– పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి బడ్జెట్ లో 10 శాతం నిధులు కేటాయించాలి
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
కర్నూలు : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజల ప్రాణ, మానాలకు రక్షణ కరువు అయిందని, రాష్ట్ర బడ్జెట్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాడానికి మొత్తం బడ్జెట్లో 10శాతం నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. సోమవారం సీఆర్ భవన్లో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. డిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటలో సుమారు 18 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయాలపాలైనారన్నారు. కుంభమేళలో ఇప్పటి వరకు 30మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించినట్లు తెలిపారు.
ప్రమాదాలు జరిగినపుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, 144 సం ఒకసారి వస్తుందని కుంభమేళపై కేంద్రము, ఇటు ఆ రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రమాదాలు జరిగినపుడు ప్రభుత్వం సహాయకచర్యలు చేపట్టడం లాంటి చర్యలు తీసుకోకపోవడం గతంలో ఎన్నడూ లేదన్నారు. అమెరికా అక్రమ చొరబాటు దారులంటూ మనదేశానికి చెందిన చాలా మందిని సైనిక విమానాల్లో కాళ్ళకు, చేతికి బేడీలు వేసి విమానాల్లో కుక్కి తరలించడం దారుణమన్నారు. పారిపోవడానికి వీలులేని విమానాల్లో బేడీలు వేయవలసిన అవసరమేమిటని ప్రశ్నించారు.
మోడీ- ట్రంప్ తో మాట్లాడారని ప్రచారం చేస్తున్న పాలకులు ఇటువంటి సంఘటనలపై మోడీ ఎందుకు ట్రంప్ను ప్రశ్నించలేదన్నారు. బీజేపీ పాలనలో ప్రజల మానాలకు, ప్రాణాలకు విలువ లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నరేంద్రమోడీ ఎవరికి కోసం పనిచేస్తున్నారన్నారు. ఆదాని, అంబాని కోసం పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. ఆదానిని కేసు నుండి బయట పడవేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం, నరేంద్రమోడీ సిగ్గుపడాలని, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏ ప్రభుత్వం నిసిగ్గుగా, నిర్లజ్జగా పనిచేయలేదన్నారు.
ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు హెడ్ అపీసును కడప నుండి అమరావతికి మార్చాలని నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. విశాఖలో ఉన్న క్రిష్ణా బోర్డులను వెంటనే కర్నూలుకు మార్చాలని కోరారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతామంటే కోర్టులో పిల్ వేయడం దారుణమన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తిచేయాలని, బడ్జెట్లో 10శాతం ప్రాజెక్టులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు, ఎన్ లెనిన్బాబు, జిల్లా సహాయకార్యదర్శి ఎస్ మునెప్ప, జిల్లా కార్యవర్గ రామకృష్ణారెడ్డి, నగర సహాయ కార్యదర్శులు చంద్రశేఖర్, మహేష్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు.