(మీనా యోగేశ్వర్)
తిరుమల విషయంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను
తిరుమల లడ్డూ వయసెంతో తెలుసా!
తిరుమల అంటే మనలో చాలా మందికి టక్కున గుర్తుకు వచ్చేది లడ్డూ ప్రసాదమే. వందల ఏళ్లకు పూర్వమే తిరుమల ఆలయం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ప్రాచుర్యం పొందింది. అలాంటి ఆలయం పేరు చెప్పగానే గుర్తు వచ్చే లడ్డూని ఎప్పటి నుంచీ స్వామి వారికి ప్రసాదంగా నివేదిస్తున్నారో తెలుసా. కమ్మటి వాసనతో, చక్కటి రుచితో, ఎన్నో రోజులు నిలువ ఉండే ఈ లడ్డూకి వయసు కేవలం 226 ఏళ్ళు మాత్రమే. 17 శతాబ్దానికి పూర్వం ఆలయానికి వచ్చే యాత్రికులకు ఎక్కువగా వడ ప్రసాదాన్ని అమ్మేవారు. 13వ శతాబ్దానికి ముందు నుంచీ ఆలయంలో ప్రసాదం కోసం దాతలు దేవదేయం చేసేవారు. అలా బంగారమో, ధనమో, భూములో దేవదేయంగా దానం చేసేటప్పుడు శిలాశాసనం వేసేవారు. ఆలయ కమిటీ సభ్యులైన స్థానత్తార్లు దేవదేయం చేసినప్పుడు ఆ నైవేద్య గంగాళంలో భాగాలను సిబ్బందికి, అధికార్లకు, స్థానత్తార్లకు, అర్చకులకు చెందేట్లు శాసనం రాసేవారు. అలా వచ్చిన భాగాలను అధికార్లంతా కలసి ఒక కౌంటరు ద్వారా యాత్రికులకు అమ్మేవారు. దూర ప్రాంతాల నుంచీ వచ్చిన రాజులు, ధనవంతులూ దేవదేయం చేసేటప్పుడు మాత్రం ప్రాసాదంలో కొంత భాగాన్ని, ముఖ్యంగా దాతల భాగాన్ని యాత్రికులకు ఉచితింగా పంచిపెట్టాలని శాసనం రాయించేవారు. ఈ వ్యవస్థనంతా తారుమారు చేస్తూ, ఎక్కువ భాగం యాత్రికులకు, ఆలయంలో కాయకష్తం చేసే సిబ్బందికి, అర్చకులకు అందేలా దేవదేయం చేసినవాడు మాత్రం గోల్కొండ మంత్రి అక్కన్న. తిరుమల, గోల్కొండ పరిపాలన కిందకి వచ్చాకా ఆయన దిగువ తిరుపతిలోనే చాలా కాలం ఉండి అక్కడి నుంచే తన బాధ్యతలు నిర్వర్తించినట్లు చారిత్రిక ఆధారాలు ఉన్నాయి.
అయితే ఆలయం ఈస్టిండియా కంపెనీ వారి అధికారంలోకి వచ్చాకా వారు చేసిన పని, ఆలయ దేవదేయం కింద వచ్చిన భూముల్ని, ఊర్లని హస్తగతం చేసుకోవడం. అలాగే దేవదేయంగా తయారు చేయబడిన ప్రసాదంలో అందరి భాగాలనూ తీసేసుకుని యాత్రికులకు అమ్మి, సొమ్ము చేసుకున్నారు కంపెనీ వారు. అలాంటి సమయంలోనే 1803లో ఎక్కువ రోజులు నిలువ ఉండేలాగా, ఎక్కువ అమ్మేందుకు వీలు ఉండేలాగా అప్పటికే ప్రసాదంగా ఉన్న తీపి బూందీని, లడ్డూగా మార్చి అమ్మడం ప్రారంభించారు. అలా ఆలయ ప్రసాదాల చిట్టాలోకి లడ్డూ వచ్చి చేరింది. నిజానికి చాలా మంది భక్తులకు తెలియని శ్రీవారి ప్రసాదాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని:
సంధి తిరుప్పానకం-అన్న నైవేద్యం
తిరుప్పానకం
రజన తిరుప్పానకం
వెళ్ళై తిరుప్పానకం
అర్ధనాయకతళిగ
నాయికతళిగ
దధ్యోదనం
మట్టిరాయ్ తళిగ
తిరుప్పావడ-పులిహోర లాంటిది
తిరువలక్కం
తిలాన్నం-నువ్వుల అన్నం
అక్కలిమండై
ఇవన్ని అన్నప్రసాదాలే.
