Suryaa.co.in

Editorial

నాడు గద్దర్.. నేడు గుమ్మడి!

  • సీఎంల చేతిలో దళిత గిరిజన బిడ్డలకు అవమాన పర్వం

  • నాడు కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం గద్దర్ ఎదురుచూపులు

  • నేడు రేవంత్ భేటీ కోసం గుమ్మడి నర్సయ్య పడిగాపులు

  • రేవంత్ అపాయింట్‌మెంట్ కోసం నాలుగురోజులు ఎదురుచూపులు

  • రేవంత్‌రెడ్డి పిలుపు కోసం ఇంటి ఎదురు గుమ్మడి నర్సయ్య పడిగాపులు

  • గతంలో దళిత బిడ్డ గద్దర్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ అవమానించారంటూ రేవంత్ విమర్శలు

  • ఇప్పుడు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గిరిజన బిడ్డకు సమయం ఇవ్వని రేవంత్‌పై విమర్శలు

  • దుర్లభంగా మారిన సీఎంల అపాయింట్‌మెంట్లు

  • నాడు బాబు, వైఎస్, చెన్నారెడ్డి, రోశయ్య, కిరణ్‌ను సులభంగా కలిసేవాళ్లమంటున్న కాంగ్రె స్ నేతలు

  • కేసీఆర్ నుంచే కంచెల మయం అయిందంటున్న విశ్లేషకులు

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన ఐదుసార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే. అప్పట్లో బలమైన కాంగ్రెస్, టీడీపీ వంటి బలమైన పార్టీలను ఎదుర్కొని ఐదుసార్లు విజయం సాధించిన ఏకైక ఆదివాసీ నాయకుడు. సమాజానికి దూరంగా అడవుల్లో జంతువుల మధ్య పెరిగే.. గిరిజన బిడ్డల గడ్డు పరిస్థితులను శాసనసభలో నినదించిన నిస్వార్ధనేత. ఇప్పుడు ఒక్కసారి ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ-కార్పొరేటర్‌గా గెలిస్తేనే.. ఫార్చూనర్ కార్లు, మణికొండలో ఐదొందల గజాల స్థలంలో విల్లా కట్టుకునే నడమంత్ర పుసిరి కాలం.

కానీ ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. అప్పుడు-ఇప్పుడూ బస్సు ప్రయాణమే. ఆరోగ్యం బాగోలేకపోతే సర్కారు దవాఖానకు మాత్రమే వెళతారు. అక్కడ తాను మాజీ ఎమ్మెల్యేనన్న దర్పం చూపరు. తోటి రోగుల మాదిరిగానే క్యూలో నిలబడి, తన వంతు వచ్చే వరకూ ఓపికగా నిలబడే అరుదైన నాయకుడు. నియోజకవర్గంలో ఉంటే సైకిలే ఆయనకు ఫార్చూనర్ కారు. అదీ లేకపోతే కాలినడకే. పూరి గుడిసెనే ఆయనకు ఇంధ్రభవనం. నులకమంచమే ఫోమ్‌బెడ్.

అలాంటి త్యాగధనుడు, గిరిజన బిడ్డ ఒక సీఎంను కలిసేందుకు.. ఆయన ఇంటిముందు చకోరపక్షిలా పడిగాపులు కాసిన దృశ్యం ఎవరికి అవమానం? సీఎం అపాయింట్‌మెంట్ కోసం దీనంగా నిలబడిన ఆ గిరిజన మాజీ ఎమ్మెల్యేదా? అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అన్నిసార్లు ఆయనను తిప్పించుకుంటున్న సీఎందా? లేక సీఎం అపాయింట్‌మెంట్ వ్యవస్థదా?.. ఇదీ ఇప్పుడు తెలంగాణ పౌర సమాజం సూటిగా సంధిస్తున్న ప్రశ్న.

