విద్యార్థుల భోజనం విషయంలో రాజీ లేదు

– మెనూ అమలు లేకుంటే సహించేది లేదు
– ప్రతి పాఠశాల పై పర్యవేక్షణ ఉండాలి
– పెండింగ్ బిల్లులు పెట్టండి.. మంజూరు చేయిస్తాం
– అధికారులతో విద్యాశాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలలో అందిస్తున్న భోజనం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని, ఎక్కడైనా మెనూ సక్రమంగా అమలు కావడం లేదని ఫిర్యాదు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి అధికారులతో మాట్లాడారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్ష ఎస్పీడి వెట్రిసెల్వితో పాటు ఆదర్శ పాఠశాల, కేజీబివి సెక్రటరీ లు, అన్ని జిల్లాల డీఈఓ లు, ఏపీసీ లు, ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ… విద్యార్థినీ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ఇటీవల కొన్నిచోట్ల వస్తున్న ఫిర్యాదులు ఉన్నతాధికారులు పరిశీలించి నివేదిక అందించాలని కోరారు. భోజనం బిల్లులు రాలేదని చెప్పడం సరే వాటిని సకాలంలో పోర్టల్ లో ఎందుకు పొందుపరచలేక పోయారని ప్రశ్నించారు. అన్ని జిల్లాల్లో రావలసిన బకాయిలు వివరాలను వెంటనే పోర్టర్లో పొందుపరిచి నివేదిక ఇవ్వాలని త్వరలోనే వాటిని మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రకాశం జిల్లా దర్శి, కడప జిల్లా కాజీపేట పాఠశాలల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి ఏపీసి వారంలో నాలుగురోజులు క్షేత్రస్థాయికి వెళ్లి వారి పరిధిలోని పాఠశాలలను తనిఖీ చేయాలని, ఆదర్శ పాఠశాలల్లో కూడా మెనూను అధికారులు పరిశీలించాలని చెప్పారు. పాఠశాలల్లో ఉన్న మొబైల్ యాప్ తరహాలో కేజీబివి, ఆదర్శ పాఠశాలల్లో కూడా యాప్ ద్వారా పర్యవేక్షణ జరగాలన్నారు.
నీటి ట్యాంక్ ల పరిశుభ్రత పై ద్రుష్టి సారించాలని, ఆర్ ఓ ప్లాంట్ లపై పర్యవేక్షణ ఉండాలన్నారు. కొన్ని చోట్ల టీచర్ల మధ్య అంతర్గత విభేదాలతో అసత్య కథనాలు బయటకు వస్తున్నాయని ఇటువంటి వివాదాలకు కారణమైన టీచర్ల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు జరుగుతున్న విద్యా పథకాలు కొంతమంది అంతర్గత కలహాల కారణంగా అబాసుపాలు కావడాన్ని సహించేది లేదన్నారు. ఏపీ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ల పర్యవేక్షణకు అధికారులతో ప్రత్యేక కమిటీని త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు.

Leave a Reply