం సీపీఎం నేతృత్వంలోని ఎల్.డి.ఎఫ్ (LDF), కాంగ్రెస్ నేతృత్వంలోని యూ.డి.ఎఫ్ (UDF) మధ్యనే హోరాహోరీ నడుస్తున్నది. బీజేపీ కూడా తన ఉనికిని చాటేంత బలాన్ని పెంచుకున్నది.
రాజ్ దీప్ సర్దేశాయ్ అభిప్రాయం ప్రకారం.. పది సంవత్సరాల పినరయి విజయన్ పాలన పైన కొంత వ్యతిరేకత ఉన్నది కానీ, ఓడించే అంత లేదు అంటున్నారు. వ్యతిరేకత కూడా పినరయి పైన పార్టీ వర్గాల్లోనే కాస్త ఎక్కువ ఉన్నదని ఆయన అనాలసిస్. అదే నిజమైతే పినరయి మరొక్కసారి గెలవటానికి అవకాశం ఉన్నట్లే లెక్క.
ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎల్.డి.ఎఫ్ ప్రకటించకపోయినా, విజయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎక్కువ. కారణం విజయన్ ఒక చరిత్ర సృష్టించారు. ఒకసారి ఎల్.డి.ఎఫ్ గెలిస్తే, మరోసారి యూ.డి.ఎఫ్ గెలుస్తూ వస్తున్న సాంప్రదాయానికి గండి కొట్టి, వరుసగా రెండుసార్లు గెలిచి, మూడో పర్యాయం కూడా గెలిచే అవకాశం ఉన్నది అనిపించుకునే స్థితిలో ఉన్నారు. విజయన్ సంప్రదాయ కమ్యూనిస్ట్ పోకడ నుండి కొంతవరకు బయటకు వచ్చారనే చెప్పాలి. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బంగ్లాలు కాదు, రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి గౌరవంగా బ్రతకటం అనే పినరయి, కమ్యూనిస్టు పరిపాలన విధానంలో కొంతమార్పును అయితే తీసుకొచ్చారు.
ముఖ్యంగా ప్రైవేటీకరణ విషయంలో, సాధారణంగా కమ్యూనిస్టులు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తారు. అయితే యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కొంతకాలంగా కేరళ వామపక్ష ప్రభుత్వం ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నది. గతంలో విదేశీ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ యూనివర్సిటీలు కేరళలోకి రావటాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి కమ్యూనిస్టు పార్టీలు. ఆ విషయంలో పినరయి విజయన్ సాంప్రదాయ వ్యతిరేకత నుండి బయటకు వచ్చారనే చెప్పాలి. మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రపంచబ్యాంకు, ఇతర ప్రైవేట్ బ్యాంకుల రుణాలు తీసుకోవటం మొదలు పెట్టింది కేరళ ప్రభుత్వం.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) అధినాయకత్వానికి పినరయి విజయన్ అనుసరిస్తున్న ఈ నయా ఉదారవాద పోకడల పట్ల అసంతృప్తి ఉన్నది కానీ, కక్కలేని పరిస్థితి. పారిశ్రామికవేత్తలతో కొంత సత్సంబంధాలు కలిగి ఉండటం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి పెద్దపీట వేయటం లాంటివి “కార్పొరేట్ కమ్యూనిజం” తరహాలో ఉన్నాయనేది సంప్రదాయ కమ్యూనిస్టుల అభిప్రాయం.
కేరళ మోడల్ సంక్షేమ పథకాలను గమనిస్తే కమ్యూనిస్టు ప్రభుత్వం తన కమ్యూనిస్ట్ వాసనను పూర్తిగా కోల్పోలేదని అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణను గమనిస్తే విజయన్లోని సోషలిస్ట్ మూలాలు కనిపిస్తాయి అంటారు రాజకీయ విశ్లేషకులు.
కేరళ రాజకీయాలలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఇప్పటికీ ఎన్నికల రాజకీయం ఎన్నికల ముందు మాత్రమే ఉంటుంది. భవిష్యత్తులో ఎన్.డి.ఏ (NDA) పోకడ ఎలా ఉంటుందో తెలియదు కానీ, ఇప్పటివరకు ప్రభుత్వంలో ఉంటూ వస్తున్న ఎల్.డి.ఎఫ్, యూ.డి.ఎఫ్ లు కొంత హుందాగానే రాజకీయాలు చేస్తూ వస్తున్నాయి. పార్టీలు మారే సంస్కృతి చాలా తక్కువ. అది కూడా ఎన్నికల సీట్ల కోసమో, మంత్రి పదవుల కోసమో అసలే జరగదు.
అందువలన ఏ పార్టీ కూడా అనుచితమైన ఉచితాలు, నేరుగా డబ్బుల రూపంలో పంపిణీ చేసే పథకాలు ఇచ్చేవి కావు. మొట్టమొదటిసారి ఎల్.డి.ఎఫ్ వృద్ధులకు పెన్షన్ల పెంపు హామీతో పాటు నిరుపేద మహిళలకు వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవటానికి కొంత ఆర్థికసాయం అందిస్తామని హామీ ఇచ్చింది.
సాగు చేస్తున్న రైతులకు పెట్టుబడులకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఎల్.డి.ఎఫ్ ప్రకటించిన డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ స్కీంలో కూడా కొంత సోషలిస్ట్ భావజాలం కనిపిస్తుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో కేవలం సిద్ధాంతాలకే పరిమితమై ఉండటం ఏ పార్టీకైనా కష్టమే. అందుకే పినరయి విజయన్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడిదారీ విధానాన్ని కూడా అనుకరిస్తున్నది. ఈ మార్పులను దృష్టిలో పెట్టుకునే విజయన్ కమ్యూనిజం నుండి బయటకు రాలేదు కానీ, ప్రయోగాత్మక కమ్యూనిజం వైపు అడుగులు వేస్తున్నారు అంటున్నారు.
ఒక్కటైతే వాస్తవం, పినరయి విజయన్ నవ కేరళ ఆవిష్కరణ కోసం సంప్రదాయ కమ్యూనిస్ట్ శృంఖలాలు – అనేది పెద్ద పదం కానీ – బంధనాల నుండి బయటకు వచ్చారు. సంప్రదాయ కమ్యూనిస్ట్ భావజాలం, పెట్టుబడిదారీ విధానాలను సమతుల్యం చేసుకుంటూ వెళ్తున్న కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం ఎటువంటి ఫలితాన్ని ఎదుర్కోబోతున్నదో అనే ఉత్కంఠ భారత మేధావి వర్గాన్ని ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూసేలా చేసింది.
ఫలితాలు తెలిసేది మే నెలలోనే అయినా, భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమానికి ప్రస్తుతం వేగుచుక్కలా వెలుగుతున్న కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం భవిష్యత్తు ఈరోజు ఈవీఎం పెట్టెల్లో నిక్షిప్తం అవబోతున్నది. పినరయి విజయన్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుని, ఆ హ్యాట్రిక్ విజయంతో దేశ కమ్యూనిస్టు ఉద్యమానికి ఆక్సిజన్ అందిస్తారని ఆశిస్తూ..