గుమ్మడి నర్సయ్య.. ఉమ్మడి రాష్ట్రంలో ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు గెలిచిన గిరిజన ఎమ్మెల్యే. అన్నిసార్లు గెలిచినా ఇప్పటివరకూ ఒక్క కారు కూడా కొనుక్కోకుండా, బస్సులోనే తిరిగే అసాధారణ నాయకుడు. అలాంటి మాజీ ఎమ్మెల్యే తన రాజకీయ జీవితంలో, ఎంతమంది ముఖ్యమంత్రులను చూసి ఉంటారు? ఎంతమంది మంత్రులను చూసి ఉంటారు? ఎంత మంది సీఎంలతో మాట్లాడి ఉంటారు? అలాంటి ‘గిరి’జన నాయకుడు, సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్ కోసం నాలుగుసార్లు, ఆయన ఇంటిముందు పడిగాపులు కాశారంటే నమ్ముతారా? అవును. నమ్మితీరాలి. ఎందుకంటే.. ఆ అవమాన పర్వం గురించి స్వయంగా నర్సన్నే చెప్పారు కాబట్టి.

లేటెస్ట్‌గా సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు గిరిజన నేత గుమ్మడి నర్సయ్య.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. సహజంగా జనాలకు.. సీఎంలంటే సచివాలయంలో మాత్రమే ఉంటారు. లేకపోతే ఇంటి దగ్గరే ఉంటారన్న భావన ఉండేది. కానీ కేసీఆర్ పుణ్యాన అది చెరిగిపోయి.. సీఎంలంటే ఫాంహౌసుల్లోనో.. పోలీసు కంట్రోల్‌రూమ్‌లోనో ఉంటారన్న అభిప్రాయం స్థిరపడింది. సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయానికి పెద్దగా రాకపోవడంతో, గుమ్మడి నర్సయ్య ఆయన ఇంటికి బంజారాహిల్స్‌కు బస్సులో వెళ్లారు.

పాపం తాను ఐదుసార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యేని కాబట్టి, తనను చూడగనే సీఎం ఇంటిదగ్గర ఉండే అధికారులో, కాంగ్రెస్ నాయకులో తనను తీసుకువెళ్లి రేవంత్‌రెడ్డిని కలిపిస్తారేమోనని నర్సయ్య భ్రమించారు. కానీ పాపం అక్కడ ఆయనను గుర్తుపట్టేవారే లేరు. అయినా బాధపడని నర్సయ్య.. తాను ఫలానా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేనని అక్కడి అధికారులు, సెక్యూరిటీకి చెప్పినా పట్టించుకునే దిక్కులేదట. అప్పటికీ లోపల అధికారులకు ఫోను చేస్తే రమ్మన్నారని గుర్తు చేసినా వినే నాధులు లేరు. అలా ‘కేవలం నాలుగుసార్లు’ మాత్రమే, సీఎం రేవంత్ ఇంటి దగ్గర పడిగాపులు కాసిన గిరిజన నేత నర్సయ్య.. చేసేదిలేక ఆర్టీసీ బస్సులో ఇంటిముఖం పట్టారు. సీఎం పిలిపిస్తారన్న గంపెడాశతో.. గంటలకొద్దీ ఆయన ఇంటి ఎదురుగా నిలబడ్డ నర్సన్నకు కాళ్లనొప్పి తప్ప, రేవంత్ దర్శన భాగ్యం దక్కలేదు.

ఇంతకూ సదరు నర్సయ్య సీఎం అపాయింట్‌మెంట్ అడిగింది తన కోసం కాదు. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమో, కాంట్రాక్టర్ల బిల్లుల పైరవీల కోసం కాదు. కుటుంబసభ్యుల వ్యాపారాల కోసం కాదు. తనకు కాంట్రాక్టు పనులు ఇప్పించమని అడిగేందుకు అసలు కాదు. పోడు భూములు, సీతారామ ప్రాజెక్టు, ఎత్తిపోతల పథకాల సమస్యలు, చెక్‌డ్యాముల గురించి సీఎంకు వివరించి, వాటి పరిష్కారమార్గాలు సూచించేందుకు మాత్రమే ఆయన సీఎం అపాయింట్‌మెంట్ అడిగారు.

