Suryaa.co.in

Andhra Pradesh

సంక్షేమంపై సందేహం అవసరం లేదు

  • ఒక్కొక్కటిగా అమలు చేయనున్న సీఎం
  • ఇప్పటికే పెంచిన పింఛన్ల మొత్తం లబ్ధిదారులకు పంపిణీ అందజేస్తున్న కూటమి ప్రభుత్వం
  • ఇక దీపావళి నుంచి మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు
  • త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం
  • ఇందు కోసం 1480 బస్సుల కొనుగోలు చేయనున్న ప్రభుత్వం
  • భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి “అల్లూరి ” పేరు సూపర్‌
  • ఈ నిర్ణయాన్ని తీసుకున్న సీఎంకి హృదయపూర్వక ధన్యవాదాలు
  • రూ. 99 కే అందుబాటులో బ్రాండెడ్ క్వార్టర్ మద్యం సీసా
  • అమ్మ ఒడి పేరుతో 13 వేలు ఇచ్చి… నాన్న బుడ్డి పేరుతో జగన్‌ సర్కార్‌ దోచుకుంది
  • ఒక్కొక్క కుటుంబానికి ఎంత నష్టమో… లెక్కల తో సహా నేను ఎన్నోసార్లు వివరించా….
  • రూ.100 క్వార్టర్ సీసా లభించడంతో ఏటా మద్యం సేవించే వారి కుటుంబానికి 36, 500 ఆదా…
  • నేరుగా చంద్రబాబు నాయుడు ఆ కుటుంబాలకు లబ్ధి చేకూర్చినట్టే…
  • జగన్మోహన్ రెడ్డి లాగా నేరుగా నగదు ఇచ్చి లాగేయాల్సినక్కర లేదు…
  • లాగేయడం మానేస్తే కూడా ఇచ్చినట్టేనని ప్రజలు గ్రహించాలి
  • ఒక చెడును ప్రోత్సహిస్తూ మంచి చేస్తున్నానని గతంలో సిగ్గు లేకుండా చెప్పుకున్న జగన్‌
  • 100 రోజుల్లోగా 3 పథకాల అమలుకు రూట్ మ్యాప్
  • ఎన్నో మంచి పనులు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉండాలి
  • వరదల్లో నష్టపోయిన వారికి గతంలో ఏ ప్రభుత్వం కూడా రూ. 25 వేలు ఇచ్చిన దాఖలాలు లేవు
  • తిరుమలను వాణిజ్య కేంద్రంగా మార్చిన గత ప్రభుత్వం…
  • ఇప్పుడు మళ్ళీ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదే
  • వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం
  • ఉండి శాసన సభ్యుడు రఘురామకృష్ణంరాజు జోస్యం

ఉండి: కూటమి ప్రభుత్వ హయాంలో ఒకటి తరవాత ఒకటి అన్ని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తారనడంలో ప్రజలు సందేహా పడాల్సిన అవసరం లేదని ఉండి శాసన సభ్యుడు రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని పెంచి లబ్ధిదారులకు అందజేశారు. దీపావళి నుంచి మహిళలకు మూడు ఉచిత సిలిండర్లను అందజేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ఆర్థిక ఇబ్బందులెన్ని ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన విషయం తెలిసిందేనని గుర్తు చేశారు. అయినా అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్య, వితంతు పింఛన్ల మొత్తం నాలుగు వేల రూపాయలకు, వికలాంగులకు 6000 రూపాయల చొప్పున పెంచి అందజేస్తున్నారన్నారు. ఉండి నియోజకవర్గ కేంద్రంలో రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…

త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కూడా అమలు చేసేందుకు సన్నాహాలను చేస్తున్నారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయడానికి వీలుగా అదనంగా 1480 బస్సులను కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, ఆర్డర్ చేసిందన్నారు. ప్రస్తుత ప్రయాణికుల అవసరాలకు ఇబ్బంది లేకుండా, పెరుగనున్న రద్దీని తట్టుకోవడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అదనపు బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా ఒక్కొక్క పథకాన్ని చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నప్పటికీ, ఊరికే మాట్లాడేవారు అదేది… ఇదేదని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.

హామీల అమలుకు జగన్‌కు మూడేళ్ళు పట్టింది…

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మూడేళ్ళ సమయం పట్టిందని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి తరహాలో కాకుండా, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు వృద్ధాప్య, వితంతు పింఛన్లను 3000 నుంచి 4 వేల రూపాయలకు పెంచి అందజేశారన్నారు. అలాగే 50% అంగవైకల్యం కలిగిన వారికి కూడా వికలాంగుల పింఛన్లను ఆరువేల రూపాయలకు పెంచి ఇవ్వడం జరుగుతుందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగినప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అభినందించకపోగా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో చేసిన విధ్వంసానికి అన్ని తొలి రోజు నుంచే ప్రారంభించాలంటే ఎలా సాధ్యపడుతుందని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

మహిళలకు ఉచితంగా మూడు సిలిండర్ల పథకాన్ని దీపావళి నుంచి అమలు చేస్తామని ప్రకటించగానే వైకాపా నాయకుల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టు అయిందన్నారు. ఇక ఒక్కొక్కటిగా అన్ని అమలు చేస్తారేమో నన్న భయం వారికి పట్టుకుందన్నారు. సంక్షేమ పథకాలన్నింటినీ ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆచరణలో పెడుతుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అందులో ఎటువంటి సందేహం ఎవరికి అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

భోగాపురానికి ఆ మహావీరుడి పేరు పెట్టాలనుకోవడం అభినందనీయం

స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు నడియాడిన ప్రాంతంలో నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పెట్టాలనుకోవడం అభినందనీయమని రఘురామ కృష్ణంరాజు అన్నారు. అల్లూరి సీతారామరాజు పుట్టింది మా జిల్లాలోనేనని, ఆయన స్వగ్రామం మొగళ్లు ఉండి నియోజకవర్గ పరిధిలో ఉంటుందన్నారు. అల్లూరి సీతారామరాజు తల్లి గారి జన్మస్థలం విజయనగరం జిల్లా పాండ్రంగి అనే గ్రామమని, ఆ గ్రామానికి సమీపంలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

ఒక క్షత్రియుడు గా నేను ఈ మాటలు మాట్లాడడం లేదని, ఒక స్వాతంత్ర సమరయోధుడికి దక్కాల్సిన గౌరవం దక్కినందుకు హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తున్నానన్నారు. అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర పోరాటాన్ని గౌరవించి ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మా ఊరికి వచ్చి ఆవిష్కరించారని గుర్తు చేశారు. అటువంటి మహా నాయకుడు పేరును, ఆయన నడియాడిన ప్రాంతంలో నిర్మిస్తున్న విమానాశ్రయానికి పెట్టడం ముదాహమని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటాన్ని కొనసాగించింది పూర్వపు విశాఖ జిల్లాలోనే నని, అప్పుడు విజయనగరం జిల్లా లేదని, ఇప్పుడున్న విజయనగరం, అల్లూరి, మన్యం జిల్లాలు అందులో భాగమేనని గుర్తు చేశారు.

నేరుగా చంద్రబాబు నాయుడు లబ్ధి చేకూర్చినట్టే

మద్యపాన ప్రియుల కుటుంబాలకు ఏడాదికి 36,500 రూపాయలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా లబ్ధి చేకూర్చినట్టేనని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. గత ప్రభుత్వ హయాంలో నాసిరకమైన మద్యం ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, మద్యపాన ప్రియులను ఎలా దోచుకున్నారో రచ్చబండ కార్యక్రమం ద్వారా 100సార్లకు పైగానే మాట్లాడి ఉంటానని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నాసిరకమైన మద్యం క్వార్టర్ సీసాకు 200 నుంచి 220 రూపాయలను వసూలు చేసేవారు. ఈ సరుకును ఒక్కరోజు కూడా నిల్వ ఉంచేవారు కాదు.

చీప్ లిక్కర్ అయిన నాలుగు నుంచి ఐదు రోజుల పాటు నిల్వ ఉంచాలని, కానీ గత ప్రభుత్వ హయాంలో నిల్వ ఉంచకుండానే విక్రయించేవారు. వేడివేడి భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిది కానీ తయారుచేసిన మద్యాన్ని వెంటనే సేవిస్తే అనారోగ్యం పాలు కావడం ఖాయం. ఆల్కహాల్ అన్నది లేకుండానే పూర్తిగా నానా రకమైన చెత్తను కలిపి విక్రయించి ప్రజల్ని వ్యాధిగ్రస్తులను, రుణగ్రస్తులను గత ప్రభుత్వ హయాంలో చేశారని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. అమ్మ ఒడి పేరుతో 13 వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పి, నాన్న బుడ్డి పేరుతో జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల రూపంలో ఇస్తున్న నగదు కంటే, మద్యం ద్వారా ఒక్కొక్క కుటుంబం నుంచి ఎంత మొత్తాన్ని దోచుకుంటున్నారో లెక్కలతో సహా వివరించానని గుర్తు చేశారు. ఈ విషయాన్ని నేను చెప్పే వరకు ఎవరు కూడా మాట్లాడిన దాఖలాలు లేవని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం విధానంలో భాగంగా 99 రూపాయలకే బ్రాండెడ్ క్వార్టర్ మద్యం సీసాను విక్రయించాలని నిర్ణయించింది. ఈ మద్యం సీసాను కచ్చితంగా ఐదు రోజులపాటు నిల్వ ఉంచిన తర్వాతే మద్యపాన ప్రియులకు విక్రయించడం జరుగుతుందన్నారు. ఉత్పత్తి అయిన తర్వాత మద్యం సీసాలను నిల్వ ఉంచడానికి పెద్దగా ఖర్చేమీ కాకపోయినప్పటికీ, గత ప్రభుత్వ హయాంలో మాత్రం నిల్వ చేయకుండానే నేరుగా విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వారని రఘురామకృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బ్రాండెడ్ మద్యం క్వార్టర్ సీసా 99 రూపాయలకు విక్రయించిన ఉత్పత్తిదారుడికి లాభమే వస్తుందని, రాష్ట్రానికి కూడా ఆదాయం ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నగదుకు మద్యాన్ని విక్రయించడం వల్ల రకరకాల మార్గాల ద్వారా ఆదాయం పక్కదారి పట్టిందన్నారు. చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన పరిపాలనలో మద్యం ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం, గత ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంతో సరి సమానంగానే ఉంటుందన్నారు.

ప్రతిరోజు క్వార్టర్ సేవించే వారి కుటుంబాలకు నేరుగా లబ్ధి

ప్రతిరోజు క్వార్టర్ మద్యం సేవించే వారి కుటుంబాలకు నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా నేరుగా లబ్ధి చేకూరనుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. నాణ్యమైన క్వార్టర్ మద్యాన్ని సేవించడం ద్వారా ఒక వైపు మద్యపాన ప్రియులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే, గతంలో మద్యంపై ఖర్చు చేసిన మొత్తంలో సగానికి పైగానే ఆదా చేసుకోవచ్చు నన్నారు. క్వార్టర్ మద్యానికి ప్రతిరోజు 100 రూపాయలు ఖర్చు చేయడం ద్వారా, మద్యపాన ప్రియులు గతంతో పోలిస్తే 36,500 రూపాయలను ఆదా చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఈ మొత్తాన్ని ఒక విధంగా మద్యపాన ప్రియుల కుటుంబాలకు నారా చంద్రబాబు నాయుడు నేరుగా లబ్ధి చేకూర్చినట్టేనని రఘురామకృష్ణం రాజు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మాదిరిగా నగదు ఇచ్చి వెనక్కి లాగేయనక్కర్లేదని, లాగేయడం మానేస్తే కూడా అది లబ్ధి చేకూర్చినట్టే అవుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని రఘురామకృష్ణం రాజు కోరారు.

గతంలో సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ప్రజలు మద్యం తాగాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా చెప్పుకున్నారని గుర్తు చేశారు. మద్యపాన ప్రియులు సేవించడం ద్వారా లభించనున్న భవిష్యత్తు ఆదాయంపై కూడా అప్పులు చేసి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నానని చెప్పుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి కే దక్కిందని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ఒక చెడును ప్రోత్సహిస్తూ, మంచి చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి సిగ్గులేకుండా చెప్పుకున్నారని మండిపడ్డారు.

గత ప్రభుత్వ హయాంలో మద్యపానాన్ని ప్రోత్సహించినట్లుగా కూటమి ప్రభుత్వం ప్రోత్సహించడం లేదు. మీరు మద్యాన్ని సేవిస్తేనే ఆదాయం లభిస్తుందని ఎక్కడా చెప్పడం లేదు. నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తూ, పరిమితంగా తాగాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనలను చేస్తోందన్నారు. మద్యం ద్వారా ఏడాదికి ప్రతి కుటుంబానికి 36,500 రూపాయలు ఆదాచేశారంటే, ఆ మొత్తాన్ని నేరుగా చంద్రబాబు నాయుడు ఇచ్చినట్లుగానే భావించాల్సిన అవసరం ఉన్నదన్నది నా భావన అని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ విషయాన్ని మెజారిటీ ప్రజలు అర్థం చేసుకోవాలన్న ఆయన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని నేరుగా తమ జేబులలోకి వచ్చింది ఎంత అన్నది కాకుండా, తమకు మిగిలింది ఎంత అన్నదానిపై దృష్టి సారించాలని కోరారు.

వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంతో చేసింది

100 రోజుల పాలనలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్ల మొత్తాన్ని పెంచి అందజేశారని గుర్తు చేశారు. ఇక దీపావళి నుంచి మహిళలకు మూడు ఉచిత సిలిండర్లను అందజేసేందుకు రూట్ మ్యాప్ ప్రకటించారని, త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని తెలిపారు. అలాగే భూముల రీ సర్వే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారని పేర్కొన్నారు. ప్రజలకు ఎంతో మంచి చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఇవ్వబడినబడిగా ఉండాలని ఆకాంక్షించారు.

వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడ్డారో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చక్కగా వివరించారన్నారు. వంద రోజుల పాలన సందర్భంగా ఎన్ డి ఏ భాగస్వామ్య పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో పవన్ కల్యాణ్‌ ప్రసంగించారని, ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు శ్రమించిన తీరును కొనియాడారని పేర్కొన్నారు. వరదల సమయంలో ఎన్నో గంటలపాటు శ్రమించి చంద్రబాబు నాయుడు ఒక మార్గదర్శిలా దగ్గర నుంచి అన్ని పనులను చక్కబెట్టారన్నారు. దూరం నుంచి ఇతరులకు ఆదేశాలు జారీ చేయకుండా, అన్నీ తానై సంఘటన స్థలంలో ఉండి పర్యవేక్షించారని తెలిపారు. వరద బాధిత ప్రాంతాల ప్రజలలో ఒక భరోసా కల్పించారన్నారు.

ఈ ఉపద్రవాన్ని వారు తట్టుకునేలా చేశారని రఘురామకృష్ణంరాజు కొనియాడారు. వరద బాధిత ప్రాంతాల ప్రజలకు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. వరదల్లో వాహనాలు దెబ్బతిన్న వారికి స్వాంతన చేకూరే విధంగా ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని వరద నష్టం కింద మూడు వేల కోట్ల రూపాయలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్న రఘురామకృష్ణంరాజు, వాళ్లు కాస్తో కూస్తో తగ్గించి ఇచ్చిన వరద ప్రాంతాల ప్రజలను మరింతగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను తీసుకుంటుందన్నారు.

బుడమేరు విస్తరణ, ఉప్పుటేరులో తూడు తీయడం, కొల్లేరులో ఆక్రమణలను సరి చేసే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తీసుకురానున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రస్థాయిలో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయగా, ఉండి నియోజకవర్గస్థాయిలో నేనిచ్చిన హామీల అమలుకు కృషి చేయడం జరిగిందన్నారు. తిరుమలను గత ప్రభుత్వం వాణిజ్య కేంద్రంగా మార్చిందని , కూటమి ప్రభుత్వం తిరిగి దాన్ని మళ్ళీ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలని కోరారు. వైకాపా త్వరలోనే ఖాళీ కావడం ఖాయమని, కాంగ్రెస్ పార్టీ స్థితిలోకి వైకాపా చేరుకోనుండగా, రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు ఉన్నాయన్నారు.

కాలువల, డ్రైన్ల పై ఆక్రమణలను తొలగించాం…

ఉండి నియోజకవర్గ పరిధిలో కాలువలు, డ్రైన్లు, రోడ్ల ఆక్రమణను అరికట్టి గత వంద రోజులలో క్రమబద్ధీకరించేందుకు కృషి చేసినట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అలాగే ప్రతి హ్యాబిటేషన్ కు డిసెంబర్ నాటికి తాగునీరు అందించే విధంగా చర్యలను తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ఉండి, పాలకోడేరు ప్రభుత్వ పాఠశాలను దాదాపుగా 80 లక్షల రూపాయలు వెచ్చించి పునర్ నిర్మించినట్లుగా వెల్లడించారు.

ఉండిలో ఆక్రమణకు గురై పిచ్చి మొక్కలు పెరిగి ఉన్న పార్కును స్థానికుల సహకారంతో ఆక్రమణలను తొలగించి, 40 రోజుల వ్యవధిలోను సుందరమైన పార్కుగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే జిల్లా కలెక్టర్ తో సమావేశమై సాగునీరు, తాగునీరు, డ్రైన్ల సమస్య చాలా తీవ్రంగా ఉందని, ఈ సమస్యలను పరిష్కరిస్తే రైతులతోపాటు ఆక్వా రైతులు, సాధారణ ప్రజలు సంతోషిస్తారని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. అయితే ఈ సమస్యల పరిష్కారానికి తాము ఏమీ చేయలేమని జిల్లా యంత్రాంగం పేర్కొన్నామన్నారు.

గతంలో ఉమ్మడి జిల్లాకు ఐదు కోట్ల రూపాయల కేటాయించినట్లుగా వివరించారని తెలిపారు. అయితే ఈ సమస్యల పరిష్కారానికి సహకరించడంతోపాటు, తాము సొంతంగా పనులు చేసుకోవడానికి క్లియరెన్స్ ఇవ్వాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని కోరడం జరిగిందన్నారు. డ్రైనేజీ పనులను చేపట్టడానికి కలెక్టర్ తన ప్రత్యేక నిధులనుంచి పది లక్షల రూపాయలు కేటాయించారని, నేను వ్యక్తిగతంగా 10 లక్షల రూపాయలు, నా స్నేహితులతో మాట్లాడి ఇప్పటివరకు ఖర్చైనా నాలుగు కోట్ల రూపాయలను సేకరించడం జరిగిందన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలో కాలువలను వెడల్పు చేయడంతో పాటు కొన్ని చోట్ల డ్రైన్ల పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇంతలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి డ్రైన్ల పనులను చేపడతామని పేర్కొన్నారన్నారు.

కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదని వెల్లడించారు.. రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఉండకపోతే, ఈపాటికి డ్రైన్లలలో కూడా పూడికతీత చేపట్టి ఉండే వాళ్లమని రఘురామకృష్ణం రాజు తెలిపారు. డ్రైన్ల పునరుద్ధరణ పనులను పర్యవేక్షించడానికి లబ్ధిదారులైన రైతులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు సూచించినట్లుగా రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. డ్రైన్ల పూడికతీత పనులు కాంట్రాక్టర్ సక్రమంగా చేపట్టకపోతే, లబ్ధిదారులైన 10 గ్రామాల రైతులు కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తారని, టెండర్ లో పేర్కొన్న విధంగా పనులు చేపట్టిన తర్వాతే బిల్లులు ఇవ్వాలని సూచించడం జరిగిందన్నారు. టెండర్ పిలిచిన ఖర్చులు 50% మొత్తానికే పనులు పూర్తవుతాయని, అయితే బలవంతంగా పనులు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. టెండర్ లో పేర్కొన్నట్లుగా కాంట్రాక్టర్ తన పనిని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు.

పంట కాలువలను క్లీన్ చేశాం… డ్రైన్లలో పూడిక తీశాం

పంట కాలువలను క్లీన్ చేశామని, డ్రైన్లలో కొన్నిచోట్ల పూడిక తీశామని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ప్రభుత్వం డ్రైన్లలో పూడిక తీసేందుకు ముందుకు వస్తే రైతులను ఇన్వాల్వ్ చేసి వాటిని పూర్తి చేస్తామన్నారు. పరిమళ వద్ద మంచినీటి ప్రాజెక్టును గతంలో 19 కోట్ల రూపాయల అంచనా తో ప్రారంభించి 18 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. అయితే ఈ ప్రాజెక్టును రాంగ్ గా డిజైన్ చేయడం జరిగిందని, కాలువలలో పైప్ లైన్ వేశారన్నారు. దీనికి తోడు కమిషన్ల కోసం సమస్య ఎదురై, ఈ ప్రాజెక్టు మూలన పడిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తాగునీటి ప్రాజెక్టు కోసం 60 లక్షలు మంజూరైనప్పటికీ వాటిని విడుదల చేయడం లేదని వెల్లడించారు.

ఒక కోటి రూపాయలు ఖర్చు చేస్తే, ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని 60 లక్షల రూపాయల పోను 40 లక్షల రూపాయలను ఉండి నియోజకవర్గ అభివృద్ధి ఫండ్ నుంచి ఖర్చు చేయాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. అందుకే పరిమళ తాగునీటి ప్రాజెక్టు పనులను వెంటనే చేపట్టడం జరిగిందని వివరించారు. పరిమళ వద్ద కీకారణ్యమైన పరిస్థితి నెలకొనగా, దాన్ని శుభ్రపరిచి, కాలిపోయిన మోటార్ల స్థానంలో కొత్త మోటార్లను బిగించి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. పరిమళ వాటర్ లైన్ ట్రయల్ ప్రారంభించగా కాలువలలో పనులు చేసేటప్పుడు పైపులైన్లను పీకి వేయడం వల్ల కొత్త సమస్య ఏర్పడిందన్నారు. పైప్ లైన్లు లేని చోట నూతన పైప్ లైన్లను బిగించి, ట్రయల్ నిర్వహించడం జరిగిందని తెలిపారు.

మరో నెల రోజుల వ్యవధిలో ప్రాజెక్టును అప్పగిస్తానని కాంట్రాక్టర్ పేర్కొన్నారని, నెల రోజులు కాకపోతే 45 రోజులలోనైనా పరిమళ వాటర్ లైన్ పూర్తవుతుందన్నారు. డిసెంబర్ నాటికి 50 హ్యాబిటేషన్లకు తాగునీరు అందిస్తామని రఘురామకృష్ణం రాజు తెలిపారు. కాళ్ల మండలంలో గుండాడ దగ్గర ఉన్న ప్లాంట్ ను కేవలం 30 శాతం మాత్రమే వినియోగిస్తున్నారని, మిగిలిన సామర్థ్యాన్ని ఉపయోగించడం లేదన్నారు. చెరువులో నీటిని నింపుకుంటే వేసవిలోనూ తాగునీటి కొరత ఉండదన్నారు. జల జీవన్ మిషన్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రతి ఇంటికి మంచినీరు అందించడం జరుగుతుందన్నారు.

తుగ్లక్ పని చేసిన గత ప్రభుత్వం

మంచినీటి పైప్లైన్ పనులను చేపట్టడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాక పోవడంతో గత ప్రభుత్వం ఒక తుగ్లక్ పని చేసిందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. 18 కోట్ల రూపాయల అంచనాలతో కూడిన పైప్లైన్ పనులను డ్వాక్రా గ్రూపులకు అప్పగించామన్నారు. డ్వాక్రా గ్రూపుల మహిళలు సాధారణంగా కుట్లు అల్లికల వంటి పనులు మాత్రమే చేపడతారని, ఈ ఐడియా ఇచ్చిన వారిని తన్నాలన్నారు. డ్వాక్రా మహిళలతో బుద్ధున్న వారెవరైనా 18 కోట్ల రూపాయల పైప్ లైన్ పనులు చేయిస్తారా అంటూ ప్రశ్నించారు. ఇదే విషయమై పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆఫీసులోని అసిస్టెంట్ కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని, పవన్ కళ్యాణ్ కు కూడా వినతి పత్రాన్ని ఇచ్చినట్లుగా తెలిపారు.

రెండు రోజుల వ్యవధిలో ఇదే విషయమై పవన్ కల్యాణ్‌ తో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. పైప్లైన్ పనులను కాంట్రాక్టర్ కు ఇస్తే, వాటిని పర్యవేక్షిస్తూ సకాలంలో పూర్తి చేయించడం జరుగుతుందన్నారు. కాళ్ళ, పాలకోడేరు మండలాలకు మంచినీటి సరఫరా కోసం ఒక ప్రణాళికను చేపడుతున్నట్లుగా వివరించారు. 18.5 కోట్లతో పైప్ లైన్ చేపట్టే పనులను మంత్రి పవన్ కళ్యాణ్ ఆమోదిస్తే, కచ్చితంగా ఆమోదిస్తారన్న విశ్వాసం నాకు ఉందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో 200 రోజులు అయ్యేటప్పటికీ, మంచినీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని తెలిపారు.

కాలువలను ఆక్రమించిన వారిలో 90 శాతం మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు

కాలువలను ఆక్రమించి ఇళ్లను నిర్మించుకున్న వారిలో 90 శాతం మందికి ఇప్పటికే ఇళ్ల స్థలాలను ఇచ్చారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఆకివీడులో పంట కాలువ 12 అడుగులు ఉంటే దాన్ని రెండు నుంచి రెండున్నర అడుగులకు ఆక్రమణదారులు కుదించారన్నారు. పంట కాలువ పై 50 నుంచి 60 ఇళ్లను నిర్మించి, దాన్ని డ్రైన్ గా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రై ను పూర్తిగా కప్పెట్టేసి, దానిపై స్లాబ్ నిర్మించి ఇళ్లను కట్టుకున్నారన్నారు. బుడమేరు లాంటి పరిస్థితి తలెత్తకముందే మేల్కొని పంట కాలువలను, డ్రైన్ల ఆక్రమణలను తొలగించారన్నారు. పంట కాలువలపై ఆక్రమణలను తొలగించాలని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. పంట కాలువలు, డ్రైన్లపై ఇండ్లను నిర్మించుకున్న వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక చేయూత అందే విధంగా కృషి చేయనున్నట్టు వెల్లడించారు.

నాడు నేడు పూర్తిగా ఫ్రాడ్

నాడు నేడు కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పూర్తి అవినీతిమయమని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ఐదవ తరగతి వరకు ఉన్న స్కూళ్లలో కేవలం ఒక తరగతి గదిలో బల్లాలను, బెంచీలను ఏర్పాటు చేసి, వైసీపీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం ఉండి నియోజకవర్గ పరిధిలోని ఏ స్కూల్లో నాడు నేడులో భాగంగా ఏర్పాటుచేసిన బెంచీలు, బల్లాలు కనిపించడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం పెరగాలంటే కాస్ట్ టు కాస్ట్ తో రవాణా సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు. ఇదే విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు.

LEAVE A RESPONSE