– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
రాజమహేంద్రవరం: రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కోసం విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నాం.. ప్రతి కార్యకర్త అభిప్రాయాన్ని తీసుకుంటున్నాం.. రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవాల్సిన అవసరం ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం జరిగిన తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. ఈ దేశ ప్రధాని రాహుల్ గాంధీ అవ్వాలి.. 11 ఏళ్లుగా బీజేపీ పాలనలో దేశం వెనకబడిందని విమర్శించారు. ఆమె ఇంకా, ఏమన్నారంటే.. రాష్ట్రాన్ని బీజేపీ దారుణంగా మోసం చేసింది. విభజన హామీలు ఒక్కటి అమలు కాలేదు. రాష్ట్ర విభజన సమస్యలు మోడీకి పట్టడం లేదు.
ఈ రాష్ట్రంలో యోగా చేసి వెళ్ళిపోయారు. యోగా మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధి మీద లేదు. రాష్ట్ర అవసరాలను పట్టించుకోవడం మానేశాడు. పోలవరం నిర్వీర్యం చేస్తున్న ద్రోహి మోడీ. ఎత్తు తగ్గించి రాష్ట్రానికి అన్యాయం చేశారు. 41 మీటర్ల ఎత్తు అంటే అది ప్రాజెక్ట్ కానే కాదు. పోలవరం ప్రాజెక్టు ఆశయాలు నెరవేరవు. పోలవరం ప్రాజెక్ట్ ప్రయోజనాలు దెబ్బతీస్తుంటే ఒక్క ఎంపీ కూడా మాట్లాడటం లేదు.
అన్ని పార్టీలు మోడీకి గులాం గిరి చేస్తున్నాయి. బాబు, పవన్, జగన్ ముగ్గురు మోడీకి ఊడిగం చేస్తున్నారు. 10 ఏళ్లు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. రాజధాని నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిది. విభజన హామీల్లో రాజధాని కేంద్రం నిర్మించి ఇవ్వాల్సి ఉంది. కానీ రాజధానికి నిధులు కాకుండా అప్పులు ఇస్తున్నారు. ఇంత అన్యాయం చేస్తుంటే ప్రశ్నించే వాళ్లు ఒక్కరు లేరు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవ్వాల్సి ఉంది. విభజన హామీలు కాంగ్రెస్ అధికారంలో వస్తేనే సాధ్యం. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం పై దృష్టి పెట్టాం. ఈ నాలుగేళ్లు మనకు అత్యంత కీలకం.