సీన్ కట్ చేస్తే..
అది బేగంపేట సీఎం కేసీఆర్ నివసించే ప్రగతిభవన్. నాడు సీఎంగా ఉన్న కేసీఆర్‌ను కలిసేందుకు దళిత బిడ్డ, ప్రజాగాయకుడు గద్దర్ వచ్చారు. తనపై పోలీసు కేసులతో పాటు, ఎన్‌ఐఏ వేధింపుల గురించి నాటి సీఎం కేసీఆర్‌తో చర్చించేందుకు, గద్దర్ ప్రగతిభవన్‌ను ఆశ్రయించారు. కేసీఆర్ పిలుపు కోసం గంటలపాటు గేటు దగ్గరే కూర్చుకున్నారు. కానీ సారు నుంచి పిలుపురాలేదు. సారు అపాయింట్‌మెంట్ లేకపోతే ఎవరినీ కలవరని సెక్యూరిటీ నిర్మొహమాటంగా చెప్పింది. అప్పట్లో కేసీఆర్ పిలుపు కోసం.. గడీల బయట కూర్చున్న గద్దర్ ఫోటొ, మీడియా-సోషల్‌మీడియాలో హల్‌చల్ చేసింది.

దానిపై నాటి పీసీసీ చీఫ్, నేటి సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌పాలకుల నియంతృత్వాన్ని ఎండగట్టారు. దళిత బిడ్డను దొరల కుటుంబం గడీల బయట నిలబెట్టి, దళితులను అవమానించిందని విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చి.. తానే సీఎం అయిన తర్వాత ప్రభుత్వం తరఫున నిర్వహించిన, గద్దర్ సంస్మరణ సభలో కూడా రేవంత్.. నాడు గద్దర్‌కు కేసీఆర్ చేసిన అవమానం గుర్తు చేశారు. తాను కేసీఆర్‌కు భిన్నంగా అందరినీ కలుస్తానని, అందరికీ అందుబాటులో ఉండేందుకు ప్రగతిభవన్ గడీలు బద్దలు కొట్టామని, తొలిరోజుల్లో రేవంత్‌రెడ్డి సగర్వంగా ప్రకటించుకున్నారు.

కానీ ఇప్పుడు అదే రేవంత్‌రెడ్డి.. గిరిజన బిడ్డ, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నిరాడంబర నాయకుడయిన గుమ్మడి నర్సయ్యను.. నాలుగుసార్లు తన ఇంటి ముందు నిలబెట్టి, అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానించిన వైనంపై, సోషల్‌మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘‘నాడు దళిత బిడ్డ గద్దర్‌ను గేటు బయట నిలబెట్టి  కేసీఆర్ దొర అవమానిస్తే, నేడు గిరిజన బిడ్డ గుమ్మడి నరసయ్యను రేవంత్‌రెడ్డి తన ఇంటి గేటు బయట నిలబెట్టి అవమానించారు. అప్పుడు దళితుడు. నేడు గిరిజనుడు. ఒక సీఎంను కలిసేందుకు దళిత, గిరిజన బిడ్డలు ఇన్ని అవమానాలు ఎదుర్కోవాలా’’ అంటూ విరుచుకుపడుతున్నారు.

నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో సీఎంల అపాయింట్‌మెంట్‌కు పెద్దగా కష్టపడనవసరం ఉండేది కాదు. నాటి సీఎంలు సహజంగా సచివాలయంలోనే అందరినీ కలిసేవారు. సాధారణ ప్రజలు, తమ పార్టీ నాయకులను వారు అక్కడే కలిసేవారు. అంజయ్య, ఎన్టీఆర్, చెన్నారెడ్డి, జలగం, చంద్రబాబు, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి సందర్శకులకు ఎక్కువగా సచివాలయంలోనే కలిసేవారు.

