దేవులపల్లి అమర్ అనే పేరు తెలుగు రాజకీయాలతో పరిచయం ఉన్నవారికి గుర్తుండే ఉంటుంది. తెలంగాణకు చెందిన ఒక జర్నలిస్ట్. జగన్ నేతృత్వం లో పనిచేసినఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో క్యాబినెట్ ర్యాంక్ తో మీడియా సలహాదారుగా కాలక్షేపం చేశారు.
ఆయన వాట్సాప్ ఖాతాలో…. ప్రొఫైల్ ఫోటో కింద ” who am I? ” అని కనపడింది. నిజమే. మనం ఎవరిమో మనకు తెలియదు. మామూలు మనుషులమే గానీ , సందర్భాన్ని బట్టి విశేషణాలు మారుతుంటాయి .
బెంగళూరు లో క్రికెట్ వెర్రి లో పడి ప్రాణాలు పోగొట్టుకున్న 11 మంది – ‘ క్రికెట్ అభిమానులు ‘ అయ్యారు . తిరుపతి లో ఈ మధ్య జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారు- ‘భక్తులు ‘ అయ్యారు . హోటళ్ల లో తిని అస్వస్థత కు గురైతే , వారే ‘ బాధితులు ‘ అవుతారు . ఏదో ఒక పార్టీ తరఫున ధర్నా లో , రాస్తా రోకో లో చేస్తే , ‘ పార్టీ కార్యకర్త లు ‘ అవుతారు . పోలీస్ కేసులలో ఇరుక్కుంటే ….’ నిందితులు ‘ అవుతారు .తరువాత ‘ రిమాండ్ ఖైదీ’ లు అవుతారు .అక్కడ నుంచి బయలు దేరి , కొద్దిగా ముందుకు వెళ్ళి ‘ ముద్దాయిలు ‘ అవుతారు . తరువాత ….ఖైదీ లు అవుతారు .
ఏదైనా పబ్లిక్ మీటింగ్ కు వెడితే , ‘ సభికులు ‘ అవుతారు . అదే రాజకీయనాయకుల మీటింగ్ లకు వెడితే , ‘ నా అక్కలు , చెల్లెమ్మలు , సోదర సోదరీ మణులు ‘ అవుతారు . ఎలక్షన్ సీజన్ లో అయితే , ‘ ఓటర్ మహాశయులు ‘ అవుతారు . ఓటింగ్ పూర్తయిన తరువాత ‘ వెర్రి పప్పలు ‘ అవుతారు . వంట్లో బాగా లేక ఆస్పత్రులకు వెడితే… రోగులు అవుతారు. గుండె కొంచెం నొప్పిగా ఉన్నట్టనిపిస్తే…. హార్ట్ పేషెంట్స్ అవుతారు.
పోలీస్ స్టేషన్లలో పిచ్చ కొట్టుడు కొట్టి లోపలేస్తే , ‘ బాధితులు ‘ అవుతారు.
పనీ… పాటా లేక బేవర్స్ గా రోడ్ల మీద తిరుగుతూ…. అటూ ఇటూ వెళ్లే ఆడ పిల్లలను చూస్తూ వెకిలి చేష్టలకు దిగితే…. ఆకతాయిలు అవుతారు. ఆకతాయిలు ముదిరితే…. రౌడీ షీటర్లు అవుతారు. రౌడీ షీటర్లు ముదిరితే…. రాజకీయ నాయకులు అవుతారు. అదే – మహిళలైతే…; చిలకలూరి పేట రజనీ నో…. నగరి రోజానో అవుతారు.
రాజకీయ నాయకులు ఇంకా ముదిరితే, కబ్జా కోరులు, మర్డరర్లు, దౌర్జన్యకారులు, రేపిష్టిలు, అబద్దాల కోర్లు, దోపిడీ దార్లు అనంత బాబులు, కొడాలి/ పేర్ని నానిలు, అంబటి రాంబాబు లు అవుతారు. ఇంకో అడుగు ముందుకు వేసినవాళ్లు…. పిన్నెల్లి బ్రదర్స్ అయినా అవుతారు. లేకపోతే ఏదో ఒక దిక్కుమాలిన ప్రభుత్వానికి సలహాదారులైనా అవుతారు.
ఈ బాపతు జనాలను ఆడించేవాళ్ళను ఏమంటారో…. ప్రత్యేకం గా చెప్పేదేముంది!?.
ఇలా… ఆయా సందర్భాలను బట్టి, వారి చేష్టలను బట్టి మనుషులను కేటగిరైజ్ చేస్తుంటాం.
కానీ, ఈ వర్గీకరణ తాత్కాలికం. స్టేడియం లోంచి బయటకు వచ్చిన మరుక్షణం…. వారు క్రికెట్ అభిమానులు కాదు.. గుళ్ళు, గోపురాల లోంచి బయట పడితే, వారు భక్తులు కారు. ఎన్నికలు పూర్తయ్యి పోతే, వారు ఓటర్ మహాశయులు కాదు. ” ఎవడ్రా నువ్వు? ఎక్కడో చూసినట్టుందే… ” గాళ్ళు అయిపోతారు.సిమా హాల్లోంచి బయటకు వచ్చేసిన మరుక్షణం వారు ప్రేక్షకులు కాదు.సినిమాలను, అవి తీసిన వాళ్ళను పచ్చి బూతులు తిట్టేవాళ్ళు అవుతారు.
ఇలా…. మనకు ఊహ తెలిసిన దగ్గరి నుంచి చచ్చే వరకు ఏదో ఒకటి అవుతూనే మన కాలం గడిపేస్తుంటాం.
అందువల్ల, ” హు యామ్ ఐ? ” అని ప్రత్యేకం గా ప్రశ్నించుకోవలసిన పని లేదు.
– భోగాది వేంకట రాయుడు