ఇక భక్ష్యాల విషయానికి వస్తే:
అప్పపడి-అప్పాలు
అతిరసపడి-అరిసెలు
వడైపడి-వడ
గోధిపడి-గోధుమవడ
సుఖియాన్ పడి
ఇడ్డిలీపడి-ఇడ్లీ
సిడై పడి
ప్రోదిలింగైపడి
పోరిపడి-అటుకులు
తిరుక్కనమడై-మినప సున్నుండ
దీనినే మనోహరపడి అంటారు. కర్ణాటకలోని మేల్కోటే, మధురై మీనాక్షీ అమ్మవారి ఆలయాలలో ప్రధాన ప్రసాదం ఇది.
పారుప్పువియలు-సాతాళించిన గుగ్గిళ్ళు
దీనినే సుండల్ అని కూడా అంటార్).
అవల్ పడి-గట్టి అటుకులు
తెరకు లాల్
పంచవాహి-పవిత్ర అన్నం
బెల్లం
పంచదార
పళ్ళు
ప్రత్యేకంగా అయా ఋతువులలో పండే పళ్ళు ఖచ్చితంగా ఉండి తీరాలి
వేయించిన జీడిపప్పు,
బాదంపప్పు
పవళింపు సేవ అనంతరం నివేదన చేస్తారు
జిలేబి,
దోసె,
ఉదయం కొలువు (పంచాగం చదివి, ముందు రోజు జమా ఖర్చులు, ఆ రోజు కొలువు శ్రీనివాసునికి విన్నవిస్తారు) తరువాత నివేదన చేసేవి:
వేయించిన నువ్వుల పొడి,
కజ్జికాయలు,
పాలు,
పెరుగు,
వెన్న,
తాంబూలం
వంటి ఎన్నో రకాల ప్రసాదాలు స్వామి వారికి నివేదన చేస్తారు. అయితే ఇవేవి కులశేఖరపడి దాటి గర్భగుడిలోనికి వెళ్ళవు. గర్భగుడిలోని మూల మూర్తికి కేవలం సగం పగలగొట్టిన కొత్త కుండలో అన్నాన్ని నివేదన చేస్తారు. నివేదన పూర్తయ్యాకా దానిని విసర్జించి, తరువాతి రోజుకి కొత్త కుండ తెస్తారు. అందుకే అన్నమయ్య “తోమని పళ్ళాలవాడా” అని వేంకటేశ్వరుని పిలిచాడు. విజయనగర పరిపాలనా కాలం తిరుమలకు స్వర్ణ యుగంగా చెప్పుకోవచ్చు. సంపద, స్వామివారికి నగలు, యాత్రికుల పెరుగుదల మాత్రమే కాక, ప్రసాదాల విషయంలోనూ ఒక వెలుగు వెలిగిందనే చెప్పాలి.
ఆ సమయంలో శ్రీనివాసుడు రోజుకు 100 రకాల ప్రసాదాలు స్వీకరించేవాడు. కానీ ఎంతోమందికి ఇష్టమైన లడ్డూని ప్రసాదంగా ప్రవేశపెట్టిన ఘనత మాత్రం ఈస్టిండియా కంపెనీ వారికే దక్కింది. వారు ఆదాయం కోసం చేస్తే, అది మాత్రం తిరుమలకు చిరునామాగా నిలిచిపోయింది. అందుకే అంటారు ఏం జరిగినా మన మంచికే అని.
2. 1200 ఏళ్ళ పూర్వమే తితిదే
తితిదే-తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల, దిగువ తిరుపతిలలోని ఆలయాలను నిర్వహించే సంస్థ. తిరుపతిలోనే కాక, అక్కడి దగ్గరలోని మరెన్నో ఆలయాలను నిర్వహిస్తోంది తితిదే. ఈ ఆలయాల పూర్తి బాధ్యత ఈ సంస్థదే. తితిదే 1933లో ప్రారంభమైన ఈ సంస్థ 1200 ఏళ్ళ నుండీ ఉండడమేమిటి అనుకుంటున్నారా. క్రీ.శ 800 సంవత్సరానికి పూర్వమే అచ్చంగా తితిదేలానే కాకపోయినా తిరుమల, తిరుపతి, తిరుచానూరులోని అనేక ఆలయాలను నిర్వహించేందుకు ఒక సంస్థ ఉండేది. దాని పేరే “శ్రీ వైష్ణవ సభ”.