వైఎస్ తన నివాసంలో ఉదయం దర్బార్‌లో సాధారణ ప్రజలను కలిసి వారి నుంచి వినతిపత్రాలు తీసుకునేవారు. ముఖ్యమైనేతలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను కూడా అక్కడే కలిసేవారు. సచివాలయంలో కూడా అపాయింట్‌మెంట్‌కు ఎప్పుడూ ఇబ్బంది ఉండేది కాదు. చంద్రబాబానాయుడు కూడా ఇంటి వద్ద పార్టీ నేతలు, మంత్రులను కలిసేవారు. సచివాలయంలో కూడా పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్లు ఇచ్చేవారు. పార్టీ ఆఫీసులో అయితే మండల పార్టీ అధ్యక్షులను కలిసేవారు.

కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ సీఎం అయిన తర్వాత సీఎం అపాయింట్‌మెంట్ వ్యవస్థ మారిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంఓ కిందనే ప్రెస్ సెక్రటరీ రూమ్ ఉండేది. అక్కడికి జర్నలిస్టులు ఎలాంటి అడ్డంకులు లేకుండా వెళ్లేవారు. అక్కడి నుంచి నాలుగో ఫ్లోర్‌లోని సీఎంఓకూ స్వేచ్ఛగా వెళ్లేవారు. కానీ తెలంగాణ ఏర్పడి, కేసీఆర్ సీఎం అయిన తర్వాత..జర్నలిస్టులు ప్రెస్ సెక్రటరీ రూముకు వెళ్లకుండా బారికేడ్లు కట్టారు. ఎదురుగా మీడియా కోసం ఒక గది నిర్మించారు.

చివరకు సొంత బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకూ సీఎం అపాయింట్‌మెంట్ ఉండేది కాదు. ఎమ్మెల్యేలు, మంత్రులయినా సీఎంఓలోని సెక్రటరీల వద్దకు వెళ్లి తమ గోడు వినిపించుకోవాల్సిందే. కీలకమైన వ్యవహారాలయితే కేటీఆర్, కవిత, సంతోష్ చక్కదిద్దేవారు. ‘కేసీఆర్ సారుకు పొద్దున్నే ఎవరైనా కలలో కనిపిస్తే తప్ప ఎవరినీ పిలవర’న్న వ్యంగ్య ప్రచారం అప్పట్లో బాగా జరిగేది. ప్రగతిభవన్‌లో సైతం మంత్రులు.. కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం వేచిచూసి, వెనక్కివెళ్లిపోయిన అవమాన పర్వాలకు లెక్కలేదు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. కేసీఆర్ తానొక దైవాంశ సంభూతుడినన్న భావనలో జీవించేవారు.

దానిపై అప్పటి మంత్రి కేటీఆర్, ఒక విచిత్ర భాష్యం ఇచ్చారు. ‘సీఎం అంటే అందరినీ కలవాలా? మంత్రులు, ఎమ్మెల్యేలు ఉంది ఎందుకు? ఎవరి పని వారు చేస్తే సీఎంను కలవాల్సిన పని ఎందుకుంటుంది’ అని సెలవిచ్చారు. తెలంగాణలో కేసీఆర్ సూత్రాన్ని జగన్ ఏపీలో అమలుచేశారు. జగన్ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, పార్టీ నేతలకు అపాయింట్‌మెంట్లు ఇచ్చేవారు కాదు. సీఎంఓ అధికారి ధనంజయరెడ్డి, సలహాదారు సజ్జల దయాధర్మానికి వారిని విడిచిపెట్టేవారు. జగన్ కూడా కేసీఆర్ మాదిరిగానే, తానో దైవాంశ సంభూతుడినన్న భ్రమల్లో జీవించేవారు.

