Suryaa.co.in

Andhra Pradesh

ఇంకా వైసీపీవాళ్లే తెరవెనక పెత్తనం చేస్తున్నారంటున్నారు

– వైసీపీ మాఫియాలపై చర్యలు తీసుకోవాలని నిలదీస్తున్నారు
– మా కార్యకర్తలలే వైసీపీకి వ్యతిరేకంగా రోడ్డెక్కాలంటున్నారు
– పింక్ డైమండ్ అని కూసిన రోజే విజయసాయిరెడ్డిని జైల్‌లో పెట్టాల్సింది
– వైసీపీ అరాచకాలపై రోడ్డు ఎక్కాల్సింది మేము!
– ఏ ముఖం పెట్టుకుని ధర్నా చేస్తారు?
– జగన్ రెడ్డి పాలనలో ఏనాడైనా డీఎస్సీలు చేపట్టారా?
– నిద్రలేచి పత్రిక తెరిస్తే ఈ రోజుకీ వైసీపీ ల్యాండ్, మైన్ మాఫియాల దందాలే
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

అమరావతి : ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైనా ఏ2, ఏ2లతో పాటు అంతా తామై వ్యవహరించిన ఆ నలుగురిలో ఎవరిపైనా చర్యలు లేవని మా వాళ్లు ధర్నా చేయాలంటున్నారు. ఇంకా తెరవెనుక నుంచి వాళ్లే పెత్తనం చేస్తున్నారని వస్తున్న వార్తలు చూసి మా కార్యకర్తలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. వైసీపీ మాఫియాపై వెంటనే చర్యలు తీసుకోవాలని, వారి పాపాలకు ఫలితం అనుభవించేలా శిక్షలు పడాలని మేం రోడ్డెక్కాలని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఇక్కడి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

విద్యావ్యవస్థను విధ్వంసం చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ధర్నా చేస్తారు… వైసీపీ పాలనలో విద్యా రంగాన్ని ఎంత దిగజార్చారో అసర్ నివేదిక చెబుతోంది. పింక్ డైమండ్ అని కూసిన రోజే విజయసాయిరెడ్డిని జైల్‌లో పెట్టాల్సింది. పుంగనూరు నుంచి విశాఖ వరకూ ఎక్కడ చూసినా అక్రమాలు, అరాచకాలే. లెక్కకు మించి దోపిడీలు, దుర్మార్గాలు చేసిన ఏ1, ఏ2తో పాటు ఆ నలుగురినీ వదిలిపెట్టకూడదని ప్రజలందరూ కోరుకుంటున్నారని సోమిరెడ్డి అన్నారు.

ఇంకా, ఆయన ఏమన్నారంటే.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అమలు కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న ప్రజానీకం. ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసిన వైసీపీ ధర్నాల పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. విద్యార్థులకు బకాయీలు పెట్టిపోయి రేపు అయిదో తేదీ ఏ ముఖం పెట్టుకుని ధర్నా చేస్తారు? టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.700 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయీలను విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం వివిధ అంశాలకు సంబంధించి బకాయీ పెట్టిపోయిన మొత్తంలో రూ.6 వేలు కోట్లు విడుదల చేశారు.

రాష్ట్రంలో విద్యావ్యవస్థకు సంబంధించి అసర్(యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్) నివేదిక వైసీపీ ప్రభుత్వ ఘోర వైఫల్యానికి అద్దం పడుతోంది. ఎనిమిదో తరగతి చదువుతున్న వారిలో కొందరు మూడో తరగతి పుస్తకాలు చదవలేకపోతున్నారని వెలుగుచూడటం బాధాకరం. నాడు-నేడు అని సొంత డప్పుకొట్టుకున్న జగన్ రెడ్డి చివరకు స్కూళ్లలో మరుగుదొడ్ల సమస్యను కూడా తీర్చలేకపోయారు.
విద్యావ్యవస్థను సర్వనాశనం చేసినందుకు అసర్ నివేదిక చూసి సిగ్గుతో తలదించుకోవాలి. వైసీపీ పాలనలో చేసిన పాపాలపై ఆ పార్టీ నాయకులు ధర్నాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16437 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీకి రూపకల్పన చేసింది..ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది.

జగన్ రెడ్డి పాలనలో ఏనాడైనా డీఎస్సీలు చేపట్టారా…టీచర్ పోస్టులు భర్తీ చేశారా? నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యావ్యవస్థను తిరిగి గాడిలో పెడుతున్నారు. వ్యవస్థలను సర్వనాశనం చేసిన వైసీపీ సర్కారు పాపాలపై ధర్నాలు చేయాల్సింది మేము. నిద్రలేచి పత్రిక తెరిస్తే ఈ రోజుకీ వైసీపీ ల్యాండ్, మైన్ మాఫియాల దందాలే చదువుకోవాల్సివస్తోంది.

LEAVE A RESPONSE