1978లో అప్పటి తిరుమల-తిరుపతి దేవస్థానాల పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు తిరుమల, దిగువ తిరుపతి, తిరుచానూరులలో దొరికిన శిలాశాసనాలను సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ఆధ్వర్యంలో పరిష్కరించి, పరిశోధనలు జరిపారు. మొత్తం 1252 శాసనాలు దొరకగా అందులో ఎక్కువ శాతం తమిళంలోనూ, అతికొద్దిగా సంస్కృతంలోనూ, కన్నడంలోనూ ఉండగా, కేవలం 6 తెలుగు శాసనాలు ఉన్నాయి.
వీటిలో మొదటది క్రీస్తు శకం 800 సంవత్సరానికి చెందినది. ఒక భక్తుడు కొండమీద వేంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తి ముందు దీపం పెట్టేందుకు దానంగా 30 కళంజుల బంగారాన్ని తిరుచానూరులోని శ్రీ వైష్ణవ సభ వారికి సమర్పించినట్టుగా రాసిన శాసనం అది. తరువాత దొరికిన శాసనం క్రీస్తు శకం 935 సంవత్సరంలోనిది.
మలైనాడుకు చెందిన కొడుంగోలూరన్ అనే భక్తుడు తిరుమలలో అఖండదీపం కోసం 40 కళంజుల బంగారాన్ని వైష్ణవ సభకు సమర్పించినట్టుగా దాన శాసనం అది. ఈ రెండు శాసనాల ద్వారా తెలిసేది ఏమిటి అంటే ఇప్పుడు తితిదే లాగా అప్పట్లో తిరుమల ఆలయాన్ని నిర్వహించేందుకు తిరుచానూరులో శ్రీ వైష్ణవ సభ అనే సంస్థ ఉండేదని, భక్తులు ఇవ్వదలచిన కానుకలు భూముల రూపంలోనో, నగల రూపంలోనో, లేదా నగదు రూపంలోనో ఈ వైష్ణవ సభకే సమర్పించాలని తెలుస్తోంది.
ఈ సంస్థ తిరుచానూరు నుంచి కార్యకలాపాలు నిర్వహించేది. ఆ నాటికి తిరుమల కొండపైన ఏ విధమైన సౌకర్యాలూ లేకపోవడంతో, పూర్తిగా అడవి కావడంతో, పైన ఎవరూ నివాసం ఉండేవారు కాదు. యాత్రికులూ, అర్చక స్వాములూ కూడా ఉదయమే కొండ ఎక్కి స్వామిని సేవించుకుని, రాత్రికి కిందకి వచ్చేసేవారు. కొందరు రాజులూ, ధనికులు, గుంపులుగా వచ్చిన భక్తులు మాత్రం తాత్కాలికంగా గుడారాలు ఏర్పాటు చేసుకుని రెండు, మూడు రోజులుండేవారే తప్ప, పైన ఎటువంటి ఆవాసాలూ ఉండేవి కావు. దాంతో ఈ ఆలయాన్ని నిర్వహించే శ్రీ వైష్ణవ సభ కూడా తిరుచానూరు నుండే పని చేసేది. ఈ వైష్ణవ సభలో 108 సభ్యులు ఉండేవారు.
3. ఏడాదికి 9 బ్రహ్మోత్సవాలు చేయించుకున్న ఏడుకొండలవాడు
శ్రీకృష్ణదేవరాయల కాలానికి పూర్వం నుంచీ ఏడాదిలో 9 బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. అందులో ఏడు ఉత్సవాలు వేంకటేశ్వరస్వామికి నిర్వహించగా, మిగిలిన రెండు నెలల్లో, నెలకొకటి చొప్పున రెండు ఉత్సవాలు తిరుపతిలోని గోవిందరాజస్వామివారికి నిర్వహించేవారు. ఐతే ఆ 7 బ్రహ్మోత్సవాలలో ఏ ఒక్కటీ పూర్తిగా కొండ మీద జరిగేది కాదు. అంకురార్పణ, ధ్వజారోహణ మాత్రం కొండపై ఆలయంలో జరిగేవి.