ఇప్పుడు కేసీఆర్ స్థానంలో వచ్చిన కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డిది.. కేసీఆర్ అంత కాకపోయినా, కొంచెం అటు ఇటుగా అదే పరిస్థితి. ఆయనను కలిసేందుకు పార్టీ నాయకులు, ఇంటి ఎదురుగా ఉన్న కాఫీ షాప్ దగ్గర పడిగాపులు కాయాల్సిందే. తెలివైన నాయకులు మాత్రం రేవంత్ ఢిల్లీకి వెళ్లేది ఎప్పుడో తెలుసుకుని, అక్కడికి వెళ్లి కలుస్తున్నారన్న వ్యాఖ్యలు లేకపోలేదు. ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులకు రేవంత్ అపాయింట్‌మెంట్ దుర్లభమవుతోందన్న వ్యాఖ్యలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇక ఆయన వద్ద నాలుగైదు ఫోన్లు ఉన్నప్పటికీ, ఏ ఒక్క ఫోన్లకూ స్పందించరన్న వ్యాఖ్యలు ఎప్పటినుంచో ఉన్న విషయం తెలిసిందే.

తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని, అందుకే ప్రగతిభవన్ గడీలు బద్దలు కొట్టి, దానిని ప్రజలకు అంకితం చేస్తున్నానని తొలుత ప్ర టించారు. తర్వాత కేవలం ఒక్కరోజు మాత్రమే అక్కడ ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. ప్రగతిభవన్ పేరును ప్రజాభవన్‌గా మార్చి, దానిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కేటాయించారు. ప్రస్తుతం అక్కడ ప్రజల నుంచి తీసుకుంటున్న వినతిపత్రాలు ఏమయ్యాయి? అందులో ఎన్ని పరిష్కారమయ్యాయి? అన్న ప్రతిపక్షాల ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు.

ఇప్పుడు సీఎం రేవంత్ ఎవరికీ అందుబాటులో లేపోవడంతో, పార్టీ వర్గాలు నెంబర్‌టూ అయిన భట్టి విక్రమార్కను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ఆయన ఇల్లు, సచివాలయంలోని చాంబర్ జనంతో కిక్కిరిసిపోతోంది. భట్టి ఫోన్లలో కూడా అందుబాటులో ఉండటం వల్ల ఆయన అందరికీ సులభంగా కనెక్టయిపోతున్నారు. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర వంటి మాస్ లీడర్ల చాంబర్లు, ఇళ్లు కూడా జనంతో కిటకిటలాడుతున్నాయి.

పదవులు వస్తుంటాయి. పోతుంటాయి. పదవులు ఉన్నప్పుడు ఎంతమందికి దగ్గరయ్యారన్నదే చరిత్ర గుర్తుంచుకుంటుంది. ఆవిధంగా చరిత్ర వైఎస్‌ను ఒకరకంగా గుర్తుంచుకుంటే, కేసీఆర్‌ను ఇంకోరకంగా గుర్తుంచుకుంటుంది. ఒక వ్యక్తి ఒక పదవిలో కూర్చున్నాడంటే.. అప్పటి నుంచే మాజీగా మారేందుకు, మానసికంగా సిద్ధంగా ఉండాలన్న తత్వం తెలియకనే.. తమ చుట్టూ కంచెలు కట్టుకుంటారని మాజీల ఉవాచ.

దీనికి కారణం.. నాయకులు, వ్యక్తుల గురించి అవగాహన లేని వారిని తమ చుట్టూ నియమించుకోవడమే. సీఎం అపాయింట్‌మెంట్ వ్యవస్థ చాలా కీలకం. అది ముఖ్యమంత్రుల ఇమేజీని నిర్దేశిస్తుంది. ఎవరు ప్రముఖులు? ఎవరు ప్రాధాన్యం ఉన్న నాయకులు? ప్రజల్లో ఎవరికి ఎంత ఇమేజ్ ఉందన్న అంశాలను సీఎంల పక్కన ఉండే వ్యక్తులు నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది.

అందుకు బదులు.. పూర్వాశ్రమంలో తమ దగ్గర పనిచేశారన్న కారణాలతోనో, తమ బంధువున్న కోణంలోనే నియమించుకుంటే.. ఇలాంటి అప్రతిష్ఠ మూటకట్టుకోవలసి వస్తుందన్నది అనుభవజ్ఞుల అభిప్రాయం.

LEAVE A RESPONSE