Suryaa.co.in

Telangana

గవర్నర్ ప్రసంగంలో దశ లేదు, దిశ లేదు

– గవర్నర్లు మారారు తప్ప ప్రసంగం మారలేదు
– సీఎం స్తుతి, అసత్యాలు తప్ప కొత్తగా ఏం లేదు
– ప్రసంగం మొత్తం అర్థ సత్యాలు, అబద్దాలు, అవాస్తవాలు
– ఏడాదిన్నర పాలన వైఫల్యానికి నిదర్శనం గవర్నర్ ప్రసంగం
– అబద్దాల ప్రచారానికి గవర్నర్ ను సైతం వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ ది.
– గవర్నర్ ప్రసంగంపై మాజీ మంత్రి హరీశ్ రావు

హైద‌రాబాద్‌: గతేడాది గవర్నర్ ప్రసంగానికి, ఈసారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదు. గవర్నర్లు మారారు తప్ప, ప్రసంగాలు మారలేదు. చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లు.. ఇట్ల అబద్దాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ తో చెప్పించింది. ఏడాదిన్నర ప్రభుత్వ పాలనా వైఫల్యానికి గవర్నర్ ప్రసంగం నిదర్శనం.

రేవంతు అబద్దాల ప్రచారాన్ని నమ్మించేందుకు గవర్నర్ ని కూడా వాడుకోవడం సిగ్గుచేటు. గవర్నర్ మహాత్మ గాంధీ గారు చెప్పిన మాటలతో 32 పేజీల ప్రసంగం మొదలు పెట్టారు.
“నిన్ను నువ్వు కనుగొనడానికి అత్యుత్తమ మార్గం ఇతరుల సేవలో నిమగ్నమవ్వడమే” అని.

నిజానికి రేవంత్ రెడ్డి అత్యుత్తమ మార్గం డిల్లీ సేవలో, చంద్రబాబు సేవలో నిమగ్నం అయ్యాడని తెలంగాణ ప్రజలు భావిస్తున్నరు. ట్రాన్స్ ఫార్మింగ్ లైవ్స్ అన్నరు. ఎవరి లైవ్స్ ట్రాన్న్ ఫార్మ్ చేసారు. లగచర్ల, న్యాల్కల్, అశోక్ నగర్ లో రైతులను, నిరుద్యోగులను పోలీసులతో కొట్టించడం, ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ఇదేనా మీరు చెప్పిన ట్రాన్స్ ఫార్మింగ్ లైవ్స్.

ఇవ్వాళ కూడా ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేసి ప్రజాపాలన పేరిట పెద్ద ట్రాన్స్ ఫర్మేషన్ చేశారు. ఇంక్లూసివ్ డెవలప్ మెంట్ అంటే అన్ని వర్గాల ప్రజల డెవెలప్మెంట్ కావాలి. అంతే గానీ కాంగ్రెస్ మంత్రులు, నాయకుల డెవలప్మెంట్ కాదు. డిల్లీ డెవలప్ మెంట్ కాదు. 20శాతం కమిషన్లు తీసుకోవడమేనా మీరు చెప్పిన ఇంక్లూసివ్ డెవలప్మెంట్? ప్రజల సేవ ఎక్కడిది, స్వయం సేవా, ఢిల్లీ సేవలో తరిస్తున్నరు రేవంత్ రెడ్డి, మంత్రి వర్గం.

తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే చోట రాహల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టారు. తెలంగాణ సంస్కృతి అభివృద్ధికి చేపట్టిన చర్యలుగా భావించాలా? వ్యవసాయం పెంచింది ఎవరు గొప్పలు చెబుతున్నరు? 34లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాల మాగాణంగా మార్చింది కేసీఆర్ కాదా?

కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ వల్ల అది సాధ్యమైందన్నది వాస్తవం. గొప్పగా చెప్పిన 260 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రికార్డు కేసీఆర్ పదేళ్ల కృషితో సాధ్యమైందా, మీ ఏడాదిన్నర పాలనలో సాధ్యమైందా? రుణమాఫీ అనేది పెద్ద బోగస్. 41వేల కోట్ల రుణమాఫీ అన్నరు. బడ్జెట్ లో 31 వేల కోట్లు చెప్పి, 20వేల కోట్లు అని ప్రచారం చేసుకుంటున్నరు.

రైతు భరోసా 15వేలు ఇస్తమని, సిగ్గులేకుండా 12వేలకు తగ్గించి దాన్ని గొప్పగా గవర్నర్ ప్రసంగంలో చెప్పుకున్నరు. రైతు కూలీలకు 12వేలు ఇస్తున్నమని పచ్చి అబద్దం చెప్పించారు. ఇప్పటి వరకు కనీసం ఒక్క రూపాయి అయినా ఎవరి ఖాతాల్లో అయినా పడిందా?

అసలు 566 రైతు వేదికలు కట్టింది ఎవరు. అది కూడా మీ ఘనతేనా? కేసీఆర్ చేసింది కూడా కేసీఆర్ ముందే మీ ఘనత గా చెప్పుకోవడం సిగ్గుచేటు. చేనేతలకు ఉన్న పథకాలన్నీ రద్దు చేసి.. వాళ్లను బలహీనం చేసి.. దెబ్బతీసి.. ఇప్పుడు కొత్త పథకాన్ని ప్రకటించారు. రుణమాఫీ, రైతు భరోసాలాగానే ఈ పథకం అమలూ అంతేనా? అన్ని పంటలకు బోనస్ అని చెప్పి సన్నాలకు పరిమితం చేసారు. ఇంకా 400 కోట్లు పెండింగ్ ఉంది. 1200 కోట్లు ఇచ్చినం అనేది పచ్చి అబద్దం.

మీరు ఏర్పాటు చేసిన వ్యవసాయ కమిషన్ ఏం చేసింది. యాసంగిలో పంటలు వేయకండి అని చెప్పింది అంతకు మించి చేసిన పనేంటి. 445 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఏం చేస్తున్నాయి? కనీసం రైతు బీమా డబ్బులు కూడా ఇవ్వడం లేదు.

కృష్ణా జలాల గురించి గొప్పలు చెబుతున్నరు. కృష్ణా జలాలు ఆంధ్రా దోచుకుపోతుంటే మౌనంగా ఉన్న మీరు దాని గురించి మాట్లాడటం సిగ్గుచేటు. ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి మొదటి హామి నెలకు 2500 ఇప్పటికి దిక్కులేదు. ఇంకా దీన్ని గేమ్ చేంజర్ అని చెప్పుకుంటున్నరు. ఎస్ జీ హెచ్ లకు ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినం అని అబద్దం చెప్పారు. పది వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.

జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేసారు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఏటా 2లక్షల ఉద్యోగాలు అని యువతను మోసం చేసారు. విద్యావ్యవస్థ నిర్వీర్యం చేసారు. గురుకులాల్లో 83 మంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆరోగ్య శ్రీ అమలు కావడం లేదు. పోలీసు భద్రత అమలు కావడం లేదు. గొప్పలు మాత్రం చెప్పుకుంటున్నారు. సామాజిక న్యాయం.. బీసీలకు న్యాయం కోసం 42శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం బిల్లు పెడుతున్నారని పేర్కొన్నారు.

బీసీల కులగణన తప్పుల తడకగా చేసి.. ఇప్పుడు ఏ ప్రాతిపదికన బిల్లు పెడతారు? తప్పుల కులగణన చేసిన రోజును సామాజిక న్యాయ దినోత్సవంగా ఎలా జరుపుతారు? కనీసం అంబేద్కర్ విగ్రహానికి దండ కూడా వేయని వాళ్లు సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుతారా? కుల సర్వే చేసినం అంటున్నరు. ఆ సంఖ్య మీద బీసీ సంఘాలే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ప్రశ్నించిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తప్ప, వాస్తవ లెక్కలు బయటికి చెప్పడం లేదు.

ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసి ఉద్యోగ నియమకాలు పూర్తి చేస్తమని ఇదే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటించిండు. ఇప్పటికీ ఒక్క అడుగు ముందు పడలేదు. పెట్టుబడులు, పరిశ్రమలు వాపస్ పోతుంటే సిగ్గులేకుండా గొప్పలు చెబుతున్నారు. గుజరాత్; తమిళనాడు, ఆంధ్రాకు తెలంగాణకు వచ్చిన పరిశ్రమలు తరలిపోతున్నాయని మీడియా కోడై కూస్తున్నది. లక్షా 78వేల కోట్ల పెట్టుబడులు వచ్చినయని గొప్పలు చెబుతున్నరు. అసలు దావోస్ లో జరిగే ఒప్పందాలు ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటెంట్ అని మీ ఉప ముఖ్యమంత్రి చెప్పిండు.

ఇప్పటి వరకు మీరు చెప్పిన ఒప్పందాలు ఎన్ని గ్రౌండ్ అయ్యాయి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంఎస్ఎంఇలు ఇబ్బందులు పడుతుంటే, కొత్త పాలసీ అని డబ్బా కొడుతున్నరు. పోలీసు ఫ్యామిలీలు రోడ్డు ఎక్కినవి. అయినా పోలీసు సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నమని డబ్బా కొట్టారు. ముఖ్యమంత్రిపై పొగడ్తలతో గుదిగుచ్చి తయారుచేసిన ప్రసంగం ఇది. పాడిందే పాటరా అన్న చందంగా ఏడాది కాలంగా చెప్తున్నవే మళ్లీ మళ్లీ చెప్పి.. చెప్పించిన నిస్సారమైన ప్రసంగం ఇది.

 

LEAVE A RESPONSE