డిమాండ్లు సాధించే వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదు

Spread the love

– పీఆర్సీ సాధన సమితి

వెలగపూడి సచివాలయం,: ప్రభుత్వ పెద్దలు తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని పీఆర్సీ సాధన సమితి నేతలు కోరారు. తమ డిమాండ్ల సాధన కోసమే మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. డిమాండ్లు సాధించుకునేవరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ప్రభుత్వంతో చర్చలకు వెళ్లకూడదని పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. జీవోలు రద్దు చేసే వరకు చర్చలకు వెళ్లకూడదని భేటీలో నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ ఎన్జీవో హోంలో పీఆర్సీ సాధన సమితి నేతలు భేటీ అయిన నేతలు మంత్రుల కమిటీ ఆహ్వానంపై చర్చలకు వెళ్లాలా లేదా అన్న అంశంపై స్టీరింగ్ కమిటీ నేతలు చర్చించారు. అనంతరం మీడియాతో ఉద్యోగ సంఘ నేతలు మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వాన్ని నమ్మి తాము చాలాసార్లు చర్చలు జరిపామని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఉద్యమాన్ని చేయించారని గుర్తు చేశారు. ప్రభుత్వం చెప్పిందొకటి.. చేసింది మరొకటని విమర్శించారు. మాలో ఎన్ని ఉన్నా.. ఉద్యోగ సంఘాలన్నీ ఏకమయ్యాయని స్పష్టం చేశారు. నిరసన వ్యక్తం చేస్తుంటే శత్రువులు మాదిరిగా చూస్తున్నారని అన్నారు. 27 శాతం ఐఆర్‌ ప్రకటించి 23 శాతానికి చేస్తే తగ్గించినట్లు కాదా? అని ప్రశ్నించారు. న్యాయబద్ధమైన పోరాటమని ప్రజలు నమ్ముతున్నారని స్పష్టం చేశారు. జీవోలన్నీ విడుదల చేశాక మంత్రుల కమిటీ వేస్తారా? అని ప్రభుత్వాని నిలదీశారు. తమ ఉద్యమానికి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు.

తీవ్రంగా నష్టపోతాం : వెంకట్రామిరెడ్డి
ఉమ్మడి నిరసనలో ఇప్పటివరకు నేను పాల్గొనలేదు. పీఆర్సీతో మొదటిసారి జీతం తగ్గే పరిస్థితి వచ్చింది.ప్రభుత్వం పునఃసమీక్ష చేసేలా ఒత్తిడి తీసుకురావాలి. మునిగినా తేలినా సరే అనుకుని సమ్మెకు నిర్ణయం. ఉద్యోగుల కడుపు మండేలా జీవోలు తయారుచేశారు. ఇప్పుడు పోరాడకపోతే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారు. ఆత్మగౌరవం కోసం ఉద్యమంలోకి వచ్చి పోరాడుతున్నాం.

సీఎం తాయిలాలకు మేం మురిసిపోలేదు : బండి శ్రీనివాస్
అన్ని జిల్లాల్లో ఉద్యమం విజయవంతమవుతోందని ఉద్యోగ సంఘ నేత బండి శ్రీనివాస్‌ వెల్లడించారు. ఉద్యోగులు ఎక్కడికక్కడ నిరసన తెలిపారని, ప్రభుత్వ పెద్దలు తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ ఎక్కువగా ఉండాలని చెప్పామని స్పష్టం చేశారు. సీఎం ఇచ్చిన తాయిలాలకు తాము మమురిసిపోలేదని వ్యాఖ్యానించారు. తమపై కొందరు తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు.

“పలుచోట్ల ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పీఆర్సీతో ఉద్యోగులు కడుపుమండే మాట్లాడుతున్నారు. మా డిమాండ్ల సాధన కోసమే మాట్లాడుతున్నాం. ఒకటి అనవద్దు..రెండు అనిపించుకోవద్దు. ఉద్యోగులు శాంతియుతంగా ఉద్యమం చేయాలి. డిమాండ్లు సాధించుకునేవరకు విరమించే ప్రసక్తే లేదు.

మంత్రుల కమిటీ నిరసన లేఖ
మరోవైపు ఉద్యోగ సంఘాలతో చర్చించడానికి మంత్రుల కమిటీ సచివాలయానికి చేరుకుంది. మంత్రులు బుగ్గన, పేర్ని నాని, సజ్జల, అధికారులు ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు వస్తారని నిరీక్షించారు. అయితే ప్రభుత్వంతో చర్చలకు వెళ్లమని స్పష్టం చేసిన ఉద్యోగ సంఘ నేతలు.. తమ తరపున ప్రతినిధులను పంపారు. మంత్రుల కమిటీకి నిరసన లేఖ ఇచ్చారు. పీఆర్సీ సాధన సమితి తరఫున స్టీరింగ్ కమిటీలోని ఆస్కార్‌రావు, వై.వి.రావు, రాజేష్, హృదయరాజు, శివారెడ్డి లేఖను మంత్రుల కమిటీకి అందజేశారు. అశుతోష్ మిశ్ర కమిటీ నివేదిక బహిర్గతం చేయాలని లేఖలో డిమాండ్‌ చేశారు. పీఆర్సీ జీవోలను నిలుపుదల చేయాలన్నారు. జనవరి నెలకు మునుపటి వేతనాలు చెల్లించాలని ప్రస్తావించారు. మూడు అంశాలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. పరిష్కారమైతేనే చర్చలకు సిద్ధమని లేఖలో స్టీరింగ్ కమిటీ స్పష్టం చేసింది.

Leave a Reply