ధ్వజారోహరణ అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా, కొండ కింద ఉన్న తిరుచానూరుకు తీసుకువచ్చి, అక్కడే వాహనోత్సవాలు, స్నపన తిరుమంజనం వంటి ఉత్సవాలు చేసేవారు. తొమ్మిదవ రోజున అవభృత స్నానం పూర్తి అయ్యాకా, తిరిగి తిరుమల ఊరేగింపుగా తీసుకువెళ్ళేవారు. అక్కడ ధ్వజ అవరోహణం, ప్రాయశ్చిత్తం చేసి, ఆఖరి రోజున పుష్ప యాగం చేసేవారు.
రామానుజులు తిరుమల వచ్చాకా చేసిన అనేక మార్పుల్లో ముఖ్యమైనది, తిరుమలను ఆవాస యోగ్యంగా మార్చడం. ఆలయ ప్రాకారానికి నాలుగు వైపులా మాడ వీధులు, ఆలయం ముందు సన్నిధి వీధి నిర్మించాడు. కొండపైనే అర్చక స్వాములకు, ఆచార్య పురుషులకు, ఆలయ అధికారులకు నివాసాలు ఏర్పాటు చేయించాడు. అలా బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాలూ కూడా తిరుమలకే చేరుకున్నాయి. అప్పటి నుంచి, ఇప్పటి వరకూ కూడా అన్ని వాహన సేవలూ ఆయన ఏర్పాటు చేసిన మాఢ వీధులలోనే జరుగుతున్నాయి.
అయితే అప్పట్లో బ్రహ్మోత్సవాల ఆఖరి రోజున పుష్ప యాగం జరిగేది. కానీ అది ఈస్టిండియా కంపెనీ వారి పాలనలో రద్దు చేయబడింది. ఆ తరువాత 1980లో అప్పటి తితిదే కార్యనిర్వాహణాధికారి పి.వి.ఆర్.కె.ప్రసాద్ ఆధ్వర్యంలో తిరిగి పుష్ప యాగాన్ని ప్రారంభించినా, అది స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున చేస్తున్నారు.
బ్రహ్మోత్సవాల తరువాత చాలా ముఖ్యమైన ఉత్సవాలు వసంతోత్సవం, పవిత్రోత్సవం. ఈ రెండూ 14, 15 శతాబ్ధాలలో ప్రారంభమైనట్టు ఆధారాలున్నాయి. సాళువ నరసింహ రాయలు దగ్గర బంధువైన సాళువ మల్లదేవ మహారాయలు ఈ ఉత్సవాలను ప్రారంభించాడు. వసంతోత్సవాన్ని 3 రోజులు, పవిత్రోత్సవాన్ని 5 రోజులూ చేస్తారు. ఇవి కూడా కంపెనీ వారి కాలంలో ఆగిపోయి, తిరిగి 20వ శతాబ్ధంలో ప్రారంభయ్యి, ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్
1978 నుంచి 1982 వరకూ తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వాహణాధికారిగా పనిచేసిన మాజీ ఐ.ఎ.ఎస్ అధికారి కీర్తిశేషులు శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు తిరుమల ఆలయానికి ఎంతో సేవ చేసారు. మాస్టర్ ప్లాన్ అమలు చేసి, మనం ఇప్పుడు చూస్తున్న విశాలమైన తిరుమాడ వీధులు గల ఆలయంగా తిరుమలను తయారు చేసినవారు ఈయనే. తితిదే నిర్వహిస్తున్న గొప్ప కార్యక్రమాలలో ఒకటైన నిత్యాన్నదానాన్ని ప్రారంభించింది ప్రసాద్ గారే. ఆయన తిరుమలలో తన అనుభవాలను సర్వసంభవాం(నాహం కర్తా హరిః కర్తా) అనే పుస్తకం ద్వారా వెల్లడించారు. అలాగే తిరుమల లీలామృతంలో పురాణాలలో తిరుమల ప్రస్తావన, విశిష్టతల గురించీ, తిరుమల చరితామృతంలో చారిత్రికంగా తిరుమల ఆలయ విశేషాలనూ రాశారు. ఆ తిరుమల చరితామృతం పుస్తకంలో నేను చదివిన కొన్ని ఆసక్తికరమైన అంశాలనే ఈ ప్రశ్నకు సమాధానంగా రాశాను.